YS SHARMILA: ట్విస్ట్ ఇచ్చిన షర్మిల.. కాంగ్రెస్‌కు దూరం.. తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధం..!
కాంగ్రెస్‌లో షర్మిల తన పార్టీని విలీనం చేస్తారా.. లేదా.. అంటూ సాగిన సస్పెన్స్‌కు తెరపడబోతోంది. ఒంటరి పోరుకు షర్మిల రెడీ అవుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
YS SHARMILA: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ తరఫున ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో షర్మిల తన పార్టీని విలీనం చేస్తారా.. లేదా.. అంటూ సాగిన సస్పెన్స్‌కు తెరపడబోతోంది. ఒంటరి పోరుకు షర్మిల రెడీ అవుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రెండేళ్లక్రితం వైస్సార్టీపీని స్థాపించిన షర్మిల పార్టీని నడిపేందుకు చాలానే శ్రమించింది.
తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేసింది. తెలంగాణలోని అధికార పార్టీ సహా బీజేపీ, కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేసింది. వివాదాలతో వార్తల్లో నిలిచింది. అయితే, షర్మిలకు, ఆమె పార్టీకి ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఆమె తప్ప పెద్ద నేతలెవరూ పార్టీలో చేరలేదు. దీంతో పార్టీని నడపడం కష్టమని భావించిన షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. మొదట పొత్తు కోసమే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో విలీనం చేయాలనే నిర్ణయానికొచ్చారు. కర్ణాటకకు చెందిన నేతలు డీకే సహా పలువురు నేతల ద్వారా కాంగ్రెస్ పెద్దలతో రాయబారం నడిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిశారు. తనకు పాలేరు టిక్కెట్ ఇవ్వాలని, తన అనుచరులకు కూడా సీట్లు కావాలని అడిగారు.
దీనికి కాంగ్రెస్ నుంచి సరైన స్పందన రాలేదు. అధిష్టానం సానుకూలంగా ఉన్నా.. తెలంగాణలోని కొందరు నేతలు షర్మిల రాకను వ్యతిరేకించారు. పైగా ఆమె అడిగిన పాలేరు స్థానం నుంచి తుమ్మల పోటీ చేస్తుండటంతో ఆమెకు టిక్కెట్ నిరాకరించారు. మరో స్థానం నుంచి పోటీ చేయాలని అడిగారు. కోరుకున్న స్థానం దక్కకపోవడం, కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో తన పార్టీ విలీనంపై పునరాలోచనలో పడ్డారు. తాజాగా తన అనుచరులతో చర్చించి, కాంగ్రెస్‌లో పార్టీ విలీనాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ తరఫునే పోటీ చేయబోతుంది షర్మిల.
తెలంగాణలోని అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయనుంది. ఈ నెల 30న పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. తన పార్టీ తరఫున అధిక స్థానాల్లో మహిళలతో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ లెక్కన షర్మిల పాలేరు నుంచే పోటీ చేసే ఛాన్స్ ఉంది.