TITAN: ఐదుగురు కుబేరులను మింగేసిన టైటాన్..ఈ పాపం ఎవరిది ?

ఊహించిన విషాదం..అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శిథిలాలను పరిశీలించేందుకు వెళ్లిన ఐదుగురు కుబేరులు సముద్ర గర్భంలో కలిసిపోయారు. సముద్రంలో టైటానిక్ శిథిలాలు ఎక్కడున్నాయో వాటికి సమీపంలోనే టైటాన్ సబ్‌మెర్బిబుల్ భారీ పేలుడుతో ముక్కలైపోయింది. సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 1600 అడుగుల లోపల టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చెందిన భాగాలను అమెరికాకు చెందిన కోస్ట్ గార్డ్ బృందం గుర్తించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 23, 2023 | 12:43 PMLast Updated on: Jun 23, 2023 | 12:43 PM

An International Search Operation For The Titan Ground Vehicle Has Finally Brought Tragic News Who Is Responsible For The Loss Of Five Lives

ఆదివారం కెనడా తీరం నుంచి బయలుదేరిన గంటన్నరకే టైటాన్ గ్రౌండ్ వెహికల్ తో సంబంధాలు కోల్పోయింది. దీంతో కెనడా, అమెరికాకు చెందిన కోస్ట్ గార్డు బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి. కాలంతో పోటీ పడుతూ ఒక నిమిషం కూడా వృధా చేయకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గాలింపు చేపట్టాయి.

టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో కేవలం 96 గంటల పాటు మాత్రమే ఆక్సిజన్ అందుబాటులో ఉంటుంది. ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోకముందే అందులో ఉన్న ప్రయాణికులను రక్షించాలనుకున్న రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు ఫలించలేదు. గాలింపు ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత సముద్ర గర్భం నుంచి కొన్ని రేడియో తరంగాలు వినిపించాయి. దీంతో అందరిలోనూ ఆశ చిగురించింది. టైటాన్ సేఫ్ గానే ఉందని.. ఏదో రకంగా సహాయక బృందాలు దానిని పైకి తీసుకువస్తాయని అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ.. చివరకు టైటాన్ ప్రయాణం విషాదంగా ముగిసిపోయింది. ప్రతికూల పరిస్థితుల్లో ఐదు రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సెర్చ్ ఆపరేషన్ చివరకు విషాద వార్తనే మోసుకొచ్చింది.

సముద్ర గర్భంలో ఏం జరిగి ఉండొచ్చు ?

సముద్ర గర్భంలోకి ప్రయాణమంటేనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. వేల అడుగుల లోపల ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సముద్ర గర్భంలోకి పర్యాటకులను, పరిశోధకులను, శాస్త్రవేత్తలను తీసుకువెళ్లడంలో విశేష అనుభవం ఉన్న ఓషియన్ గేట్ సంస్థ…గతంలో ఇలాంటి యాత్రలు ఎన్నో చేసింది. టైటాన్ విషయంలో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది. టైటానిక్ శిథిలాలను చూసి తిరిగి సముద్ర ఉపరితలానికి రావాల్సిన టైటాన్ ప్రయాణం విషాదయాత్రగా మారడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది Catastrophic Implosion . అంటే ఆకస్మికంగా పూర్తిస్థాయిలో ఒకేసారి ప్రమాదం చుట్టుముట్టడం. టైటాన్ ముక్కలైపోవడానికి 90 శాతం ఇదే కారణమని అమెరికన్ కోస్ట్ గార్డు చెబుతుంది. టైటాన్ లో గ్యాస్ లీక్ కావడం, పవర్ ఫెయిల్ కావడం, లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగడం…ఇలా దీని వెనుక ఎలాంటి కారణమైనా ఉండి ఉండొచ్చు.

టైటాన్‌లో ప్రయాణం సేఫ్ అయితే ఎందుకిలా జరిగింది ?

టైటాన్‌లో సముద్ర గర్భంలోకి ప్రయాణం వందశాతం సురక్షితమని దానిని తయారు చేసిన ఓషియన్ గేట్ సంస్థ పదేపదే చెబుతుంది. కేవలం మాటలు మాత్రమేకాదు.. దీనికి సంబంధించి అమెరికా న్యాయస్థానాల్లో వందల కొద్దీ డాక్యుమెంట్లను కూడా సమర్పించింది. ప్రయాణికులను సముద్ర గర్భంలోకి తీసుకెళ్లడానికంటే ముందే..టైటాన్ ‌కు 50 సార్లు టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రస్తుతం టైటానిక్ శిథిలాలు ఎక్కడైతే ఉన్నాయో.. అక్కడి వరకు టైటాన్ సురక్షితంగా వెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో సంబంధం లేకుండానే.. పైలెట్ ఆదేశాలు ఇవ్వకుండానే.. సేఫ్టీ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేలా ఇందులో ఏర్పాట్లు చేసినట్టు ఓషియన్ గేట్ చెబుతుంది. ప్రమాదం జరిగితే వెంటనే శాండ్ బ్యాగ్స్ ను రిలీజ్ చేయడం, బెలూన్లు ఓపెన్ కావడం జరిగిపోతాయి. ఇన్ని అత్యాధునిక సదుపాయాలు ఉన్నా.. భద్రతాచర్యలు తీసుకున్నా.. అందులో ప్రయాణికులు ఇప్పుడు ప్రాణాలతో లేరు.

