Ys Sharmila: ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి భారీ స్కెచ్.. ఇడుపులపాయకు ప్రియాంక.. షర్మిలకు గోల్డెన్ ఛాన్స్!

కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగితే తనకు మేలు జరుగుతుందని షర్మిల భావించారు. దీనిలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను కలిసి చర్చించారు. అయితే, కలిసి పోటీ చేయడకంటే.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని డీకేసహా అధిష్టానం సూచించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 22, 2023 | 09:08 AMLast Updated on: Jun 22, 2023 | 9:08 AM

Ys Sharmila To Merge Ysrtp With Congress A Huge Sketch To Strengthen Congress In Ap Priyanka Going To Idupulapaya

Ys Sharmila: కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపైనే కాదు.. ఏపీపై కూడా స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కోల్పోయిన పార్టీ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా వైఎస్ షర్మిలతో భారీ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ దక్కలేదు. కీలక నేతలెవరూ పార్టీలో చేరలేదు. షర్మిల మినహా ఒకరిద్దరు కూడా చెప్పుకోదగ్గ నేతలు లేరు. దీంతో తనకు ఇక్కడ ఆదరణ లేదని గుర్తించిన షర్మిల ప్రత్యామ్నాయాలవైపు చూశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగితే తనకు మేలు జరుగుతుందని షర్మిల భావించారు. దీనిలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను కలిసి చర్చించారు. అయితే, కలిసి పోటీ చేయడకంటే.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని డీకేసహా అధిష్టానం సూచించింది. ఇలా చేస్తే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు, ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఏపీలోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల సేవల్ని ఇటు తెలంగాణలో.. అటు ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇది కచ్చితంగా కాంగ్రెస్‌కు మేలు చేసేదే.
ఏపీలో కాంగ్రెస్‌కు బూస్ట్
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బాగుంది. షర్మిల కూడా తోడేతే మరింత ప్రయోజనం ఉంటుంది. సెటిలర్లుసహా వైఎస్‌ను అభిమానించే కొన్ని వర్గాల ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అన్నింటికీ మించి షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. షర్మిలకు తెలంగాణతోపాటు ఏపీలోనూ కీలక బాధ్యతల్ని అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. షర్మిల తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది. ఈ సమయంలో వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలను రంగంలోకి దించితే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. పైగా అక్కడ షర్మిల అన్న, వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. అన్న వదిలిన బాణం అని చెప్పుకొన్న షర్మిలను, తల్లి విజయమ్మను జగన్ పట్టించుకోవడం లేదన్న సంగతి తెలిసిందే. జగన్, షర్మిల మధ్య ఆస్తి, వ్యాపార, రాజకీయ విబేధాలున్నాయని ప్రచారం జరిగింది. దీంతో షర్మిల అన్నకు దూరంగా తెలంగాణలో పార్టీ స్థాపించారు. ఈ నేపథ్యంలో అక్కడ అన్నను ఎదుర్కొనేందుకు చెల్లిని పోటీలోకి దింపితే జగన్‌కు ఎదురుదెబ్బ తప్పదు. వైఎస్సార్‌ను అభిమానించే వర్గాలు షర్మిలను కూడా ఎంతోకొంత ఆదరించే అవకాశం ఉంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా తిరిగి ఏపీలో పార్టీ పుంజుకునేలా చేయొచ్చని కాంగ్రెస్ ప్లాన్.
ఇడుపులపాయకు ప్రియాంక..?
షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయం కావడంతో ఏపీలోనూ కాంగ్రెస్‌ను బాగుచేసేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా వైఎస్ సమాధివద్ద నివాళులు అర్పించేందుకు ఇడుపులపాయకు ప్రియాంకా గాంధీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిలతోపాటు, ప్రియాంక ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ వైఎస్‌కు నివాళులు అర్పిస్తారు. ఇక్కడే షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. వైఎస్‌కు నివాళులు అర్పించడం ద్వారా ఆయన తమపార్టీకే చెందిన నేతగా కాంగ్రెస్ చెప్పుకొనే అవకాశం ఉంటుంది. ఇకపై వైఎస్ ఇమేజ్‌ను షర్మిల ద్వారా కాంగ్రెస్ కూడా వాడుకుంటుంది. దీంతో జగన్‌కు రాజకీయంగా నష్టం జరగడం ఖాయం.