Bird Flu: మనుషులకూ బర్డ్‌ఫ్లూ ముప్పు.. ఐరాస హెచ్చరిక

బర్డ్ ఫ్లూను ఏవియన్ ఫ్లూఅని కూడా అంటారు. ఇది పక్షులకు మాత్రమే సోకుతుంది. గతంలో అనేకసార్లు పక్షులకు సోకింది. ముఖ్యంగా కోళ్లకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2023 | 10:53 AMLast Updated on: Jul 16, 2023 | 10:53 AM

Bird Flu Might Infect Humans Soon More Easily Un Agencies Warns

Bird Flu: కోళ్లతోపాటు పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దీంతో మానవజాతికి మరో వైరస్ ముప్పు పొంచి ఉందా అని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఇది కోళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. పైగా ఇది అంటువ్యాధి. ఈ వ్యాధి విజృంభించకుండా కోళ్ల ఫాం దగ్గరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఈ వ్యాధి మరిన్ని కోళ్లకు, వాటి ద్వారా మనుషులు కూడా సోకే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ విభాగం తాజా సూచనలు చేసింది.
బర్డ్ ఫ్లూను ఏవియన్ ఫ్లూఅని కూడా అంటారు. ఇది పక్షులకు మాత్రమే సోకుతుంది. గతంలో అనేకసార్లు పక్షులకు సోకింది. ముఖ్యంగా కోళ్లకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఈ సమయంలో కోళ్లను లక్షల సంఖ్యలో చంపేస్తుంటారు. బర్డ్ ఫ్లూ సోకిన లేదా సోకే అవకాశం ఉన్న వాటిని చంపేస్తుంటారు. వాటిని భూమిలో పాతేస్తారు. దీనివల్ల మానవజాతికి పెద్దగా ముప్పు ఉండేది కాదు. దీంతో మనుషులు దీని విషయంలో ఆందోళన చెందలేదు. కానీ, ఇప్పుడు బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సులభంగా సోకే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2022 లెక్కల ప్రకారం ఐదు ఖండాల్లోని 67 దేశాలలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. 131 మిలియన్లకు పైగా దేశీయ ఫౌల్ట్రీలకు బర్డ్ ఫ్లూ దెబ్బ తగిలింది. ఈ ఏడాది ప్రారంభంలో 14 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రధానంగా ఉత్తర అమెరికా ఇది వ్యాప్తి చెందుతూనే ఉంది.
ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. కోళ్లు మాత్రమే కాకుండా.. అడవి పక్షులకు కూడా సోకుతుంది. లక్షలాది పక్షులు బర్డ్ ఫ్లూ వల్ల మరణిస్తుంటాయి. ప్రతి ఏడాది సహజంగానే ఈ వ్యాధి సోకుతుంది. కానీ, ఈసారి భయంకరమైన పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. అంతేకాదు.. పెరుగుతున్న కేసుల వల్ల మానవులకు కూడా బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే తగిన జాగ్రత్త లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతంలో లేదా చనిపోయిన కోళ్ల ఫౌల్ట్రీ ఫాం లేదా కలుషితమైన పరిసరాలకు దగ్గరగా ఉండే మనుషులకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది.
బర్డ్ ఫ్లూ అంటే..?
ఇది పక్షులకు సోకే అంటువ్యాధి. కొన్నిసార్లు మనుషులకు కూడా సోకుతుంది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం.. బర్డ్ ఫ్లూకు సంబంధించి నాలుగు వేరియంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అవి హెచ్5ఎన్1, హెచ్7ఎన్9, హెచ్5ఎన్6, హెచ్5ఎన్8. కోళ్లు, లేదా పక్షులకు వ్యాధి సోకుతుంది. వ్యాధి ప్రభావానికి గురైన పక్షుల్ని ముట్టుకుంటే మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. అయితే, ఈ మాంసాన్ని ఉడికించి లేదా కాల్చి తినడం వల్ల వ్యాధి సోకదు. వైరస్ మరణిస్తుంది కాబట్టి ఆ అవకాశం లేదు. ఉడికించిన గుడ్లు తిన్నా వ్యాధి సోకదు. పచ్చి మాంసం, పచ్చి గుడ్లు తాకడం ప్రమాదకరం. ఈ వ్యాధి సోకితే ఊపిరి ఆడకపోవడం,అతిసారం, విపరీతమైన జ్వరం, కండరాల్లో నొప్పి, ఛాతీ నొప్పి, తలనొప్పి, దగ్గు,కడుపు నొప్పి, ముక్కు, చిగుళ్ళలో రక్తస్రావం, కండ్ల కలక వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలా చేయండి
బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో మనుషులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నీళ్లు, సబ్బుతో చేతులని శుభ్రం చేసుకోవాలి. తినడానికి ముందు మాంసం బాగా ఉడికించాలి. ఫౌల్ట్రీకి దూరంగా ఉండాలి. పక్షుల్ని కూడా దూరంగానే ఉంచాలి.