Ambedkar Statue: దేశానికే తలమానికం.. హైదరాబాద్‌లో కొలువుదీరనున్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం.. ఎన్ని విశేషాలో!

దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2023 | 04:55 PMLast Updated on: Apr 01, 2023 | 5:25 PM

Ambedkars Biggest Statue To Be Inagurated In Hyderabad On April 14 By Cm Kcr

Ambedkar Statue: హైదరాబాద్, ట్యాంక్‌బండ్ పరిధిలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కొలువుదీరబోతుంది. దీని ఎత్తు 125 అడుగులు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ విగ్రహం ఏర్పాటైతే తెలంగాణకే కాదు.. దేశానికి కూడా తలమానికంగా నిలుస్తుంది. హైదరాబాద్, ట్యాంక్ బండ్ పై చేపడుతున్న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో, ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకుని ఉన్న స్థలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మొత్తం 36 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు చేపట్టారు.

దీనిలో 2 ఎకరాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. మిగతా 34 ఎకరాల్లో అంబేద్కర్ స్క్వేర్ ఏర్పాటు చేస్తారు. దీని పరిధిలోనే అంబేద్కర్ గురించిన సమగ్ర సమాచారం అందేలా మ్యూజియం, సమావేశ మందిరం వంటివి కూడా ఏర్పాటవుతాయి. స్మృతివనానికి దగ్గర్లోనే నూతనంగా ఏర్పాటవుతున్న సచివాలయం, ఎన్టీఆర్ గార్డెన్, తెలంగాణ అమరవీరుల స్మారకం, జలవిహార్, లుంబినీ పార్క్, హుస్సేన్ సాగర్ బోటింగ్, బిర్లా మందిర్ వంటివి ఉంటాయి. దీంతో అంబేద్కర్ విగ్రహం చూసేందుకు వచ్చే పర్యాటకులు ఇతర ప్రదేశాల్ని కూడా సందర్శించవచ్చు.

స్మృతివనంలో ఏమేం ఉంటాయంటే
36 ఎకరాల్లో నిర్మితమవుతున్న అంబేద్కర్ స్మృతివనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రెండు ఎకరాల్లో ప్రధాన విగ్రహంతోపాటు, చుట్టూ రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేప్ ఏరియా, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, ర్యాంప్, వాటర్ ఫౌంటెయిన్, శాండ్ స్టోన్ ఆర్ట్ వర్క్స్, జీఆర్సీ, ఫాల్స్ సీలింగ్, లిఫ్ట్, పార్లమెంట్ బిల్డింగ్ ఆకృతిలో బేస్ మెంట్, ఈ మెయిన్ బిల్డింగ్ లోపల ఆడియో, విజువల్ కాన్ఫరెన్స్ హాల్, మ్యూజియం, లైబ్రరీతోపాటు విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి వంటివి ఉన్నాయి. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన అన్ని విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ పనులు అన్నింటినీ ఏప్రిల్ 10లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పనుల్ని వేగవంతం చేసే ఉద్దేశంతో సిబ్బందిని పెంచారు. ప్రస్తుతం 425 మంది వరకు పని చేస్తున్నారు.

విగ్రహం ప్రత్యేకతలివి
ఇది 125 అడుగుల విగ్రహం. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. ఈ స్థాయి భారీ విగ్రహాలు నిర్మించే సాంకేతికత మన దేశంలో అందుబాటులో లేదు. అందుకే అప్పట్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ చైనాలో పర్యటించింది. చైనా సహకారంతో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. విగ్రహ తయారీకి సంబంధించిన విడి భాగాల్ని నో్యిడాలో తయారు చేయించారు. వాటన్నింటినీ క్రమపద్ధతిలో అమర్చి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. దీని నిర్మాణంలో 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వాడారు. విగ్రహానికి పాలీయురేథీన్ తో పాలిషింగ్ చేస్తున్నారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు అయినప్పటికీ, బేస్ మెంట్ ఎత్తు 50 అడుగులు, వెడల్పు 45 అడుగులు ఉంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.146 కోట్లని అంచనా. కేపీసీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఈ విగ్రహన్ని పద్మభూషన్ అవార్డు గ్రహీత రాం వంజియ సుతార్, ఆయన తనయుడు అనిల్ సుతార్ డిజైన్ చేశారు.

ఏడాది అనుకుంటే.. ఏడేళ్లు పట్టింది!
2016లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా హైదారాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే ఏడాది ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 2017 ఏప్రిల్ 14లోపు విగ్రహ నిర్మాణం పూర్తి కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఏడాదిలోపే పని పూర్తి చేయాలనుకున్నప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఏకంగా విగ్రహ నిర్మాణం, స్మృతివనం పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యేందుకు ఏడేళ్ల సమయం పట్టింది. చివరకు ఈ ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Ambedkar Statue2