YCP Shock: వైసీపీకి పంచకర్ల రాజీనామా.. వైవీతో విభేదాలే కారణమా..?
విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. దీని వల్ల ఉత్తరాంధ్రలో పార్టీకి తిరుగుండదని భావించింది. అయితే కార్యనిర్వాహక రాజధాని ముందుకు సాగకపోగా అడుగడుగునా విశాఖలో ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. దీని వల్ల ఉత్తరాంధ్రలో పార్టీకి తిరుగుండదని భావించింది. అయితే కార్యనిర్వాహక రాజధాని ముందుకు సాగకపోగా అడుగడుగునా విశాఖలో ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. గత పట్టభద్రుల ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఓటమి పాలైంది. అంతకుముందు ఇన్ ఛార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఇన్ ఛార్జ్ గా ఉన్నా కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
పంచకర్ల రమేశ్ బాబు ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2020లో ఆయన వైసీపీలో చేరారు. సీనియర్ నేత కావడంతో ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అయితే అధ్యక్షుడిగా ఉన్నా కూడా అక్కడ ఏమీ చేసే పరిస్థితి లేదని పంచకర్లకు అర్థమైంది. జిల్లా సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా వీలుకాలేదు. ఇదే విషయాన్ని ఆయన మీడియా ముందు వెల్లడించారు. జగన్ ను కలిసి పరిస్థుతులను వివరించేందుకు కూడా అవకాశం కలగట్లేదని.. ఏడాదిగా ప్రయత్నిస్తున్నానని పంచకర్ల చెప్పుకొచ్చారు. అధ్యక్షుడిగా ఉండి కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ బాధ్యతలు తనకు ఎందుకని పంచకర్ల ప్రశ్నించారు. అందుకే పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు.
పంచకర్ల రమేశ్ బాబు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. దీంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2020లో టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన తనకు తగిన గుర్తింపు లేదని భాధపడుతున్నారు. కనీసం తన సామాజిక వర్గీయులతో భేటీ అయ్యేందుకు కూడా అధిష్టానం అంగీకరించలేదు. తన ముందరికాళ్లకు బంధం వేసేసి పార్గీ పగ్గాలిచ్చి పరుగెత్తమని చెప్తే ఎలా ఉంటుందే.. అదే పరిస్థితి పంచకర్లది. అందుకే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే వైవీ సుబ్బారెడ్డితో విభేదాల వల్లే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. అధ్యక్షుడిగా ఉన్నా కూడా ప్రతి చిన్న విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి అనుమతితోనే చేయాల్సి వస్తోందనేది ఆయన ఆవేదన.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపైన ఇప్పటి వరకూ పంచకర్ల రమేశ్ బాబుకు అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. పెందుర్తి నుంచి పోటీ చేసేందుకు పంచకర్ల ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ సీటుపై ఇప్పటివరకూ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. వీటికితోడు విశాఖలో భూ అవకతవకలు, అక్రమాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకాలం పంచకర్ల రమేశ్ బాబుకు క్లీన్ ఇమేజ్ ఉంది. పార్టీ చేసే తప్పులను తను మోయాల్సి వస్తోందనే ఆవేదన ఆయనలో ఎప్పటి నుంచో ఉంది. అందుకే చివరకు పార్టీకి గుడ్ బై చెప్పేసారు. అయితే తన తదుపరి మజిలీ ఏంటనేది చెప్పలేదు. టీడీపీలో చేరే అవకాశం ఉందనేది ఆయన అనుచరులు చెప్తున్న మాట.