జనవరి 25న ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో జరిగే అద్భుతాలు చూడటమంటే ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటిది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఆకాశంలో కనిపించే సుందరదృశ్యాలైతే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2025 | 09:10 PMLast Updated on: Jan 24, 2025 | 9:10 PM

A Miracle In The Sky On January 25

ఆకాశంలో జరిగే అద్భుతాలు చూడటమంటే ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటిది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఆకాశంలో కనిపించే సుందరదృశ్యాలైతే.. ఖచ్చితంగా ఎవరూ వాటిని మిస్ చేసుకోరు. అలాంటి ఓ ఖగోళ అద్భుతం ఈ జనవరి 25న కనువిందు చేయనుంది. ఆరు గ్రహాలు భూమికి సమాంతర రేఖలో వరుసగా కనిపించనున్నాయి. జనవరి 25న ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆరు గ్రహాలు ఒకే వరుసలో దర్శనమివ్వనున్నాయి. ఇది జీవితకాలంలో ఒక్కసారి జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. యురేనస్, నెప్ట్యూన్‌లను చూడాలంటే టెలిస్కోప్ తప్పనిసరి. ఈ గ్రహాలన్నీ ఒకే వరుస క్రమంలో వచ్చి కూర్చుంటాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున జరుగుతుంది. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండు సార్లు కనువిందు చేయనుంది. అప్పుడప్పుడు గ్రహాల స్థానాలు సూర్యునికి ఒకే వైపున సమలేఖనం అవుతాయి. దీర్ఘవృత్తాకార కక్ష్యలో గ్రహాల అమరిక ఉండటం వల్ల భూమినుంచి చూసినప్పుడు ఆకాశంలో అవన్నీ దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. దీన్నే ప్లానెటరీ పరేడ్ అని పిలుస్తారు. వాస్తవానికి ఒక్కో గ్రహం మరో గ్రహం నుంచి కొన్ని మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. భూమి నుంచి చూసినప్పుడు ఈ గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్నట్లు ఒక భ్రమను సృష్టిస్తుంది.ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు.

మూడు నుంచి ఎనిమిది గ్రహాలు ఒకే వరుసలో వచ్చినప్పుడు ప్లానెట్ అలైన్‌మెంట్ జరుగుతుంది. ఐదు నుంచి ఆరు గ్రహాలు ఒకే వరుసలో రావడం ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఏడు గ్రహాలు ఒకేసారి వరుసలో అమరిక జరగడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. జనవరి 25వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలు ఒకేవరుసలో దర్శనమివ్వనున్నాయి. 25 జనవరి 2025 నుంచి ఒకే వరుసలో గ్రహాల అమరికి దృశ్యం భారత్‌లో కనిపిస్తుంది. ఈ ప్లానెట్ పరేడ్ దాదాపుగా నాలుగు వారాల పాటు ఆకాశంలో కనువిందు చేస్తుంది. దీంతో నింగిలో జరిగే అద్భుతాలను వీక్షించేందుకు తగిన సమయం లభిస్తుంది. ఈ గ్రహాలను ఎలాంటి పరికరాలు వినియోగించకుండా నేరుగా కళ్లతో చూడొచ్చా అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా కళ్లతో చూడొచ్చు. అయితే నెప్ట్యూన్, యూరేనస్ గ్రహాలను చూడాలంటే మాత్రం టెలిస్కోప్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. సూర్యాస్తమయం అయ్యాక ఈ గ్రహాలు ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇంక క్లియర్‌గా చెప్పాలంటే రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్లానెట్ పరేడ్ అత్యంత సుందరంగా కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే ఇవి స్పష్టంగా కనిపించడం అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. స్థానిక వాతావరణం, ఆ ప్రాంతంలో కాలుష్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ సుందర దృశ్యం స్పష్టంగా కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే కాంతి,కాలుష్యం తక్కువ స్థాయిలో ఉండే ప్రదేశాల్లో ఈ గ్రహాల అమరిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కాలుష్యం అతితక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల నుంచి వీక్షిస్తే ఈ ఖగోళ అద్భుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.