మోడీ సొల్లు మాటలు ఆపి, 15 వేల కోట్లు ఇవ్వండి: షర్మిల
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే అని ఆరోపించారు.
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే అని ఆరోపించారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీ గారికి ఆంధ్రుల హక్కు మీద లేదన్నారు. విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని మోడీ గారి దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్ ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉందని ఆరోపించారు.
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి HD కుమారస్వామి గారు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల సహాయం అందించారు. స్టీల్ ప్లాంట్ ను బ్రతికించారన్నారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదని విమర్శించారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం ఉండే JD(S)..రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. ఎన్డియేకు ఊపిరి పోసిన టీడీపీ- జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయన్నారు.
18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారని ఎద్దేవా చేసారు. ఇది నిజంగా సిగ్గు చేటు. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనమని ఆమె మండిపడ్డారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గిందని, ప్లాంట్ దివాలా తీసే స్థాయిలో ఉందని, కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి.. స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కార్మికులు 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మోడీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడలట. ఇదెక్కడి న్యాయం ? అని నిలదీశారు.