YCP – Pilli: పిల్లి కోసం వైసీపీ హై డ్రామా..!!

పిల్లి జనసేనలో చేరుతున్నారనే కథనాల వెనుక వైసీపీ అధిష్టానమే ఉందని తెలుస్తోంది. జగన్ ను కలిసేలోపు పిల్లిపై ఈ కథనాలు బయటకు తీసుకువచ్చి ఆయన్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో జగన్ ను కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆ వార్తలను ఖండించాల్సి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 25, 2023 | 07:36 PMLast Updated on: Jul 25, 2023 | 7:36 PM

Ysrcp High Command Plays High Drama Before Meeting Pilli Subhash Chandra Bose With Cm Jagan

ఆంధ్రప్రదేశ్ లో రామచంద్రాపురం వైసీపీ డ్రామా రక్తి కట్టిస్తోంది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మధ్య అక్కడ ఆధిపత్య పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం టికెట్ తనకే కేటాయించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ను కాదని పిల్లికి టికెట్ ఇచ్చేందుకు అధినేత జగన్ ససేమిరా అంటున్నారు. అదే జరిగితే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని పిల్లి సుభాశ్ చంద్రబోస్ తేల్చి చెప్పేశారు. ఇప్పటికే ఓ దఫా ఈ అంశంపై చర్చించిన అధిష్టానం ఇవాళ మరోసారి రావాల్సిందిగా పిల్లిని ఆదేశించింది. ఆయన తాడేపల్లి చేరేలోపే పిల్లి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకన్నారంటూ జోరుగా ప్రచారం సాగింది.

రామచంద్రాపురం వివాదంపై చర్చించేందుకు తాడేపల్లి రావాలంటూ సీఎంఓ అధికారులు పిల్లి సుభాశ్ చంద్రబోస్ కు కబురు పెట్టారు. ఆయన్ను మధ్యాహ్నం తాడేపల్లికి రావాలని కోరారు. ఆయన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో వైసీపీ అనుకూల మీడియాలో పిల్లి సుభాశ్ చంద్రబోస్ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ కథనాలు వండివార్చారు. పిల్లి కుమారుడు పిల్లి సూర్య ప్రకాశ్ కు జనసేన టికెట్ కన్ఫామ్ అయిందని.. ఈ పార్లమెంటు సమావేశాలు ముగియగానే ఆయన రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకుంటారని బ్రేకింగ్ న్యూస్ నడిపాయి. ఓ వైపు ఈ కథనాలు జోరుగా సాగుతుండగానే పిల్లి సుభాశ్ చంద్రబోస్ సీఎం జగన్ ను కలిశారు.

సీఎం జగన్ ను కలిసి బయటకు వచ్చిన తర్వాత పిల్లి సుభాశ్ చంద్రబోస్ తాను వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఖండించారు. తాను జనసేనలో చేరబోవట్లేదని స్పష్టం చేశారు. వైసీపీ అద్యులలో తాను ఒకడినని.. పార్టీతోనే తన ప్రయాణం ఉంటుందని తేల్చి చెప్పేశారు. అయితే పిల్లి జనసేనలో చేరుతున్నారనే కథనాల వెనుక వైసీపీ అధిష్టానమే ఉందని తెలుస్తోంది. జగన్ ను కలిసేలోపు పిల్లిపై ఈ కథనాలు బయటకు తీసుకువచ్చి ఆయన్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో జగన్ ను కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆ వార్తలను ఖండించాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఆయన జనసేనలో చేరితే దాన్ని తమకు అనుకూలంగా వైసీపీ వాడుకునేందుకు వీలు కలిగింది. సో.. ఉదయం నుంచి పిల్లిని ఇరికించేందుకు వైసీపీ హైకమాండ్ పెద్ద స్కెచ్చే వేసింది.