Alien Bodies: అవిగో ఏలియన్స్.. ఇదిగో UFO.. మెక్సికో చట్టసభల్లో ఉన్న ఆ అవశేషాలేంటి..?
యుఎఫ్ఓ(UFO)ల గురించి పరిశోధనలు చేసే ఎక్స్‌పర్ట్‌గా పేరొందిన జైమ్ మౌస్సన్ మెక్సికన్ కాంగ్రెస్‌లో రెండు మానవేతర అవశేషాలను ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Alien Bodies: మెక్సికో చట్టసభల్లో రెండు ఏలియన్ తరహా అవశేషాలను ప్రదర్శించారు. అవి ఏలియన్స్‌వని కొంతమంది వాదిస్తుండగా.. మరికొందరు యూఎఫ్‌ఓలని.. ఇంకొందరు అవి డమ్మీలని వాదిస్తున్నారు. ఏలియన్స్, UFOల గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా అమెరికా పేరే వినిపిస్తుంది. కానీ, ఈ సారి మాత్రం మెక్సికో పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. యుఎఫ్ఓ(UFO)ల గురించి పరిశోధనలు చేసే ఎక్స్‌పర్ట్‌గా పేరొందిన జైమ్ మౌస్సన్ మెక్సికన్ కాంగ్రెస్‌లో రెండు మానవేతర అవశేషాలను ప్రెజెంట్ చేశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అవశేషాలు వేల సంవత్సరాల పురాతనమైనవి. మనిషితో కంపేర్ చేస్తే 30శాతం భిన్నమైన జన్యు కూర్పును కలిగి ఉన్నాయి. పెరూలోని ఓ గనిలో దొరికిన ఈ మృతదేహాల్లో మూడు ఫింగర్స్ ఉన్న చేతులు, పొడవైన పుర్రెలు, చాలా లైట్ వెయిట్ ఉన్న ఎముకలు కనిపించాయి. గ్రహాంతరవాసుల జాడపై దశాబ్దాల పాటు పరిశోధనలు చేసిన మౌసన్ శాస్త్రవేత్తలతో చేతులు కలిపి అంతుచిక్కని శవాలను బయటపెట్టారు. పెరూ కుస్కోలోని ఓ గని నుంచి ఈ మృతదేహాలను వెలికితీశారు. నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో నిర్వహించిన కార్బన్ డేటింగ్‌లో ఈ మృతదేహాలు 1,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవని నిర్ధారించారు. అవి హ్యూమనాయిడ్ ఆకారాన్ని కలిగి ఉన్నాయి. ఇవి కొంచెం పక్షులను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. వీటికి దంతాలు లేవు. ఈ నమూనాలు మన భౌగోళిక పరిణామంలో భాగం కాదన్నది జైమ్ మౌసన్ చెబుతున్న మాట. డయాటమ్ (Algae) గనుల్లో వీటిని కనుగొనడంతో ఇవి ఏలియన్స్ లేదా యూఎఫ్‌ఓలు కాకపోవచ్చంటున్నారు. గ్రహాంతరవాసులో కాదో మనకు తెలియదని.. కానీ ఈ అవశేషాలను బట్టి చూస్తే వారు తెలివైనవారని.. మనతో జీవించారని చెబుతున్నారు.
గ్రహాంతర మృతదేహాలను జైమ్ మౌసన్ బయటకు చూపించడం ఇది తొలిసారి కాదు. 2015లోనూ ఆయన గ్రహాంతర మూలానికి చెందిన మరొక మమ్మీ శవాన్ని చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుత అవశేషాలను గమనిస్తే వాటిలో పిండాలతో కూడిన గుడ్లు కూడా ఉన్నాయని.. కాడ్మియం, ఓస్మియం లోహాలతో చేసిన ఇంప్లాంట్లు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు మెక్సికన్ కాంగ్రెస్‌లో వింత అవశేషాల ప్రజెంటేషన్‌పై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది. సైంటిఫిక్‌గా దీనిపై ఒక నిర్ధారణకు రావాలని నాసా అభిప్రాయపడుతోంది. ముందు శాస్త్రీయ నిపుణుల దగ్గరకు ఈ విషయాన్ని తీసుకొని వెళ్లాలని, ఆ తర్వాతే ఒక అంచనాకు రావాలని చెప్పింది.