Andhra Pradesh: అదే జరిగితే.. వైసీపీ ఓడిపోవడం ఖాయమా..?
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ ‘టీడీపీ-జనసేన-బీజేపీ’చేతులు కలిపితే జగన్ సేన ఖేల్ ఖతం అవుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాయలసీమలో టీడీపీకి కలిసొస్తే ఏపీలో జగన్ సర్కారు గల్లంతయ్యే అవకాశాలు పెరుగుతాయని పొలిటికల్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు.
Andhra Pradesh: దేశమంతటా ‘ఇండియా’ కూటమిపై చర్చ జరుగుతుంటే.. ఏపీలో మాత్రం ‘టీడీపీ-జనసేన-బీజేపీ’ పొత్తు కుదురుతుందా..? కుదరదా..? అనే దానిపై హాట్ డిబేట్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ ఈ మూడు పార్టీలు చేతులు కలిపితే.. జగన్ సేన ఖేల్ ఖతం అవుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఇవి ఈజీగా సత్తా చాటగలవనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఏపీలో పొత్తులు పెట్టుకునే ఆలోచన ఉందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ అంశం ఇంకా చర్చల దశలోనే ఉందన్నారు. బీజేపీతో చర్చలు జరుగుతున్నాయనే కోణంలోనూ ఆయన ఒక ఆన్సర్ ఇచ్చారు. అయితే జనసేన-బీజేపీ టీమ్‌తో కలిసే విషయంలో ఎన్నికల నాటికి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రాయలసీమను గెలిచిన పార్టీలే ఏపీని ఏలే ఛాన్స్ దక్కించుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ వన్ సైడెడ్‌గా ఉంటోంది. అదే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీలకు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాలతో కూడిన రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే ఐదున్నర జిల్లాలతో కూడిన గ్రేటర్ రాయలసీమలో 67 స్థానాలున్నాయి. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాను, నల్లమల సరిహద్దుల్లో ఉన్న ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కందుకూరు ప్రాంతాలను కలిపితే ‘గ్రేటర్ రాయలసీమ’ ఏరియా అవుతుంది. ఇంత పెద్ద ప్రాంతంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం 3 సీట్లు (చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్) మాత్రమే గెలిచింది. దీన్నిబట్టి అక్కడ వైఎస్సార్‌సీపీ గాలి ఎంత బలంగా వీచిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. ‘నేనూ రాయలసీమ వాసినే’ అంటూ లోకల్ సెంటిమెంట్ క్రియేట్ చేసే పనిలో చంద్రబాబు పడ్డారు. నారా లోకేష్ యువగళం ప్రోగ్రామ్‌ను కుప్పంలో ప్రారంభించడానికి కూడా కారణమిదే. ఇక జనసేన, బీజేపీకి రాయలసీమలో పెద్దగా బలం లేదు. వాటికి కాస్తో కూస్తో బలం ఉందంటే అది ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఒకవేళ వాటితో టీడీపీ చేతులు కలిపితే పరిణామాలు మారుతాయి. రాయలసీమలో టీడీపీకి కలిసొస్తే ఏపీలో జగన్ సర్కారు గల్లంతయ్యే అవకాశాలు పెరుగుతాయని పొలిటికల్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు.
ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో 20 శాతం సీట్లు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలే అందిస్తున్నాయి. ఈ జిల్లాల్లో కాపుల తర్వాత ఎస్సీ సామాజికవర్గానిదే పైచేయి. అందుకే కొన్ని నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంటాయి. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా తన వారాహి యాత్రలో గోదావరి జిల్లాల మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఏదో ఒక ప్రాంతం అని కాకుండా.. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో సమతూకంతో రాణించే పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.