Ambani: కాంపకోలా Vs కోకకోలా
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కోకకోలాను ఢీకొడుతున్నారు. ఒకప్పటి ఐకానిక్ బ్రాండ్ కాంపకోలాను మార్కెట్ లోకి తీసుకొచ్చారు. మరి ఆయన సక్సెస్ అవుతారా..? ప్రైస్ వార్ లో గెలిచేదెవరు..?
కాంపకోలా అంటే ఈ తరానికి పెద్దగా తెలియదు.. కానీ ఒకప్పుడు అదో ఫేమస్ బ్రాండ్. ఒకప్పుడు దేశాన్ని ఉర్రూతలూగించిన బ్రాండ్.. ఆ రుచికి ఇండియా ఫిదా అయిపోయింది. కాలక్రమేణా కనుమరుగైన ఆ కాంపకోలాను అదే ఫ్లేవర్ లో సరికొత్తగా మన ముందుకు తీసుకు వచ్చింది రిలయన్స్.. గతేడాది ప్యూర్ డ్రింక్ర్ గ్రూపు నుంచి 22 కోట్ల రూపాయలకు కాంపా బ్రాండ్ ను రిలయన్స్ రీటైల్ కొనుగోలు చేసింది. ఆ వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. ఈ వేసవిలోనే కూల్ కూల్ గా కాంపకోలాను అందుబాటులోకి తెచ్చేసింది.
కాంపకోలా, కాంప లెమన్, కాంప ఆరెంజ్ అనే మూడు ఫ్లేవర్లలో లభ్యమైన ఈ డ్రింక్ ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే లాంచ్ అయ్యింది. నెమ్మదిగా దేశమంతా అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో మార్ట్ లో ఇప్పటికే అమ్మకాలు మొదలయ్యాయి కూడా. కాంపకోలాను తీసుకురావడం వెనక ముకేష్ అంబానీకి పెద్ద వ్యూహమే ఉంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్లో లీడర్ గా ఎదగాలన్నది అంబానీ ఆలోచన. కూరగాయల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని విభాగాల్లోకి ఎంటరైపోయారు. సబ్బుల నుంచి షాంపుల వరకు, కుకీస్ నుంచి కోలా వరకు సొంత బ్రాండ్లు తీసుకురావాలన్నది లక్ష్యం. అందులో భాగంగానే కాంపకోలాను రిలయన్స్ రీటెయిల్ సొంతం చేసుకుంది.
మనం తాగే కూల్ డ్రింక్ ఖరీదు ఓ 20రూపాయలు ఉంటుంది. మరి దేశీయంగా ఏటా కూల్ డ్రింక్ మార్కెట్ ఎంతో తెలుసా.. అక్షరాలా 68వేల కోట్ల రూపాయలు.. అంత పెద్ద అవకాశాన్నీ అంబానీ ఎలా వదులుకుంటారు. అందుకే 22కోట్లతో కంపెనీ కొని వేలకోట్ల వ్యాపారాన్ని టార్గెట్ చేశారు. గతంలో కోకకోలా దేశీయ హెడ్ గా పనిచేసిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. డ్రింక్ తీసుకురావడమే కాదు దాని డిస్ట్రిబ్యూషన్ కూడా ముఖ్యమే. దానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా చేసేసింది రిలయన్స్. కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న లోకల్ బ్రాండ్లను సొంతం చేసుకుంది. మరికొన్నింటి కొనుగోలుకు ప్రయత్నిస్తోంది. వాటి డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను వాడుకోవాలన్నది ఆలోచన. మార్కెట్ ను ఆక్రమించేందుకు త్వరలో యాడ్స్ తో దండెత్తబోతోంది రిలయన్స్. ఇప్పటికే ఉన్న తన నెట్ వర్క్ దీనికి అదనం.
కూల్ డ్రింక్స్ మార్కెట్లో కోకకోలా, పెప్సీ లీడర్లుగా ఉన్నాయి. వాటిని ఢీకొట్టడం అంటే అంబానీకి అయినా మాటలు కాదు. అందుకే పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. కాంపకోలాను లాంచ్ చేయడమే కాకుండా దాని ధర అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ఓ రకంగా కోకకోలా, పెప్సీతో ప్రైస్ వార్ కు దిగుతున్నారు. 2లీటర్ల కాంప డ్రింక్ 59రూపాయలకే అందుబాటులో ఉంది. కానీ కోకకోలా, థంప్సప్, లిమ్కా, ఫాంటాలు 2లీటర్ల ధర 89రూపాయలుగా ఉంది. ఇక పెప్సీ లీటరున్నర బాటిల్ ధర 69రూపాయలు. మల్టీ నేషన్ బ్రాండ్ కోకకోలా, పెప్సీలను తట్టుకోవడం అంత ఈజీ కాదని అంబానీకి తెలుసు. పైగా ఇన్నాళ్లుగా ఆ టేస్టు జనానికి అలవాటైపోయి ఉంది. దాన్ని మార్చడం అంత సులభం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. వేసవిలో సాఫ్ట్ డ్రింక్స్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే దాన్ని జనానికి చేరువ చేయాలన్నది రిలయన్స్ వ్యూహం.
ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ 1949 నుంచి 1970ల వరకు దేశంలో కోకాకోలకు సోలో డిస్ట్రిబ్యూటర్. 1970ల్లో తన సొంత బ్రాండ్ కాంపకోలాను తీసుకొచ్చింది. కొద్దిరోజుల్లోనే మార్కెట్ లీడర్ స్థాయికి ఎదిగింది. ముంబయి, ఢిల్లీలో దీనికి బాటిలింగ్ ప్లాంటులు ఉండేవి. గ్రేట్ ఇండియన్ టేస్ట్ పేరిట కొన్నాళ్లు మార్కెట్ ను ఏలింది కాంప.అయితే 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలతో విదేశీ వ్యాపారానికి తలుపులు బార్లా తెరుచుకోవడంతో కాంపకోలాకు కష్టాలు మొదలయ్యాయి. కోకకోలా, పెప్సీ దూకుడు ముందు తట్టుకోలేకపోయింది. ఇక అది పూర్తిగా కనుమరుగైపోయిందనే అంతా అనుకున్నారు. కానీ దేశీయ బ్రాండ్ తో సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ గా ఎదగాలన్న ఆలోచనతో అంబానీ రిస్క్ తీసుకున్నారు. మరి రిస్క్ రిలయన్స్ ను సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ లీడర్ గా నిలబెడుతుందా..? మరికొన్ని రోజుల్లోనే అదీ తేలిపోనుంది.
(KK)