Human Animal Conflict: పది సింహాల్ని చంపిన ప్రజలు.. కెన్యాలో పెరుగుతున్న సంక్షోభం
తాజాగా కెన్యాలో దారి తప్పి తమ గ్రామ పరిధిలోకి వచ్చిన సింహాలను ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు చంపేశారు. ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా పది సింహాలను చంపేశారు. మనుగడ కోసం మానవజాతికి, మూగ జీవాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణకు నిదర్శనం ఈ ఘటన.
Human Animal Conflict: అడవి జంతువులు అప్పుడప్పుడూ దారి తప్పి లేదా ఆహారం, నీళ్ల కోసం జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు మన దేశంలో అనేకం జరుగుతున్నాయి. ఇళ్లల్లోకి చొరబడటం, వీధుల్లోకి రావడం వంటివి జరుగుతున్నాయి. ఇది మన దేశానికే పరిమితం కాలేదు. అడవి జంతువులు ఎక్కువగా ఉండే ఆఫ్రికాలోనూ జరుగుతున్నాయి. తాజాగా కెన్యాలో దారి తప్పి తమ గ్రామ పరిధిలోకి వచ్చిన సింహాలను ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు చంపేశారు. ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా పది సింహాలను చంపేశారు. మనుగడ కోసం మానవజాతికి, మూగ జీవాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణకు నిదర్శనం ఈ ఘటన.
మానవుడి చర్యలు ప్రకృతికి హాని చేస్తున్నాయి. తన మనుగడ కోసం పచ్చని పొలాల్ని బీడు భూములుగా మార్చేస్తున్నాడు. తనకు నివాసంగా చేసుకుంటున్నాడు. చివరకు అడవుల్ని కూడా వదలడం లేదు. అటవీ సంపదను కొల్ల గొడుతున్నాడు. అభివృద్ధి పేరిట అడవుల్ని నరికి రోడ్లు వేస్తున్నారు. ఇండ్లు కడుతున్నారు. దీంతో అక్కడే బతికే మూగజీవాలకు ఆవాసం కరువవుతోంది. క్రమంగా అడవి జంతువులు బతికే అటవీ పరిధి తగ్గిపోతోంది. దీనివల్ల వాటికి సరైన ఆహారం, నీళ్లు, ఆవాసం వంటివి దొరకడం లేదు. వాటి మనుగడే కష్టమైపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అవి ఆహారాన్ని, నీళ్లను వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తున్నాయి.
గ్రామాలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. అక్కడి జంతువులపై దాడి చేసి చంపుతున్నాయి. ఇంకొన్నిసార్లు మనుషులకు హాని తలపెడుతున్నాయి. ఈ తరహా ఘటనలు జరిగితే అధికారులు స్పందించి మూగ జీవాల్ని చంపడమో, బంధించి మరో చోటుకు తరలించడమో చేస్తున్నారు. అయితే, ఈ పరిస్థితికి గల మూల కారణాల గురించి మాత్రం ఆలోచించడం లేదు. అందుకే మనిషికి, మృగానికి మధ్య సంఘర్షణ ఇంకా పెరుగుతూనే ఉంది.
కెన్యాలో ఇదే పరిస్థితి
ఆఫ్రికా దేశాల్లో అడవి జంతువులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల సింహాలు, ఇతర అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. అలా జంతువులు ఊళ్లోకి వస్తే అక్కడి వాళ్లు వాటిని వేటాడి చంపుతున్నారు. తుపాకులు, ఇతర ఆయుధాలతో మూగ జీవాలపై దాడి చేస్తున్నారు. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో అటవీ జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా దక్షిణ కెన్యాలో స్థానికుల చేతిలో పది సింహాలు హతమయ్యాయి. అందులో గత శనివారమే ఆరు సింహాలు చనిపోయాయి. కెన్యాలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన సింహం కూడా వీటిలో ఉంది. అంటే.. 19 ఏళ్ల వయసున్న లూంకిటో అనే సింహం కూడా మరణించింది. ఈ సింహానికి కొద్ది రోజులుగా ఆహారం దొరకలేదు. దీంతో ఆహారం వెతుక్కుంటూ తన పరిధి దాటి ప్రజలు ఉండే నివాసాల వైపు వచ్చింది. ఒక పశువుల మందపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా, వాటి యజమాని చంపేశాడు.
కరువుతో సమస్యలు
కెన్యాలో ప్రస్తుతం తీవ్ర కరువు తాండవిస్తోంది. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కరువు ఆ దేశాన్ని పీడిస్తోంది. దీంతో మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఆహారం దొరకడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే సింహాలు ఆహారం కోసం వస్తుంటే అక్కడి వాళ్లు వాటిని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు. కెన్యా ప్రజలు తమ పశు సంపదను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. అందుకే సింహాల్ని కూడా వరుసగా చంపేస్తున్నారు. సింహాల దాడిలో 11 గొర్రెలు, ఒక కుక్క చనిపోయింది. అందుకే స్థానికులు సింహాల్ని చంపారు. ఈ ఘటనలతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. సింహాల్ని చంపకుండా చూసేలా స్థానికులతో చర్చలు జరుపుతోంది. అడవి జంతువులకు ఆహారం అందించడం వంటి చర్యలు తీసుకుంటోంది. మనుషులకు, అడవి జంతువులకు మధ్య ఘర్షణ తగ్గించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా.. ఒకేసారి పది సింహాలు మరణించడం మాత్రం సంచలనంగా మారింది.