Aliens: సముద్రంలో 7వేల ఏళ్ల నాటి రహదారి.. ఏలియన్స్ ఈ దారిని నిర్మించారా?
సముద్రంలో మీద రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు చూసి ఉంటారు. ఈ మధ్య సముద్రం లోపల కూడా రైళ్లు వెళ్తున్నాయ్. ఐతే సముద్ర గర్భంలో రోడ్డు ఉంది.. దాని మీద ప్రయాణం చేసేవారు అంటే నమ్ముతారా.. నమ్మి తీరాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి !
మధ్యధరా సముద్ర ఉపరితలం నుంచి 16 అడుగుల దిగువన.. 13 అడుగుల వెడల్పు గల చారిత్రక రహదారిని పురావస్తు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పురాతన హవార్ సంస్కృతికి సంబంధించిన వ్యక్తులు ఈ రహదారిని నిర్మించారని వారు అంచనా వేస్తున్నారు. మునిగిపోయిన నియోలిథిక్ ప్రదేశం.. క్రొయేషియా ద్వీపం కోర్కులాతో కలుస్తుందని అంచనా వేస్తున్నారు. నీటి ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చారు.
పురావస్తు శాస్త్రవేత్తలు ఈ దారి ఫొటోలు, వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోర్కులా ఒకప్పుడు క్రొయేషియా ప్రధాన భూభాగానికి ఆనుకొని ఉండేది. మంచు యుగం చివరలో సముద్ర మట్టం పెరగడంతో ఈ రహదారి మునిగిపోయింది. ఈ ద్వీపం సుమారు 8వేల ఏళ్ల కింద ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు. రాళ్లతో నిర్మించిన ఈ రహదారి.. ఎప్పుడ నిర్మించారనే పక్కా డేట్ చెప్పడానికి సైంటిస్ట్ టీమ్ రేడియోకార్బన్ టెస్టులు నిర్వహించింది. క్రీస్తు పూర్వం 4వేల 9వందల నాటిదిగా దీన్ని తేల్చారు.
ఈ ప్రాంతంలోని పురాతన స్థావరాలలో ఇది ఒకటిగా నిలిచింది. అనేక సంస్థలు, కంపెనీలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ రహదారిని కనుక్కుంది. ఈ దారిని బట్టి.. హవార్ సంస్కృతి చాలా అభివృద్ధి చెందినదనీ, ఆకట్టుకునే నిర్మాణాలను నిర్మించిందని అర్థమవుతోంది. హవార్ సంస్కృతికి చెందిన చాలా మంది రైతులు, పశువుల కాపరులు సముద్ర తీరానికి దగ్గర్లో నివసించారు. ఇతర సంస్కృతులకు చెందిన ప్రజలు కూడా ద్వీపం చుట్టూ నివసించారు. వారే ఈ రోడ్డును నిర్మించుకొని ఉంటారని భావిస్తున్నారు.