YS Sharmila: సికింద్రాబాద్‌ ఎంపీగా షర్మిల పోటీ చేయబోతున్నారా..? ప్రచారంలో నిజమెంత..?

వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధం అవుతున్నారన్న ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలతో షర్మిల వరుసగా రాయబారాలు నడుపుతున్నారు. మొన్న డీకేను, నిన్న కేవీపీని.. ఇవాళ జానారెడ్డిని కూడా కలుసుకున్నారని, కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధం అని సంకేతాలు పంపారనే డిస్కషన్ నడుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 3, 2023 | 04:30 PMLast Updated on: Jul 03, 2023 | 4:30 PM

Ysr Telangana Chief Sharmila Will Soon Join Congress And Contest From Secunderabad

YS Sharmila: విషయం కంటే.. వివాదంతోనే వైటీపీ ఫేమస్ అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షురాలి పరిస్థితి అయితే మరీ గందరగోళంగా తయారయింది. వేలకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, మంత్రులు, కీలక నేతలను టార్గెట్ చేసుకొని మాటలు సంధించినా.. కావాల్సినంత పొలిటికల్ మైలేజ్ రావడం లేదు. నిజానికి షర్మిల పార్టీని కనీసం పట్టించుకోవడం మానేశారు ప్రత్యర్థి పార్టీ నేతలు, ప్రజలు. ఇలాంటి పరిస్థితుల మధ్య.. వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధం అవుతున్నారన్న ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ పెద్దలతో షర్మిల వరుసగా రాయబారాలు నడుపుతున్నారు. మొన్న డీకేను, నిన్న కేవీపీని.. ఇవాళ జానారెడ్డిని కూడా కలుసుకున్నారని, కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధం అని సంకేతాలు పంపారనే డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్ పెద్దలు కూడా షర్మిలను ఆహ్వానించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఆమె కండిషన్స్‌లో చాలావరకు ఓకే చెప్పారనే టాక్‌ నడుస్తోంది. పాలేరు నుంచి పోటీకి షర్మిలకు రూట్ క్లియర్ అయిందనే టాక్‌ జోరుగా సాగుతోంది. ఐతే ఆమె పోటీ చేయబోయే స్థానం గురించి సరికొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది. తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు షర్మిల. ఏపీకి వెళ్లాలని కాంగ్రెస్‌ హైకమాండ్ పట్టు పడుతున్నా ఆమె ససేమిరా అంటున్నారు.

తాను తెలంగాణను వీడేది లేదని, తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కుండబద్దలు కొడుతోంది. షర్మిల పట్టువీడకపోవడంతో హైకమాండ్ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. ఏపీ వాసులతో మంచి సంబంధాలు ఎక్కువ ఉండడంతో పాటు, వైఎస్‌ మద్దతుదారులు, అభిమానులు అక్కడ ఎక్కువగా ఉన్నారని షర్మిల లెక్కలేసుకున్నారు. సర్వేలు కూడా చేయించుకున్నారని, ఆ రిపోర్టులు కూడా సానుకూలంగా ఉండడంతో పాలేరుకు ఆమె ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే వైటీపీని విలీనం చేసుకున్న తర్వాత షర్మిలను గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.

సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని టాక్. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. దీంతో షర్మిల అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. నిజానికి వైసీపీ నుంచి ఎంపీ కావాలని షర్మిల భావించారు. జగన్ దానికి నిరాకరించారనే టాక్ ఉంది. దీంతో అన్నకు ఝలక్ ఇవ్వాలని భావిస్తున్న షర్మిల కాంగ్రెస్ నుంచి పార్లమెంట్‌లో అడుగు పెట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక అటు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంక్ ఉంది. క్రిస్టియన్‌ ఓట్లు ఆ నియోజకవర్గంలో ఎక్కువ. షర్మిలను బరిలోకి దింపితే ఆ వర్గం ఓటర్లను ఆకర్షించే చాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే నిజం అయి షర్మిల సికింద్రాబాద్‌ నుంచి బరిలోకి దిగితే అంజన్‌ కుమార్ పరిస్థితి ఏంటి..? మరో రచ్చ తప్పదా..; అనే చర్చ కూడా ముందుగానే మొదలైపోయింది.