సీజ్ ఫైర్‌కు జెలెన్‌స్కీ ఓకే.. మరి పుతిన్? వార్‌జోన్‌లో విధ్వంసం తప్పదా?

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనేది పాత మాట. కానీ, ట్రంప్ లెక్కలో మాత్రం నెగ్గాలంటే తగ్గడం కాదు తొక్కుకుంటూ వెళ్లిపోవడమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2025 | 02:30 PMLast Updated on: Mar 13, 2025 | 2:30 PM

Zelensky Oks Ceasefire But Putin Isnt Destruction Unavoidable In The Warzone

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనేది పాత మాట. కానీ, ట్రంప్ లెక్కలో మాత్రం నెగ్గాలంటే తగ్గడం కాదు తొక్కుకుంటూ వెళ్లిపోవడమే. జెలెన్‌స్కీ విష యంలో అదే చేశారు, అనుకున్నది సాధించారు. ఔను.. మూడేళ్ల యుద్ధానికి ముగింపు చెప్పడా నికి తాను సిద్ధమే అని జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇప్పుడు బాల్ పుతిన్ కోర్టులోనే ఉంది. దీనికి పుతిన్ అంగీకరిస్తే సుదీర్ఘ యుద్ధానికి 30 రోజులు బ్రేక్ పడ్డం ఖాయం. ఆ తర్వాత వార్‌జోన్‌లో పూర్తి శాంతి చర్చలపై ఆధారపడి ఉంటుంది. కానీ, దీనికి పుతిన్ ఎంతవరకూ అంగీకరిస్తారు? అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే, జెలెన్‌స్కీ విషయంలో వర్క్‌ఔట్ అయిన ఒత్తిడి వ్యూహం పుతిన్ విషయం వర్క్‌ఔట్ అయ్యే సీన్ ఉండకపోవచ్చు. ఇంతకూ, మూడేళ్ల యుద్ధాన్ని జెలెన్ స్కీ ప్రకటన ఎలా మలుపు తిప్పబోతోంది? అగ్రరాజ్యం అమెరికా 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై పుతిన్ మనసులో మాటేంటి?

మూడేళ్ల యుద్ధం ముగింపు దిశగా అడుగులేస్తోందని ట్రంప్ చేసిన ప్రకటనే ఇది. ‘ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇక, మిగిలింది రష్యానే. పుతిన్‌ ఇందుకు అంగీకరిస్తారని ఆశిస్తున్నా. యుద్ధం కారణంగా అనేకమంది ప్రజలు చనిపోతున్నారు. ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నా. అందులోభాగంగా కాల్పుల విరమణ చాలాముఖ్యం. దీనిపై నేను పుతిన్‌తో మాట్లాడతాను. అని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ఈ ప్రకటన చేయడా నికి ముందు జెడ్డా వేదికగా కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ప్రపంచం ఆశ్చర్య పోయే ప్రకటన వచ్చింది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్‌ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. దీంతో అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందానికి ఉక్రెయిన్‌ అంగీకరించింది. ఈ చర్చలపై రూబియో మాట్లాడుతూ.. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు తెలుపుతామన్నారు. ఇప్పడు బంతి మాస్కో చేతిలో ఉందన్నారు.

