Nara Lokesh: నారా లోకేశ్‌ను ఓడించేందుకు సరికొత్త వ్యూహం.. మాజీ ఎంపీని బరిలోకి దించుతున్న జగన్
నారా లోకేశ్‌ను ఓడించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. నారా లోకేశ్ పోటీ చేసి ఓడిపోయింది మంగళగిరి నుంచి. అక్కడ ప్రస్తుతం వైసీపీ తరఫున గెలిచిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Nara Lokesh: ప్రత్యర్థుల్ని ఓడించడానికి అనువైన వ్యూహాలు రచించడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. పవన్ కల్యాణ్ ఓడిపోవడం వల్ల జనసేనకు భారీ నష్టం జరిగిందనడంలో సందేహం లేదు. అందుకే అటు మరో ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కుప్పంలో ఓడించేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ పార్టీ యువనేతగా, భవిష్యత్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నారా లోకేశ్‌ను ఓడించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. నారా లోకేశ్ పోటీ చేసి ఓడిపోయింది మంగళగిరి నుంచి. అక్కడ ప్రస్తుతం వైసీపీ తరఫున గెలిచిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన వరుసగా 2014, 201లో పోటీ చేసి గెలిచారు. రెండుసార్లు గెలిచినప్పటికీ ఆయనకు ఈసారి టిక్కెట్ ఇవ్వడం లేదు. ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉండటం, గెలిచే అవకాశం లేకపోవడంతో ఆయనకు ఈసారి టిక్కెట్ ఇవ్వడం లేదు.
మరోవైపు ఓడిపోయినప్పటికీ నారా లోకేశ్ మంగళగిరిలో నిరంతరం పర్యటిస్తూ, ప్రజలకు దగ్గరవుతున్నారు. సొంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో లోకేశ్‌ను ఎదుర్కొనేందుకు జగన్ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. లోకేశ్‌పై బీసీ నేతను.. అందులోనూ అక్కడ అధికంగా ఓటర్లున్న చేనేత సామాజికవర్గానికి చెందిన బుట్టా రేణుకను పోటీకి దించాలనుకుంటున్నారు. ఆమె 2014లో ఎంపీగా గెలిచారు. 2019లో వైసీపీ నుంచి టిక్కెట్ రాలేదు. ఈసారి మాత్రం మంగళగిరి నుంచి ఆమెను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన చేనేత కుటుంబానికి చెందిన రేణుక.. లోకేశ్‌ను ఓడించగలరని జగన్ భావిస్తున్నారు.
ఈ విషయంపై మంగళగిరి స్థానిక నేతలతో వైసీపీ సంప్రదింపులు జరుపుతోంది. అక్కడి నేతల అంగీకారం వస్తే.. వెంటనే బుట్టా రేణుక మంగళగిరి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తారు. అయితే, జగన్ వ్యూహాన్ని ముందే పసిగట్టిన టీడీపీ ప్రతివ్యూహాన్ని అమలు చేస్తోంది. చేనేత వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను ఎమ్మెల్సీగా గెలిపించిన సంగతి తెలిసిందే. ఆమె తన ప్రోటోకాల్ నియోజకవర్గంగా మంగళగిరిని ఎంచుకున్నారు. ఆమె ఇప్పటికే టీడీపీకి, లోకేశ్‌కు అనుకూలంగా మంగళగిరిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లోకేశ్ కూడా చేనేత కార్మికులతో మమేకం అవుతున్నారు. అయితే, జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.