Myanmar: ఇదేం ఘోరం.. సొంత దేశస్థులపైనే బాంబులు వేయిస్తున్న మయన్మార్.. వంద మందికిపైగా మృతి
సైనిక విమానం ద్వారా వీరిపై బాంబుల వర్షం కురిపించింది. అందరూ ఒకే చోట ఉండటంతో భారీ నష్టం సంభవించింది. దీంతో దాదాపు వంద మందికిపైగా మరణించారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. తాజా దాడిని ఐరాస మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ తీవ్రంగా ఖండించారు.
Myanmar: మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం దారుణాలకు తెగబడుతోంది. తమ పాలనను వ్యతిరేకిస్తున్న సొంత ప్రజలపైనే బాంబులు వేయిస్తోంది. సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో వంద మందికిపైగా సాధారణ ప్రజలు మరణించారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మయన్మార్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ప్రజలు-సైన్యానికి మధ్య ఘర్షణ వాతావరణం నడుస్తోంది.
రెండేళ్లలో మూడు వేల మంది హతం
మయన్మార్‌లో కొనసాగుతున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అక్కడి సైన్యం రద్దు చేసింది. 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని సైన్యం తమ చేతిలోకి తీసుకుంది. రెండేళ్లుగా సైనిక పాలనే కొనసాగుతోంది. అయితే, సైనిక పాలనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అలాంటివారిని సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా తిరగబడుతున్న వారిపై ఆకృత్యాలకు పాల్పడుతోంది. వారిపై దాడులు, కాల్పులు జరుపుతోంది. చివరకు బాంబు దాడులు, వైమానిక దాడులకు కూడా సైన్యం వెనుకాడటం లేదు. సైన్యం అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో మూడు వేల మంది వరకు సామాన్య ప్రజలు మరణించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనావేయొచ్చు.
సైన్యాన్ని వ్యతిరేకించే ప్రాంతాలపై దాడులు
ఇక్కడి సాగింగ్ ప్రాంతంలోని పా జి గ్యి గ్రామంపై సైన్యం మంగళవారం వైమానిక దాడులు జరిపింది. ఈ ప్రాంతంలోని ప్రజలు సైనిక పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్లు సొంతంగా మిలిటరీని, పాఠశాలలను, వైద్యశాలలను, పాలనను ఏర్పాటు చేసుకున్నారు. సొంత సైన్యంగా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (పీడీఎస్) ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం ఉదయం దీనికి సంబంధించి ఒక ఆఫీస్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. దీనికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమయంలో మయన్మార్ సైన్యం వీరిపై వైమానిక దాడికి పాల్పడింది. సైనిక విమానం ద్వారా వీరిపై బాంబుల వర్షం కురిపించింది. అందరూ ఒకే చోట ఉండటంతో భారీ నష్టం సంభవించింది. దీంతో దాదాపు వంద మందికిపైగా మరణించారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. కొందరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వైమానిక దాడి తర్వాత ఒక హెలికాప్టర్ కూడా ఈ ప్రాంతంలో 20 నిమిషాలపాటు సంచరించిందని స్థానికులు తెలిపారు.
భయానకంగా దాడి దృశ్యాలు
వైమానిక దాడి ఘటన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బాంబు దాడులతో ఈ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. శరీర భాగాలు ముక్కలుగా తెగిపడ్డాయి. ఇంకొందరు పేలుడు ధాటికి ఏర్పడ్డ మంటల్లో కాలి బూడిదైపోయారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. మంటల్లో చాలా ఇండ్లు కాలిపోయాయి. బాధితులకు స్థానికులు సాయం చేశారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఖండించిన ఐరాస
ఏ దేశమైనా శతృ దేశాలపై దాడులు చేసేందుకే యుద్ధ విమానాల్ని ఉపయోగిస్తుంటుంది. కానీ, మయన్మార్ ప్రభుత్వం మాత్రం సొంత ప్రజలపై దాడికి వీటిని ఉపయోగించడం విశేషం. సైన్యం అధికారం దక్కించుకున్న రెండేళ్లలో సొంత ప్రజలపై 600 వైమానిక దాడులు చేసినట్లు ఒక నివేదికలో తేలింది. మయన్మార్‌లో జరుగుతున్న దారుణ మారణ కాండను ఐక్యరాజ్యసమితి ఖండించింది. తాజా దాడిని ఐరాస మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ తీవ్రంగా ఖండించారు. ఫిబ్రవరి 1, 2021 నుంచి మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. సొంత ప్రజలపైనే సైన్యం వైమానిక దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని తాము వణికిపోయామని చెప్పారు. ఇప్పటికే మయన్మార్‌లో అంతర్యుద్ధం కారణంగా వేల మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. సైన్యం కాల్పుల్లో చాలా మంది మరణించారు. 14 లక్షల మంది ప్రజలు దేశం విడిచి వలస వెళ్లిపోయారు.