ఉక్రెయిన్ కు అమెరికా షాక్ చర్చలకు సిద్ధమేనన్న జెలెన్ స్కీ
ఉక్రెయిన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ దేశానికి...అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఉక్రెయిన్ కు ఆర్థిక, సైనిక సాయాన్ని నిలిపేసింది. డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు జెలెన్ స్కీ వెనక్కి తగ్గారు.

ఉక్రెయిన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ దేశానికి…అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఉక్రెయిన్ కు ఆర్థిక, సైనిక సాయాన్ని నిలిపేసింది. డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు జెలెన్ స్కీ వెనక్కి తగ్గారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేశారు. రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే 3 ఏళ్లు గడిచిపోయింది. ఈ యుద్ధాన్ని ఓ శాంతి ఒప్పందం ద్వారా ముగించాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈ లక్ష్యానికి జెలెన్‌స్కీ కట్టుబడి ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. అంతేకాదు రష్యాతో శాంతి చర్చల్లో పాల్గొనాలని జెలెన్స్కీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఓవల్ ఆఫీస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి, ట్రంప్‌నకు మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఆ తర్వాత రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూర తీరంలోనే ఉందని జెలెన్‌స్కీ కామెంట్స్ చేశారు. అమెరికాతో డీల్‌కు తాను సిద్ధమేనని, ట్రంప్‌తో భేటీకి సిద్ధంగానే ఉన్నానని అన్నారు. ఇప్పటిదాకా అమెరికా అందించిన సాయంపై ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు.
రష్యాతో యుద్ధం ముగింపు సుదూరమేనన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అదో చెత్త ప్రకటన అని…అమెరికా ఈ యుద్ధాన్ని మరింత కాలం కొనసాగనీయబోమని స్పష్టం చేశారు. అమెరికా, ఐరోపా సాయం చేస్తున్నంత కాలం జెలెన్‌స్కీ శాంతిని కోరుకోడని అన్నారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటన జారీ అయిన కొద్ది గంటల్లోనే, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ దిగొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం విచారకరమని అన్నారు, తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని ఎక్స్‌లో జెలెన్‌స్కీ పోస్ట్ చేశారు.
ఇటీవల శ్వేతసౌధంలోని అనుకున్న చర్చలు జరగలేదని…ఇది దురదృష్టకరమని అన్నారు. దీన్ని సరిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్న జెలెన్ స్కీ…ఇకపై ఇలాంటి చర్చలు, సహకారం నిర్మాణాత్మకంగా ఉండేలా చూసుకుంటామని స్పష్టం చేశారు. ట్రంప్ సర్కారు కోరుతున్న రీతిలో అరుదైన ఖనిజాల తవ్వకాలపై సంతకాలు చేయడానికి ఎప్పుడు సిద్ధమేనని వెల్లడించారు. తమ భద్రతపై ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా సంతకాలకు తయారుగా ఉన్నామని తెలిపారు. ఎంతో భద్రత కల్పించి, ఖాయమైన హామీలు ఇవ్వడానికి ఇది సమర్థంగా పనిచేస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు జెలెన్‌స్కీ చెప్పారు.
రష్యాతో శాంతి చర్చలకు కీవ్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తాజా నిర్ణయంతో ఆయుధాలు, ఇతరత్రా యుద్ధసామగ్రి రూపంలో…దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైనవి ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉంది. ట్రంప్ దెబ్బకు అవన్నీ నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ కట్టుబడి ఉందని ట్రంప్ సంతృప్తి చెందే వరకు ఆ దేశానికి సాయం అందబోదని శ్వేతసౌధం వెల్లడించింది.