YS Sharmila: వైఎస్ షర్మిల.. రెండు రాష్ట్రాలు.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి షర్మిల చరిష్మాను వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం తొలుత భావించినట్టు వినికిడి. ఏపీలో హస్తం పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామనే ప్రపోజల్ పెట్టినా.. ఆమె ససేమిరా అన్నారట.
YS Sharmila: వైఎస్ షర్మిల అడుగు ఎటువైపు పడబోతోంది..? కాంగ్రెస్‌తో ఆమె “చెయ్యి” కలుపుతారా..? లేక ఒంటరిగా ఎన్నికల బరిలోకి దూకడానికే మొగ్గు చూపుతారా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల చేరిక ఖాయమనే వార్తలు వస్తుండగా.. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి షర్మిల చరిష్మాను వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం తొలుత భావించినట్టు వినికిడి. ఏపీలో హస్తం పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామనే ప్రపోజల్ పెట్టినా.. ఆమె ససేమిరా అన్నారట. తనను తెలంగాణకు పరిమితం చేయాలని కాంగ్రెస్ పెద్దలకు షర్మిల తేల్చి చెప్పారని సమాచారం.
అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి రేవంత్ నో
తెలంగాణకు సంబంధించి షర్మిల పెట్టిన డిమాండ్లలో ఆచరణ సాధ్యమైనవి ఏమున్నాయి..? ఏం లేవు..? అనే దానిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అధిష్టానం పెద్దలతో కలిసి మేధోమథనం చేస్తున్నారు. షర్మిలకు తెలంగాణ అసెంబ్లీ టికెట్ ఇవ్వడాన్ని రేవంత్ వ్యతిరేకిస్తున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ఆమెను సికింద్రాబాద్ లోక్‌సభ బరిలో దింపాలని అధిష్టానం దగ్గర రేవంత్ ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనిపై షర్మిలతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినా, ఇంకా ఎలాంటి ఫలితం తేలలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో క్రిస్టియన్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఆ నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగితే.. సులువుగా సెటిలర్స్, వైఎస్సార్ అభిమానులు, ఆమె సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయగలుగుతారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. షర్మిలకు చివరి నిమిషంలో పాలేరు అసెంబ్లీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కొంతకాలంగా తన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న షర్మిల.. కాంగ్రెస్‌తో ఏదో ఒకటి తేల్చుకున్న తర్వాతే క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారని వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి.
ఏపీలో పాదయాత్రతో జగన్‌కు చెక్
షర్మిలకు ఓ వైపు తెలంగాణలో పెద్దపీట వేస్తూనే.. మరోవైపు ఏపీలోనూ పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. తద్వారా ఏపీలో పార్టీకి దూరమైన ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ వర్గాలను, రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలనే ప్లాన్ రెడీ చేస్తోంది. కాంగ్రెస్‌ను దెబ్బతీసి తమ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకున్న సీఎం జగన్‌కు.. గట్టి షాక్ ఇచ్చేలా ఈ ప్లాన్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. గతంలో వీరంతా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి.. అక్కడ క్షేత్ర స్థాయిలోకి అడుగుపెడితే ఓటు బ్యాంక్ చీలే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. షర్మిలకు కాంగ్రెస్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది..? ఆమె సేవలను ఎలా వినియోగించుకుంటుంది..? అనే దానిపై అతిత్వరలోనే క్లారిటీ వస్తుంది.