Brazilian Teacher: క్లాస్ రూములో టీచర్ చేసిన పనికి నెటిజన్ల ఆగ్రహం.. ఊడిన ఉద్యోగం..!
ఇటీవలే అమెరికాలో కొందరు టీచర్లు విద్యార్థులతో అనైతిక సంబంధాల కారణంగా అరెస్టు కాగా.. బ్రెజిల్‌లో కూడా కొందరు టీచర్లు విద్యార్థులతో ఇలాగే తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బ్రెజిల్‌లో విద్యార్థులతో ఒక టీచర్ ప్రవర్తించిన తీరు విమర్శలపాలవుతోంది.
Brazilian Teacher: విద్యార్థికి, టీచర్‌కు మధ్య ఉండే సంబంధాన్ని అతి గొప్పగా చూసే సంస్కృతి మనది. ఏ దేశంలోనైనా టీచర్లు, స్టూడెంట్ల మధ్య బంధం అంతే పవిత్రంగా, గౌరవప్రదంగా ఉంటుంది. కానీ, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కొందరు టీచర్లు ప్రవర్తిస్తున్న తీరు ఈ వృత్తికే కళంకం తీసుకొస్తోంది. ఇటీవలే అమెరికాలో కొందరు టీచర్లు విద్యార్థులతో అనైతిక సంబంధాల కారణంగా అరెస్టు కాగా.. బ్రెజిల్‌లో కూడా కొందరు టీచర్లు విద్యార్థులతో ఇలాగే తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బ్రెజిల్‌లో విద్యార్థులతో ఒక టీచర్ ప్రవర్తించిన తీరు విమర్శలపాలవుతోంది. విద్యార్థులతో అసభ్యకరంగా డ్యాన్స్ చేయడమే కాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది ఆ టీచరమ్మ. దీంతో అందరూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్రెజిల్‌కు చెందిన సిబెల్లీ ఫెరీరా అనే మహిళ టీచర్‌గా పని చేస్తోంది. ఆమె కాలేజీ విద్యార్థులకు ఇంగ్లీష్ టీచర్‌గా పాఠాలు బోధిస్తుంది. ఒకవైపు టీచర్‌గా పని చేస్తూనే మరోవైపు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. టిక్‌టాక్‌లో ఆమెకు 9.8 మిలియన్ల ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇటీవల తను పాఠాలు చెప్పాల్సిన విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్‌లో డ్యాన్స్ చేసింది. అది కూడా కాస్త అభ్యంతరకరంగా అబ్బాయిలతో కలిసి డ్యాన్స్ చేసింది.
చాలా మంది విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేయడమే కాకుండా.. సిబెల్లీ ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఈ పని సరదాగానే చేసి ఉండొచ్చు. దీని వెనుక ఆమె ఉద్దేశం కూడా తప్పుగా ఉండకపోవచ్చు. కానీ, ఆమె ఇలా డ్యాన్స్ చేసిన తీరు మాత్రం సరైంది కాదంటున్నారు అక్కడి పేరెంట్స్, నెటిజన్స్. ఒక టీచర్ అయి ఉండి, విద్యార్థులతో అలా ఎలా డ్యాన్స్ చేస్తుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సిబెల్లీ వీడియో వైరల్ కావడంతో స్కూల్ యాజమాన్యం కూడా స్పందించింది. ఆమెను ఉద్యోగంలోంచి తొలగించినట్లు తెలుస్తోంది. కొందరు నెటిజన్లు ఈ విషయంలో ఆమెను విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తరగతి గదిలో ఇలా విద్యార్థులతో అసభ్యకర డ్యాన్స్ చేయడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు.
విద్యార్థులకు పాఠాలపై ఆసక్తి కలిగించేందుకే సిబెల్లీ అలా చేసిందని, అందుకు ఆమెను ఉద్యోగంలోంచి తొలగించడం సరికాదని ఇంకొందరు అంటున్నారు. కాగా, సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో వాటి మధ్య పాఠాలపై దృష్టి పెట్టడం కష్టమైన విషయమని, అందుకే విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకే ఈ పని చేశానని సిబెల్లీ చెప్పారు. ఏదేమైనా ఆమె తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.