Baba Saheb: తెలంగాణ తల్లి ఒడిలో తలమానికంగా నిలిచిన అంబేద్కర్..!

అంటరాని తనం, అస్పృశ్యత, కుల నిర్మూల, సమాన హక్కులు, స్వేచ్ఛ, మహిళా స్వాతంత్యం అనే బీజాక్షరాలను తన మస్తిష్కంలో అను నిత్యం జపిస్తూ.. సమాజ శ్రేయస్సుకు పరితపించిన దూర దృష్టి గల మేధావి. అలాగే తన కోసం కాకుండా అందరి కోసం అట్టడుగు వర్గాల్లో చైతన్యం నింపాలనే సత్ సంకల్పంతో అద్భుతమైన రాజ్యంగాన్ని రచించిన గ్రంధకర్త, న్యాయవాది, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, నవ జీవన సృష్టి ప్రదాత డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2023 | 06:00 AMLast Updated on: Apr 14, 2023 | 6:00 AM

Baba Saheb Ambedkar Jayanthi

పార్లమెంటుకు ప్రతిరూపం..
ఈ 125 అడుగుల కాంస్య విగ్రహం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ట్యంక్ బండ్ బుద్ద విగ్రహానికి కూత వేడు దూరంలో నిర్మించారు. ఇందులో మూడు ప్రదానమైన ప్రత్యేకతలు ప్రతిబింబించేలా ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. అందులో మొదటిది ఈయన భారత రాజ్యాంగ నిర్మాత కనుక.. అందుకు ప్రతిరూపంగా చేతిలో భారత రాజ్యాంగ మహా గ్రంధాన్ని పట్టుకునేలా రూపాన్ని తీసుకువచ్చారు. అలాగే ఆయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఎలాగైతే పార్లమెంట్ భవనంలో అడుగు పెట్టారో అదే ఆహార్యం ఉట్టి పడేలా శిల్పాని నిర్మించారు. పార్లమెంట్ భవనం చట్టాలకు ప్రతిరూపం కనుక క్రింది భాగంలో పార్లమెంట్ భవన నిర్మాణాన్ని అనుభూతి చెందేలా స్థంభాలను నెలకొల్పారు. ఇలా ఈ మూడింటి కలయికతో సౌందర్యభరితమైన మహాసుందర ప్రాంగణాన్ని తయారు చేశారు. పార్లమెంట్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది కొన్ని వందల స్థంబాలతో కూడిని అతి విశాలభవనం. అలాంటి అందమైన భవనాకృతి రావాలంటే ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి ఉపయోగించిన ముడిపదార్థాలనే వాడాలి. అందుకే రాజస్థాన్లోని ధోల్ పూర్ రెడ్ స్టోన్, ధోల్ పూర్ బీచ్ స్టోన్ లను ఉపయోగించారు.

ప్రాణం పోసిన పద్మభూషణుడు..
ఇక అంబేద్కర్ విగ్రహ విషయానికొస్తే 300 టన్నులకు పైగా స్టైన్ లెస్ స్టీల్ ఖనిజాన్ని ఉపయోగించి సమతా సందేశాత్మక ఆదర్శమూర్తిని తయారుచేశారు. అలాగే 100 టన్నులకు పైగా బ్రాస్ లోహాన్ని వినియోగించారు. అంతేకాకుండా భూకంపాలకు తట్టుకునే విధంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భవన నిర్మాణం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే రాం సుతార్ అనే విగ్రహశిల్పి అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేశారు. ఈయన పద్మభూషణ్ గ్రహీత. అర్కెటెక్ విషయానికొస్తే కేపీసీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ అనే ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో ఈ గొప్ప కట్టడాన్ని నిర్మించారు. ఇదంతా బయట నుంచి కనిపించే భౌతిక నిర్మాణముకు సంబంధించిన వివరాలు.

స్పూర్తి – మార్పు లక్ష్యంగా..
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే అంబేద్కర్ జీవిత చరిత్రలోని విశేషాలను తెలుపుతూ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. రాజ్యాంగ ప్రదాత ఆలోచనలకు తగ్గట్టుగా మ్యూజియంను నెలకొల్పారు. అంతేకాకుండా ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, సమాజ శ్రేయస్సుకు పరితపించి అడుగులు వేసే మార్గంలో వచ్చిన ఆటుపోట్లను తెలిపే వీడియోను ప్రసారం చేస్తారు. దీనికోసం అందమైన డిజిటల్ థియేటర్ కూడా నిర్మించారు. అందులో చూపించే దృశ్యాల ద్వారా ప్రతి ఒక్కరిలో స్పూర్తి యుతమైన మార్పు రావాలనే లక్ష్యంతో ఈ చారిత్రాత్మక కట్టడానికి పూనుకున్నారు.

ఏడాదిన్నర కాలం.. ఖర్చు రూ. 150 కోట్లు..
ఈ విగ్రహానికి సంబంధించి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందం చైనా.. హాంకాంగ్ వంటి గొప్పగొప్ప దేశాలకు వెళ్లి అక్కడి విగ్రహాలను.. వాటి నిర్మాణ తీరును.. నాణ్యతను పరిశీలించారు. వీరందరూ సరికారని నిర్ణయించుకొని మన దేశంలోనే రాం సుతార్ అనే కళాకారుడిని సంప్రదించారు. ఆయన సంవత్సర క్రితం నుంచే ఢిల్లీలో రూపాన్ని వివిధ భాగాలుగా తయారు చేస్తూ వచ్చారు. అలా తయారైన శరీర భాగాలను విడివిడిగా ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ లో హైదరాబాద్ కు తరలించారు. అలా భాగ్యనగరానికి చేరుకున్న విడిభాగాలను అతికించడానికి ఆరు నెలల కాలం పట్టింది. ఇంతటి శిలా రూపాన్ని జాతికి అంకితం చేసేందుకు చాలా మంది కార్మికులు అహోరాత్రులు నిర్విరామంగా విశేషమైన కృషి చేశారు. ఈ ప్రతిపాదన సంకల్పించినప్పుడు దీనికి కేటాయించిన బడ్జెట్ రూ. 147 కోట్లు కాగా అదనంగా ఇంకో 10 కోట్లు ఎక్కువ అయ్యి ఉండవచ్చు. మొత్తం మీద 150 నుంచి 170 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా భాగ్యనగరంలో ఒకప్పుడు చార్మినార్, హూస్సేన్ సాగర్ అని ఎలా చెబుతారో మరి కొన్ని రోజుల్లో అంబేద్కర్ స్మృతి వనం అని కూడా చెప్పుకుంటారు అనడలో ఎలాంటి సందేహం లేదు.

 

T.V.SRIKAR