కుబేరులను చంపిన పాపం ఓషియన్ గేట్ సంస్థదే

ఊహించని ప్రమాదాలకు ఎవర్నీ బాధ్యులను చేయలేం. కానీ భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని హెచ్చరించినా పెడచెవిన పెడితే.. ఏం జరిగినా కచ్చితంగా వాళ్లే బాధ్యులవుతారు. ఇప్పుడు టైటాన్ విషయంలోనూ అదే జరిగింది. ఓషియన్ గేట్ సంస్థ ఓవర్ కాన్ఫిడెన్స్ కుబేరుల ప్రాణాలు తీసింది. భద్రతా పరంగా టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో చాలా లోపాలు ఉన్నాయని.. దానిని సముద్ర గర్భంలోకి పంపితే ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐదేళ్ల క్రితమే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి హెచ్చరించాడు.ఓషియన్ గేట్ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డేవిడ్ లొచిరిడ్జ్ టైటాన్ భద్రతా ప్రమాణాలపై చాలా సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర గర్భంలో ఎక్కువ లోతుల్లోకి వెళ్లే కొద్దీ..ప్రమాదాలకు ఎదురెళ్లినట్టేనని ఆయన హెచ్చరించారు. టైటాన్‌లో ఉన్న భద్రతా లోపాలపై 2018లోనే ఆయన కంపెనీకి ఓ నివేదిక అందించారు. దానిని చూసీచూడనట్టు వదిలేసిన ఓషియన్ గేట్ సంస్థ.. లోపాలను ఎత్తిచూపించినందుకు డేవిడ్ ను ఉద్యోగంలో నుంచి పీకేసింది. అందుకేకాకుండా కంపెనీకి చెందిన రహస్య వివరాలను బహిర్గతం చేశారని ఆరోపిస్తూ డేవిడ్ ను కోర్టుకీడ్చింది. దీనిపై ఆయన అమెరికా కోర్టుల్లో న్యాయపోరాటం చేశారు

మెరైన్ టెక్నాలజీ సొసైటీ ఏం చెబుతోంది ?

ఓషియన్ గేట్ సంస్థ తయారు చేసిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ పై ఆ సంస్థకు మినహాయించి ఎవరికీ నమ్మకం లేదు. టైటానిక్ శిథిలాలను చూపించే పేరుతో కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అమెరికాకు చెందిన మెరైన్ టెక్నాలజీ సొసైటీ 2018లోనే టైటాన్ నౌకపై ఆందోళన వ్యక్తం చేసింది. టైటాన్ విషయంలో ఓషియన్ గేట్ అనుసరిస్తున్న విధానాలు భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించింది. దీనిపై ఓషియన్ గేట్ సంస్థకు లేఖ రాసినా యాజమాన్యం పట్టించుకోలేదు.

రిస్క్ తీసుకున్నారు..ప్రాణాలు పోగొట్టుకున్నారు

ప్రకృతి రహస్యాలను అన్వేషించాలి..అంతరిక్షాన్ని ఆస్వాదించాలి..సముద్రగర్భాన్ని కళ్లారా వీక్షించాలి.. సాధారణం ఎవరూ అనుభూతి చెందని సాహస యాత్రలను చేయాలి.. ఇవే ఆలోచనలు ఆ ఐదుగురిని సముద్ర గర్భంలోకి వెళ్లేలా చేశాయి. వాస్తవానికి వాళ్లు వెళ్లింది సముద్రగర్భంలోకి కాదు.. చావు నోట్లోకి. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. టైటాన్‌లో ప్రయాణించిన ఆ ఐదుగురు వ్యక్తులు అల్లాటప్పా వాళ్లు కాదు.. వేల కోట్లు సంపాదించిన కుబేరులు.. డబ్బులు ఖర్చు పెట్టే స్థోమత ఉంది.. సముద్రగర్భంలోకి వెళ్లాలన్న జీల్ ఉంది. అందుకే రిస్క్ చేశారు. చావు అన్నది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. కానీ అరుదైన , ప్రమాదకరమైన యాత్ర చేసి ప్రాణాలు కోల్పోవడమే విషాదం.