YS Sharmila: షర్మిల ఓటు కాంగ్రెస్‌కే.. వైఎస్సార్టీపీ కథ ముగిసిందా..?
కాంగ్రెస్‌ను కాదని తెలంగాణలో రాజకీయం చేసే పరిస్థితులు లేవని షర్మిల గ్రహించింది. సొంతంగా ఎదిగే అవకాశం లేదు. కాంగ్రెస్ కూడా.. వీలునుబట్టి అవకాశాలిస్తాం.. అప్పటివరకు ఓపికగా ఉంటే ఉండు.. లేకుంటే పో.. అని తేల్చేసింది. ఈ నేపథ్యంలో మరో ఆప్షన్ లేక కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైంది.
YS Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం దాదాపు ఖాయమైంది. అయితే, తాను అడిగిన డిమాండ్లకు కాంగ్రెస్ ఒప్పుకోకపోయినా.. షర్మిల తన పార్టీని విలీనం చేసేందుకు అంగీకరించడం విశేషం. కారణం.. షర్మిలకు తెలంగాణలో వాస్తవ రాజకీయ పరిస్థితులు అర్థం కావడమే. వైఎస్సార్టీపికి భవిష్యత్ లేదని షర్మిల అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రెండేళ్లక్రితం షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించారు. అనంతరం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే, పార్టీకి ప్రజల్లో ఆదరణ దక్కలేదు. ఇతర నేతలూ వైఎస్సార్టీపీవైపు కన్నెత్తి చూడలేదు. దీంతో షర్మిల పార్టీని నడపడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ, రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో ఆమె సన్నిహితుల సూచనతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు అంగీకరించింది. మొదట కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినప్పటికీ.. అందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు. విలీనం చేయాలని కోరింది. అయితే, బదులుగా తనకు ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని అడిగింది. మొదట దీనికి అంగీకరించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఆ నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేయాలని భావిస్తుండటంతో కాంగ్రెస్ సీటు నిరాకరించింది. దీంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరాలా.. వద్దా.. అని కొద్దిరోజులుగా సంశయించారు. చివరకు కాంగ్రెస్‌లో విలీనం చేయడమే సరైందనే నిర్ణయానికొచ్చారు.
గత్యంతరం లేకే..
నిజానికి షర్మిల తెలంగాణలో తనకు ఆదరణ దక్కుతుందని భావించింది. వైఎస్సార్ ఇమేజ్ ఉపయోగపడుతుందనుకుంది. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. తెలంగాణలో ఆ పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. ఎక్కడా ఆదరణ దక్కలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి అంగీకరించింది. ఇదే సమయంలో కొన్ని డిమాండ్లు కాంగ్రెస్ ముందుంచింది. మొదట ఈ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్.. తర్వాత కాలంలో విముఖత వ్యక్తం చేసింది. పాలేరు టిక్కెట్ నిరాకరించింది. అలాగని కాంగ్రెస్‌ను కాదని తెలంగాణలో రాజకీయం చేసే పరిస్థితులు లేవని షర్మిల గ్రహించింది. సొంతంగా ఎదిగే అవకాశం లేదు. కాంగ్రెస్ కూడా.. వీలునుబట్టి అవకాశాలిస్తాం.. అప్పటివరకు ఓపికగా ఉంటే ఉండు.. లేకుంటే పో.. అని తేల్చేసింది. ఈ నేపథ్యంలో మరో ఆప్షన్ లేక కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైంది. ఢిల్లీ వెళ్లి మరోసారి కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు రెడీ అయింది. కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ వచ్చినా.. రాకున్నా.. గత్యంతరం లేదు కాబట్టి ఆ పార్టీకి షర్మిల జై కొట్టేసినట్లే. ఇక.. తెలంగాణలో వైటీపీ దుకాణం మూతపడ్డట్లే.