Kerala Lottery: లాటరీ టిక్కెట్ కొనడానికి డబ్బులు లేవ్.. కానీ కోట్లకు పడగలెత్తారు.. జాక్‌పాట్ అంటే వీళ్లదే..!

ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే ముల్సిపాలిటీ కార్మికులను లక్ష్మీదేవి పది కోట్ల రూపంలో పలకరించింది. అవును మీరు చదివింది నిజమే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.10 కోట్ల లాటరీ ప్రైజ్ మనీ దక్కించుకున్నారు మున్సిపల్ కార్మికులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 28, 2023 | 07:37 PMLast Updated on: Jul 28, 2023 | 7:38 PM

11 Women Pool Money To Buy Rs 250 Lottery Ticket In Kerala Won Rs 10 Crore Jackpot

Kerala Lottery: ఫలానా వాళ్లకు లాటరీలో అంతొచ్చింది.. ఇంతొచ్చింది అంటూ కేరళ నుంచి అప్పుడప్పుడు న్యూస్ వస్తూ ఉంటుంది. కేరళలో ప్రభుత్వమే లాటరీలు నడుపుతుంది. కేరళలో ఏ ఊరుకెళ్లినా లాటరీ టిక్కెట్లు అమ్మేవాళ్లు, కొనేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. పది, ఇరవై పెట్టి టిక్కెట్ కొనుక్కుని.. కోట్ల రూపాయలు గెలుచుకునే లక్ కోసం కేరళవాసులు ఎదురుచూస్తూ ఉంటారు. అడపా దడపా ఎవరికో కోట్ల రూపాయల లాటరీ తగులుతుంది. ఒక్కసారిగా వాళ్లు సెలబ్రిటీలుగా మారిపోతారు. కేరళలోని మలప్పురానికి చెందిన కొంతమంది ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే ముల్సిపాలిటీ కార్మికులను లక్ష్మీదేవి పది కోట్ల రూపంలో పలకరించింది. అవును మీరు చదివింది నిజమే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.10 కోట్ల లాటరీ ప్రైజ్ మనీ దక్కించుకున్నారు మున్సిపల్ కార్మికులు. అది కూడా మహిళా సంఘానికి చెందిన వాళ్లు.
టిక్కెట్ కొనడానికి డబ్బులు లేకపోయినా
కేరళలోని పరప్పనగడి మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేవ గ్రూప్ సభ్యులు ఇంటింటికి వెళ్లి తడి చెత్తా, పొడి చెత్తను సేకరిస్తూ ఉంటారు. పూట గడవడానికి కూడా ఇబ్బందిపడే అతి సాధారణ పేద జీవితాలు వాళ్లవి. లాటరీ టిక్కెట్ కొని అదృష్టాన్ని పరీక్షించుకుంటే తమ కష్టాలు తీరతాయని వాళ్లలో కొందరికి అనిపించింది. కానీ వాళ్లు అనుభవిస్తున్న పేదరికం ఎలాంటిదంటే రూ.250 పెట్టి లాటరీ టిక్కెట్ కొనడానికి కూడా వాళ్ల దగ్గర డబ్బులు మిగలవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు వచ్చిన ఒక ఐడియా వాళ్ల జీవితాన్నే మార్చేసింది. హరిత కర్మ సేవ గ్రూప్‌‌లో ఉన్న వారిలో 11 మంది మహిళలు.. ఒక్కొక్కరు ఇంత అంటూ డబ్బులు పోగుచేశారు. 9 మంది 25 రూపాయల చొప్పున.. మరో ఇద్దరు పన్నెండున్నర రూపాయల చొప్పున షేర్ చేసుకుని 250 రూపాయల పెట్టి లాటరీ టిక్కెట్ కొన్నారు.
చేతులు కలిపారు..కోట్లు గెలిచారు
ఇళ్లల్లో చెత్తసేకరించి.. పొట్టగడుపుకునే.. ఈ మహిళలకు తమ జీవితంలో ఒకేసారి లక్ష రూపాయలను చూసి ఉండరు. అలాంటిది.. పది కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ల సొంతమైంది. టిక్కెట్ కొనేటప్పుడు కూడా ఆ 25 రూపాయలు షేర్ చేసుకోవడానికి వాళ్లు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఒకేసారి రూ.10 కోట్లు బంపర్ ప్రైజ్ గెలిచే సరికి వాళ్ల ఆనందానికి అవధులు లేవు. టాక్స్ రూపంలో కొంత డబ్బు పోయినా.. ఈ 11 మంది మహిళల జీవితాలు మాత్రం ఒకే ఒక్క లాటరీతో.. తమ జీవితంలో చూడలేనంత డబ్బు చూశారు. అప్పులు తీర్చేసి పిల్లలను చదివించుకుంటామని ఆనందంగా చెబుతున్నారు. ఎంతైనా జాక్‌పాట్ అంటే ఇలా ఉండాలి.