నిజానికి.. పుతిన్‌పై పోరులో తగ్గేదే లేదంటూ వచ్చిన జెలెన్‌స్కీ.. ఒక్కసారిగా శాంతికి సిద్ధం అని ప్రకటించడానికి అమెరికా చేసిన ఒత్తిడే కారణం. ఎప్పుడైతే జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌లో తనతో వాగ్వాదానికిదిగాడో అప్పుడే ట్రంప్ ప్లాన్ మార్చారు. మొదట యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని నిలిపేశారు. తర్వాత యుద్ధంలో కీలకమైన నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్‌కు ఇవ్వడం నిలిపేశారు. దీంతో జెలెన్‌స్కీ యూరోపియన్ దేశాలవైపు చూసినా అది ఎంతవరకూ వర్క్‌ఔట్ అవుతుందో చెప్పలేని సిట్యువేషన్. దీంతో అగ్రరాజ్యం లేకపోతే ఏదీ కాదని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే జెడ్డా సమావేశంలో అగ్రరాజ్యం చేసిన 30 రోజుల సీజ్ ఫైర్ ప్రతిపాదనకు జెలెన్‌స్కీ అంగీకరించారు. ఇక్కడ జెలెన్‌స్కీ కూడా ఒక ప్లాన్ ప్రకారమే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. తాను శాంతికి సిద్ధపడితే బాల్ పుతిన్ కోర్టులో ఉంటుందని జెలెన్‌స్కీకి తెలుసు. పుతిన్ అంత ఈజీగా కాల్పుల విరమణకు సిద్ధపడరని కూడా తెలుసు. రష్యా ఈ ప్రతిపాదన తిరస్కరిస్తే శాంతికి అడ్డుపడుతున్నదెవరో ప్రపంచానికి తెలుస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. జెలెన్‌స్కీ కూడా ప్రపంచానికి ఇదే చెప్పాలనుకుంటున్నారు.

నిజానికి.. కాల్పుల విరమణ కోసం గతేడాది జూన్‌లో పుతిన్‌ కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటిలో మొదటిది 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాను ఉక్రెయిన్ గుర్తిం చాలి. రెండోది ప్రస్తుత యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న బూభాగాలను మరచిపోవాలి. మూడోది తన సైనిక బలాన్ని పరిమితం చేసుకోవడంతో పాటు అణ్వాయుధ రహిత దేశంగానే ఉక్రెయిన్‌ కొనసాగాలి. నాల్గోది నాటో కూటమిలో చేరే యత్నాన్ని విరమించుకోవాలి. వీటికి అంగీకరిస్తే కాల్పుల విరమణకు సిద్ధమే అని పుతిన్ గతేడాది చెప్పారు. అయితే, అందుకు ఉక్రెయిన్ ఒప్పుకోలేదు. పుతిన్‌ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ స్పందించింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండటంతో.. దానిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే పుతిన్‌ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్‌ విమర్శించింది. పుతిన్ ప్రతిపాదన కొత్తదేమీ కాదని, ఆయన చర్యలు అడాల్ఫ్ హిట్లర్‌ని పోలి ఉన్నాయని ఆరోపించింది. పుతిన్ ఇప్పుడు కూడా ఆ డిమాండ్లనే వినిపించే అవకాశాలున్నాయి. వాటికి ఉక్రెయిన్ ఓకే చెప్పే సీన్ ఉండకపోవచ్చు. అదే జరిగితే అమెరికా 30 రోజుల ప్రతిపాదన వర్క్ ఔట్ అయ్యే సీన్ కూడా ఉండదు. మరి ఈ విషయంలో ట్రంప్ ఏం చేయబోతున్నారు?

సుదీర్ఘ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడానికి అమెరికా నమ్ముకున్న ఒకే ఒకే వ్యూహం ఒత్తిడి. జెలెన్‌స్కీని ఆ ఒత్తిడితోనే దారికి తెచ్చుకుంది. చివరకు ఆయన అమెరికా ప్రతిపాదనకు ఓకే చెప్పడంతో మిలిటరీ, నిఘా సహాయాలను పునరుద్ధరించింది. ఇప్పుడు పుతిన్ విషయంలోనూ ట్రంప్ అదే చేయబోతున్నారు. ఇటీవలే ఉక్రెయిన్‌తో రష్యా శాంతి ఒప్పందానికి వచ్చే వరకు ఆ దేశంపై ఆంక్షలు, సుంకాలు విధించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణతో పాటు శాంతి నెలకొల్పే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించారు. సో.. జెలెన్‌స్కీ విషయంలో అమలు చేసిన ఒత్తిడి వ్యూహాన్నే పుతిన్ విషయంలోనూ అమలు చేయబోతున్నారన్నమాట. కానీ, అమెరికా ఒత్తిళ్లకు పుతిన్ అంత ఈజీగా లొంగే అవకాశం లేదు. అలా లొంగిపోయేవాడే అయితే ఈ యుద్ధం ఇంత సుదీర్ఘ కాలం సాగేదే కాదు.