YS SHARMILA: షర్మిల భవిష్యత్తు తేలేది అప్పుడేనా…!
వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కాంగ్రెస్‌తో కలసి నడవబోతున్నారనే వార్త చాలాకాలంగా ఉన్నదే. అదిగో విలీనం, ఇదిగో విలీనం అంటూ చర్చలైతే నడిచాయి కానీ దానిపై స్పష్టత మాత్రం రాలేదు.
YS SHARMILA: వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా…? లేక కాంగ్రెస్‌తో పొత్తుకే సై అంటారా…? విలీనం చేసి ఏపీకి వెళతారా..? తెలంగాణలోనే పోటీ చేస్తారా…? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలిసే సమయం వచ్చేసింది. కాంగ్రెస్ మేడమ్ సోనియాగాంధీని కలవబోతున్నారు షర్మిల. కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ది ఈ ఎపిసోడ్‌లో కీలక పాత్ర.
వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కాంగ్రెస్‌తో కలసి నడవబోతున్నారనే వార్త చాలాకాలంగా ఉన్నదే. అదిగో విలీనం, ఇదిగో విలీనం అంటూ చర్చలైతే నడిచాయి కానీ దానిపై స్పష్టత మాత్రం రాలేదు. ఈ లోపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ తమ వాదనలు వెళ్లగక్కారు. ఆమె ఏపీకి వెళ్లిపోవాలని కొందరు, తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని మరికొందరు సూచించారు. అయితే ఏం జరగబోతోందన్నది మాత్రం మరో రెండు, మూడు రోజుల్లో తేలే అవకాశం ఉంది. 18న బెంగళూరులో సోనియాగాంధీని షర్మిల కలవబోతున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల పాటు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి సోనియా హాజరు కాబోతున్నారు. ఈ సమయంలోనే షర్మిల ఆమెను కలవనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన డీకే శివకుమార్.. షర్మిల ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన చొరవతోనే షర్మిల కాంగ్రెస్‌నైపు అడుగులు వేస్తున్నారు.
షర్మిల కుటుంబానికి, డీకే ఫ్యామిలీకి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. పార్టీని నడపడం అంత సులభం కాదని ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు కల్లే అని ఆయనే షర్మిలకు నచ్చచెప్పారు. కాంగ్రెస్‌తో కలసి నడవాలని సూచించారు. ఆ మాటల్లోని వాస్తవాన్ని అర్థం చేసుకున్న షర్మిల పార్టీని విలీనం చేయడానికి ఓకే అన్నారు. డీకేతో పాటు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా షర్మిల రాయబారం నడిపించారు. వారితో ఆమె నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.
షర్మిల పార్టీని విలీనం చేయడాన్ని మెజారిటీ కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నా… తెలంగాణలో పోటీకి మాత్రం సుముఖంగా లేరు. ఏపీకి చెందిన ఆమె అక్కడే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు. కొనఊపిరితో ఉన్న పార్టీని వైఎస్ఆర్ కూతురిగా బతికించాలని సూచిస్తున్నారు. ఏపీకి చెందిన షర్మిలకు తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగిస్తే ఇక్కడి ప్రజలు స్వాగతించరేమోనన్నది వారి భయం. గతంలో వైఎస్ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న వాదనలున్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుతో చేతులు కలపడంతోనే పార్టీ అధికారానికి దూరమైందని మరోసారి అలాంటి పరిస్థితి రానివ్వొద్దని వారు కోరుతున్నారు.
షర్మిల ఆలోచన మాత్రం వేరేగా ఉంది. ఏపీ కాంగ్రెస్‌లో అడుగు పెట్టడం అంటే నేరుగా తన అన్నతో తలపడటమే. తమ మధ్య ఎంత దూరం ఉన్నా దాన్ని రాజకీయ వైరంగా మార్చడానికి ఆమె ఇష్ట పడటం లేదు. అందుకే తెలంగాణలోనే ఉండాలని భావిస్తున్నారు. ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం అదే. తెలంగాణలోనే పోటీ చేసి గెలవాలన్నది షర్మిల ఆలోచన. పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు. అది తనకు సేఫ్ సీట్ అని ఆమె నమ్ముతున్నారు. పైగా వైఎస్సార్ అంటే ప్రాణమిచ్చే పొంగులేటి నుంచి మద్దతు ఎలాగూ ఉంటుంది. పొంగులేటి గతంలో వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు కూడా.
సోనియాతో భేటీలో షర్మిల ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో వైఎస్సార్‌కు ఇంకా అభిమానులున్నారని తాను కాంగ్రెస్‌లో చేరితే వారి మద్దతు కూడా ఉంటుందని షర్మిల చెప్పే అవకాశం ఉంది. పార్టీని విలీనం చేస్తానని, తెలంగాణలోనే ఉంటానని, పాలేరు నుంచే పోటీకి అంగీకరించాలని కోరనున్నారు షర్మిల. మరి దానికి సోనియా ఏం చెప్పబోతున్నారు, షర్మిల ఎప్పుడు పార్టీని విలీనం చేస్తారన్నది తేలడానికి ఎంతో సమయం లేదనిపిస్తోంది.