Bihar Caste Survey: బిహార్‌లో పూర్తైన కుల గణన.. ఎవరి శాతం ఎంతంటే..?
ఈ డేటా ప్రకారం రాష్ట్ర జనాభాలో 63శాతం మంది ఓబీసీలు, ఈబీసీలు ఉన్నట్లు తేలింది. జనాభాలో ఈబీసీ వాటా 36శాతంకాగా, ఓబీసీల వాటా 27.13శాతంగా ఉంది. అంటే అత్యధిక జనాభా ఓబీసీలు, ఈబీసీలదే. అలాగే 19.7శాతం మంది ఎస్సీలు 1.7శాతం మంది ఎస్టీలు ఉన్నారు.
Bihar Caste Survey: బిహార్ ప్రభుత్వం కుల గణన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన డేటాను నితీశ్ కుమార్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం రాష్ట్ర జనాభాలో 63శాతం మంది ఓబీసీలు, ఈబీసీలు ఉన్నట్లు తేలింది. జనాభాలో ఈబీసీ వాటా 36శాతంకాగా, ఓబీసీల వాటా 27.13శాతంగా ఉంది. అంటే అత్యధిక జనాభా ఓబీసీలు, ఈబీసీలదే. అలాగే 19.7శాతం మంది ఎస్సీలు 1.7శాతం మంది ఎస్టీలు ఉన్నారు. బిహార్ మొత్తం జనాభా సుమారు 13.07 కోట్లు. బిహార్ జనాభాలో యాదవులు అత్యధిక శాతం ఉన్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 14.27శాతంగా ఉంది. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా ఈ సామాజికవర్గానికి చెందిన వాళ్లే.
కుల గణన డేటా విడుదల సందర్భంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన సమాచారం వెలువడ్డ తర్వాత ఏం చేయాలి..? సామాజిక మార్పుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అనే అంశాలపై తమ ప్రభుత్వంలోని 9 పార్టీలతో చర్చలు జరుపుతామన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కుల గణన డేటా విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో కుల గణన చేయాలని పార్టీలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఇప్పటికే దేశంలో జనాభా గణన పూర్తవ్వాలి. కోవిడ్ వల్ల ఇది ఆలస్యమైంది. అయితే, ఈసారి జన గణనతోపాటు, కుల గణన కూడా చేయాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. దీనికి కేంద్రం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. జనాభా గణనకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. తాము చెపట్టే కుల గణనలో ఎస్సీ, ఎస్టీలను మాత్రమే లెక్కిస్తామని కేంద్రం చెప్పింది. అందుకే మోదీ ప్రభుత్వం కుల గణన చేసినా.. చేయకపోయినా.. తమ ప్రభుత్వం మాత్రం కుల గణన చేసి తీరుతుందని బిహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు.
ఈ కుల గణన ఆధారంగా బలహీన వర్గాలను ప్రగతివైపు నడిపించవచ్చని నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన ప్రకటించినట్లుగానే.. ఈ గణన పూర్తి చేసి, డేటా కూడా విడుదల చేశారు. అంతేకాదు.. అన్ని రాష్ట్రాలు కుల గణన చేపట్టాలని పిలుపునిచ్చారు. బిహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన గత ఆగష్టులో ముగిసింది. దాదాపు 2.64లక్షల మంది సిబ్బంది.. ఇంటింటికీ వెళ్లి కుల గణనను నిర్వహించారు. విద్య, ఉద్యోగం, మారిటల్ స్టేటస్, భూమి ఉందా? లేదా? ఆస్థులు, కులం వంటి వివరాలను సేకరించారు. అయితే కులాల ఆధారంగా జనాభాను లెక్కించడంపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దీన్ని కొందరు సమర్ధిస్తుంటే.. ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బిహార్‌లో ఓబీసీల జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ రిజర్వేషన్లలో వారి కోటా పెంచాలని డిమాండ్‌లు పెరుగుతున్నాయి. తాజాగా వారి వాటా ఎక్కువగా ఉన్నట్లు తేలిన నేపథ్యంలో ఈ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓబీసీ కోటా 27శాతంగా ఉంది. దీన్ని జనాభాకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.