HYDERABAD AP CAPITAL: రాజధాని రాజకీయం.. ఏపీ రాజధాని హైదరాబాదే! ఎన్నికల ముందు వైసీపీ కొత్త ట్విస్ట్

ఉమ్మడి రాజధాని విషయంలో ఇంత కాలం సైలెన్స్‌గా ఉన్న వైసీపీ.. సడన్ గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు స్పందించడం ఆసక్తి కలిగిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి.. జగన్‌కు అత్యంత ఆప్తుడు. జగన్ అనుమతి లేకుండా వైవీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఛాన్స్ లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 08:28 PMLast Updated on: Feb 13, 2024 | 8:28 PM

Ysrcp Demands Hyderabad As Ap Capital For More Time

HYDERABAD AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదే. ఇంకా కొన్నాళ్ళు ఉండాల్సిందే. ఇప్పట్లో ఏపీకి రాజధాని కట్టుకునే పరిస్థితుల్లో లేం.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటయ్యేదాకా హైదరాబాద్‌నే కొనసాగించాలని కేంద్రాన్ని కోరతామంటున్నారు. రాజధాని ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుందని అర్థమవుతోంది. ఈ డిమాండ్‌ను మంత్రి పెద్దిరెడ్డి కూడా సమర్థిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వైసీపీ ఈ కొత్త డిమాండ్ ఎంచుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందన్న టాక్ పొలిటకల్ సర్కిల్స్‌లో నడుస్తోంది.

REVANTH REDDY: లక్ష కోట్లు పెట్టి.. లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు.. కేసీఆర్ సర్కార్‌పై రేవంత్ ఫైర్
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది కేంద్రం. దీని ప్రకారం.. వచ్చే జూన్ వరకు హైదరాబాద్.. తెలంగాణతోపాటు, ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంకా ఏమైనా ఆఫీసులు ఉంటే ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను ఇంకా కొనసాగించాల్సిందే అంటున్నారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే దాకా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు. రీసెంట్‌గా ఆయన వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ నెలాఖరులో ఎంపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామనీ.. విభజన హామీలపై కేంద్రాన్ని అడుగుతామంటున్నారు వైవీ సుబ్బారెడ్డి. ఏపీకి ప్రస్తుతం రాజధాని నిర్మించే పరిస్థితి లేదంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకూ ప్రత్యేక హోదా తేవడం కూడా కష్టమేనన్నారు సుబ్బారెడ్డి.
ఉమ్మడి రాజధాని విషయంలో ఇంత కాలం సైలెన్స్‌గా ఉన్న వైసీపీ.. సడన్ గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు స్పందించడం ఆసక్తి కలిగిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి.. జగన్‌కు అత్యంత ఆప్తుడు. జగన్ అనుమతి లేకుండా వైవీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఛాన్స్ లేదు. ఇప్పుడు జగన్ సూచనతోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తినట్టు అర్థమవుతోంది. వైవీ డిమాండ్‌కు పెద్దిరెడ్డి కూడా మద్దతు తెలపడం చూస్తే.. ఈ డిమాండ్ వెనుక ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే అసలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న సంగతిని ఆంధ్రా జనం చాలా మంది మర్చిపోయారు. జగన్ సీఎం అయ్యాక.. సెక్రటేరియట్ లో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ తెలంగాణ సర్కార్‌కు అప్పగించారు. అందుకు రిటర్న్‌గా ఏ భవనాలను తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీ ఆఫీసులన్నీ విజయవాడలోనే ఉన్నాయి. ఏ ఒక్క ఆఫీస్ కూడా తెలంగాణలో పనిచేయట్లేదు. ఉమ్మడి రాజధాని అయినా కూడా కరోనా టైమ్‌లో పేషంట్లను ఏపీ నుంచి హైదరాబాద్ రాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది.

KCR: చేతగాని వాళ్ల రాజ్యం ఇలాగే ఉంటుంది.. మాకంటే గొప్పగా పాలించి చూపించండి.. కాంగ్రెస్‌కు కేసీఆర్ సవాల్

ఇన్నాళ్ళూ ఉమ్మడి రాజధాని అంశం సంగతి మాట్లాడని జగన్.. సడన్‌గా ఇప్పుడు ఎందుకు కొత్తగా ఈ రాగం ఎత్తుకున్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం పదేళ్ళ వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఆ తర్వాత కొనసాగదు. కానీ ఇప్పుడు వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా.. ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయాలంటే ఏపీ విభజన చట్టంలో మళ్ళీ మార్పులు చేయాలి. అది సాధ్యమయ్యే పని కాదు. అందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గానీ.. అపోజిషన్ బీఆర్ఎస్ గానీ ఒప్పుకునే ఛాన్సే లేదు. పైగా ఈ అంశం లేవనెత్తినందుకు మళ్ళా ఏపీ-తెలంగాణ లీడర్ల మధ్య కొత్త పంచాయతీ మొదలైనట్టే. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని గుర్తించడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏంటి..? ఒక్క కరోనా టైమ్ లో తప్ప.. మిగతా రోజుల్లో ఏపీ ప్రజలు హైదరాబాద్‌కి రాకపోకలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు రాజధాని అంశాన్ని తెచ్చి వైసీపీ కొత్తగా ఓట్ల రాజకీయం మొదలుపెడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ, ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. జగన్ ఇప్పటిదాకా ఏపీకి రాజధాని లేకుండా దౌర్భాగ్య స్థితి కల్పించారని బీజేపీ విమర్శిస్తోంది. జగన్ మనసులో మాట ఏంటన్నది త్వరలోనే బయటపడే అవకాశముంది.