Ambedkar Statue: ఆకాశం తాకేలా అంబేద్కర్ విగ్రహం.. ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

125 అడుగుల ఎత్తుతో, హుసేన్ సాగర్ తీరాన, నూతన సచివాలయం సమీపంలో.. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహం రాష్ట్రానికి తలమానికంగా నిలవనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 04:06 PMLast Updated on: Apr 13, 2023 | 4:06 PM

Br Ambedkars 125 Feet Statue To Be Unveiled In Hyderabad

Ambedkar Statue: హైదరాబాద్ సిగలో మరో ఆణిముత్యం చేరబోతుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకానుంది. ఏప్రిల్ 14, శుక్రవారం, అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 125 అడుగుల ఎత్తుతో, హుసేన్ సాగర్ తీరాన, నూతన సచివాలయం సమీపంలో.. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహం రాష్ట్రానికి తలమానికంగా నిలవనుంది. పర్యాటకంగా ప్రత్యేక ఆకర్షణగా మిగులుతుంది. అంబేద్కర్ స్ఫూర్తిని చాటిచెప్పేందుకు దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివి.
125వ జయంతి సందర్భంగా
ఏప్రిల్ 14, 2016న అంబేద్కర్ 125వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా 125 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడాదిలోపే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ లెక్కన 2017లో విగ్రహం ప్రారంభం కావాలి. కానీ, అనేక కారణాల వల్ల విగ్రహ ఏర్పాటుకు ఏడేళ్లు పట్టింది. విగ్రహ ఏర్పాటు కోసం హుసేన్ సాగర్ తీరంలో, ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.80 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ సంక్షేమ శాఖ తరఫున నిధులు కేటాయించింది ప్రభుత్వం. విగ్రహ ఏర్పాటు కోసం రూ.146.50 కోట్ల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. విగ్రహ నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖ తీసుకుంది.

విగ్రహం విశేషాలు
♦ దేశంలోనే అత్యంత పెద్ద అంబేద్కర్ విగ్రహమిది. ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు.
♦ విగ్రహం బరువు 465 టన్నులు. ఇందులో 96 టన్నుల ఇత్తడి కూడా ఉంది.
♦ విగ్రహం కింద పార్లమెంట్ ఆకారంలో పీఠం ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు.
♦ ఈ పీఠం లోపల 27,556 అడుగుల స్థలం ఉంది. ఈ స్థలంలో లైబ్రరీ, మ్యూజియం, ధ్యాన మందిరం వంటివి ఉన్నాయి.
♦ ఇక్కడ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఫొటోలు, పుస్తకాలు, అంబేద్కర్ రచించిన పుస్తకాలు కూడా ఉంటాయి. మరో మూడు నెలల్లో వీటి ఏర్పాట్లు పూర్తవుతాయి.
♦ రెండు ఎకరాల స్థలంలో పీఠం, విగ్రహం ఏర్పాటు చేశారు. తుపానులు, వరదలు వంటివి తట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
♦ విగ్రహం, పీఠం బయట ఉన్న స్మృతివనంలో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, వాటర్ ఫౌంటేన్, శాండ్ స్టోన్, ప్లాంటేషన్ వంటివి ఉన్నాయి.
♦ ఇక్కడ పార్కింగ్‌కు కూడా అవకాశం ఉంటుంది. దాదాపు 450 కార్ల వరకు పార్కింగ్ చేయొచ్చు.
♦ విగ్రహాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులు సేద తీరేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.

Ambedkar Statue

విగ్రహం తయారైందిలా
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 2016, ఏప్రిల్ 14న శంకుస్థాపన జరిగింది. డిజైన్ అసోసియేట్స్, నోయిడా సంస్థ కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. తెలంగాణ మంత్రుల బృందం చైనాలో పర్యటించి, విగ్రహ తయారీ విధానాన్ని పరిశీలించింది. 2021 జనవరి 23న ఈ ప్రాజెక్టు కోసం టెక్నికల్ అనుమతి లభించింది. అదే ఏడు జూన్ 3న కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థతో విగ్రహ నిర్మాణం కోసం ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈయన తీర్చిదిద్దిన విగ్రహ నమూనాను ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత ఢిల్లీలో విగ్రహ నిర్మాణం ప్రారంభమైంది. అక్కడ తయారైన విగ్రహాన్ని విడిభాగాలుగా మార్చి, హైదరాబాద్ తీసుకొచ్చి అమర్చారు. దాదాపు రెండేళ్లలోనే విగ్రహం ఏర్పాటు పూర్తైంది.
కనీవినీ ఎరుగని రీతిలో ఆవిష్కరణ
శుక్రవారం, ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. ముఖ్య అతిథులుగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరవుతారు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహానికి అలంకరించేందుకు ప్రత్యేక పూలమాలను సిద్ధం చేస్తున్నారు. క్రేన్ సాయంతో పూల మాలను అలంకరిస్తారు. హెలికాప్టర్ల ద్వారా అంబేద్కర్ విగ్రహంపై పూల వర్షం కురిపించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 300 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి సాధారణ ప్రజలతోపాటు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారు. మొత్తం 50 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.

Ambedkar Statue