Artificial intelligence: ఏఐ సాఫ్ట్‌వేర్‌తో తండ్రి కావొచ్చు..! కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది..!!
పురుషుల సంతాన లేమికి చక్కటి పరిష్కారాన్ని చూపించే ఒక ఏఐ సాఫ్ట్ వేర్ రెడీ అయింది. ‘స్పెర్మ్ సెర్చ్’ అని పేరు పెట్టిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న బయో మెడికల్ ఇంజినీర్ స్టీవెన్ వసిలెస్క్యూ తన టీమ్‌తో కలిసి అభివృద్ధి చేశారు.
Artificial intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ.. శాస్త్ర, సాంకేతిక విప్లవాన్ని క్రియేట్ చేయడంతో ఆగకుండా మానవాళికి సంబంధించిన ఇంకెన్నో సమస్యలకు పరిష్కారాలను చూపించబోతోంది. చివరకు సంతానలేమి సమస్యకు కూడా!! ఔను.. పురుషుల సంతాన లేమికి చక్కటి పరిష్కారాన్ని చూపించే ఒక ఏఐ సాఫ్ట్ వేర్ రెడీ అయింది. ‘స్పెర్మ్ సెర్చ్’ అని పేరు పెట్టిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న బయో మెడికల్ ఇంజినీర్ స్టీవెన్ వసిలెస్క్యూ తన టీమ్‌తో కలిసి అభివృద్ధి చేశారు.
పురుషుల నుంచి సేకరించిన వీర్యం శాంపిల్‌లోని ఆరోగ్యకరమైన, యాక్టివ్‌గా ఉన్న శుక్రకణాలను వైద్యులు మైక్రోస్కోప్ ద్వారా గుర్తించడానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది. వీర్యానికి సంబంధించిన ఒక శాంపిల్‌లో 10కి మించి శుక్ర కణాలు ఉండవు. అందులోనే రక్తం, ఇతర కణజాలాలు కూడా ఉంటాయి. ఆ శాంపిల్ నుంచి ఆరోగ్యంగా ఉన్న శుక్రకణాన్ని గుర్తించడం అంటే గడ్డివాములో సూది కోసం వెతకడం లాంటిదే. ఈక్రమంలో పొరపాటు జరిగే ముప్పు కూడా ఉంటుంది. వైద్య నిపుణుల కన్నా 1000 రేట్ల వేగంతో.. ఆరోగ్యకరమైన శుక్రకణాన్ని గుర్తించే కెపాసిటీ ‘స్పెర్మ్ సెర్చ్’ సాఫ్ట్‌వేర్ సొంతం.
ఏఐ ఎలా గుర్తిస్తుంది..?
ఈ సాఫ్ట్ వేర్ ద్వారా వీర్యం శాంపిల్‌లోని ఆరోగ్యకరమైన శుక్రకణాన్ని ఎలా గుర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. తొలుత ఆ శాంపిల్ ఫొటోలను ‘స్పెర్మ్ సెర్చ్’ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ వెంటనే కొన్ని సెకన్ల వ్యవధిలో ఆరోగ్యకరమైన శుక్రకణాలను సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. వేలాది మంది వీర్యకణాల శాంపిళ్ల ఫొటోల ఆధారంగా.. వాటిలోని శుక్రకణాలను గుర్తించడంలో ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌కు సైంటిస్టుల టీమ్ ఎన్నో నెలల పాటు నిరంతర ట్రైనింగ్ ఇచ్చింది. అందుకే ‘స్పెర్మ్ సెర్చ్’ సాఫ్ట్‌వేర్ ఇంత స్పీడ్‌గా శుక్రకణాలను గుర్తించగలుగుతోంది. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఫ్యూచర్‌లో ఎంబ్రయాలజిస్టులు సహాయక పరికరంగా వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. స్పెర్మ్ సెర్చ్ సాఫ్ట్‌వేర్ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని చెప్పారు. దీన్ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి రెండు నుంచి ఐదేళ్ల సమయం పట్టొచ్చని తెలిపారు.
శుక్రకణాల గుర్తింపులో వైద్యులు ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటే.. చివరి ప్రయత్నంగా స్పెర్మ్ సెర్చ్ సాఫ్ట్‌వేర్ వాడొచ్చని పేర్కొన్నారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా పురుషులలో వీర్యకణాల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయిందని రిపోర్టులు చెప్తున్నాయి. సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. కాలుష్యం, ధూమపానం, ఒత్తిడి వంటి కారణాలతో పురుషులలో సంతానోత్పత్తి తగ్గిపోయింది. ప్రపంచంలోని పురుషులలో కనీసం 7 శాతం మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా. “ఏఐ ప్రయాణం ఇంకా పూర్తిగా మొదలుకాలేదు. ఇంకా చాలా చేయాల్సి ఉంది. తక్కువ మందితో ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఏం చేసినా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ వాస్తవంలోకి వస్తే అసలు సవాళ్లు తెలుస్తాయి” అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.