YS Jagan: ఎన్డీయేలోకి వైసీపీ.. మంత్రివర్గంలో చోటు.. జగన్ పర్యటన దానికోసమేనా..? అంతా జగన్ ప్లానేనా..?
ఏపీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అంశంపై కేంద్రంతో చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుండగా.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశంపై బీజేపీ పెద్దలే జగన్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నారని మరో ప్రచారం తెరమీదకు వచ్చింది.
YS Jagan: ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో వైఎస్సార్సీపీ చేరబోతుందా..? ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజా ఢిల్లీ పర్యట దాని కోసమేనా..? తాజా పరిణామాలు చూస్తే ఔననే అనిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీతోపాటు బీజేపీ అగ్రనేతలను కలిశారు. అయితే, జగన్ ఎందుకు ఢిల్లీ వెళ్లారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. ఏపీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అంశంపై కేంద్రంతో చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుండగా.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశంపై బీజేపీ పెద్దలే జగన్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నారని మరో ప్రచారం తెరమీదకు వచ్చింది.
జగన్ ఆలోచనేనా..?
ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీలో, ఇటు ఏపీ రాజకీయాల్లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. మరోవైపు జనసేనటీడీపీ కూటమిలో బీజేపీ చేరుతుందా అనే అనుమానం మొదలైంది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ కలవకుండా అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగా బీజేపీతో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీడీపీతో వెళ్లకుండా ఉంటే, తామే ఎన్డీయేలో చేరుతామనే సంకేతాల్ని జగన్ బీజేపీ పెద్దలకు చేరవేశారు.
ఇదే సమయంలో బీజేపీ బలహీన పడుతుండటంతో కొత్త మిత్రుల కోసం బీజేపీ చూస్తోంది. అలా వైసీపీకి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వబోతుంది. అంటే వైసీపీని తమ ప్రభుత్వంలో కలుపుకోవాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. దీంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వైసీపీలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. ఏపీ నుంచి మోదీ మంత్రివర్గంలో ఇప్పటివరకు చోటు లేదనే విషయాన్ని కూడా జగన్ బీజేపీ పెద్దల దగ్గర ప్రస్తావించారు. ఏపీకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.
ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?
ఎన్డీయేలో వైసీపీ చేరితో కొంతమేర ఆ పార్టీకి ప్రయోజనం ఉండొచ్చు. దీనివల్ల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అడ్డుకున్నట్లవుతుంది. కేంద్రం నుంచి అన్నిరకాల మద్దతు వైసీపీకి దొరుకుతుంది. మరోవైపు వైసీపీకి ఉన్న ఓటుబ్యాంకులో కొంతమేర కోత పడుతుంది. ఒక వర్గం దూరమయ్యే అవకాశం ఉంది. ఇది టీడీపీ, జనసేనకు కొంత మేర నష్టమే అయినా.. వైసీపీ, బీజేపీ కలిసినా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాయని చెప్పుకొనే అవకాశం ఉంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.