YS Viveka Case : వివేకా హత్య కేసు.. వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడ్డారా..!?
సీబీఐని ప్రబావితం చేసేంత స్థాయి చంద్రబాబుకు ఉందంటే ఎవరూ నమ్మరు. వైసీపీకి మాత్రమే ఆ సత్తా ఉంది. అయినా ఇంటిగుట్టు బయటపడిపోతుందనే భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో సంచలనం కలిగించింది. ఇప్పుడు సీబీఐ విచారణ అంతకు మించి హాట్ టాపిక్ గా మారింది. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఆయన బాత్రూంలో రక్తం కక్కుకుని చనిపోయారని వెల్లడించారు కుటుంబసభ్యులు. అయితే ఆ తర్వాత కాసేపటికి లేదు లేదు.. ఆయన్ను ఎవరో హత్య చేసినట్లు కనిపిస్తోందన్నారు. హత్య జరిగిన రోజు గంటగంటకూ మాట మారుస్తూ వచ్చారు. అయితే వివేకానంద రెడ్డి కుటుంబసభ్యులే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు సీబీఐ వరకూ వెళ్లింది. ఇప్పుడు కూడా వివేకా హత్యపై రాజకీయ డ్రామా నడుస్తూనే ఉంది.
వివేకానంద రెడ్డి హత్యపై మొదటి నుంచి అనేక అనుమానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబసభ్యులే వివేకానంద రెడ్డిని హత్య చేశారనే ఆరోపణలు ఆరోజు నుంచే వచ్చాయి. అయితే అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండడంతో నెపాన్ని టీడీపీపై నెట్టేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. ముఖ్యంగా జమ్మలమడుగు నేత ఆదినారాయణ రెడ్డి సహా ఇతరులపై అనుమానాలు ఉన్నాయని వై.ఎస్.ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. వైసీపీ అధినేత జగన్ కు చెందిన పత్రికలో నారాసుర రక్త చరిత్ర పేరుతో ఫుల్ సైజ్ ఆర్టికల్ కూడా ప్రచురించారు. అయితే ఈ కేసు విచారణ లోతులకు వెళ్లేకొద్దీ వేళ్లన్నీ వైఎస్ కుటుంబసభ్యుల వైపే చూపిస్తూ వచ్చాయి.
ముఖ్యంగా సీబీఐకి కేసు వెళ్లిన తర్వాత అనేక పరిణామాలు వెలుగు చూశాయి. కడప కేంద్రంగా సీబీఐ మొదట విచారణ చేపట్టింది. ఆ సమయంలో సీబీఐ అధికారులకు స్థానిక అధికారులు, పోలీసులు దాదాపు సహాయ నిరాకరణ చేశారు. ఈ విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లింది. బహుశా అధికారులు సహకరించట్లేదంటా సీబీఐ చేతులెత్తేయడం ఇదే మొదటిసారేమో. మరోవైపు వివేకా కుమార్తె సునీత కూడా ఇదే విషయాన్ని కోర్టుకు వెల్లడించింది. అక్కడే ఉంటే ఈ కేసు కొలిక్కి రాదని.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరింది. ఒకవైపు సునీత, మరోవైపు సీబీఐ అధికారులు కూడా ఈ కేసు విచారణ సాఫీగా సాగాలంటే మరోచోటుకు బదిలీ చేయక తప్పదని కోరడంతో సుప్రీంకోర్టు అంగీకరించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది కేసు విచారణ. అప్పటి నుంచి కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి పైన సీబీఐ ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్ హత్య జరిగిన రోజు.. అంతకుముందు అవినాశ్ రెడ్డితో ఉన్నట్టు సీబీఐ నిర్ధారించడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదే అంశంపై అవినాశ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించేందుకు సీబీఐ సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. విచారణ అనంతరం అవినాశ్ రెడ్డి కూడా తన అసహాయతను బయటపెట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు వైసీపీ నేతల మాట మారింది. ఇన్నాళ్లూ చంద్రబాబు అండ్ కో నే వివేకాను హత్య చేసారని వాదిస్తూ వచ్చిన నేతలు ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబు సీబీఐని ప్రభావితం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉంది వైసీపీ. కేంద్రంలోని బీజేపీతో అత్యంత సన్నిహిత సంబంధాలను కూడా కలిగి ఉంది. మరోవైపు చంద్రబాబును బీజేపీ కనీసం గడప కూడా తొక్కనివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐని ప్రబావితం చేసేంత స్థాయి చంద్రబాబుకు ఉందంటే ఎవరూ నమ్మరు. వైసీపీకి మాత్రమే ఆ సత్తా ఉంది. అయినా ఇంటిగుట్టు బయటపడిపోతుందనే భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.