Britain: జనానికి తిండి లేదు.. రాజుగారికి మాత్రం పట్టాభిషేకం.. రాజరికమా.. బానిసత్వమా?
మీకొక కథ చెబుతాం. ఆ కథలో ఓ పెద్ద రాజ్యం.. దానికి ఓ రాజు ఉన్నారు. ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసి శతాబ్దాల పాటు ఈ పెద్ద రాజ్యం సుభిక్షంగానే ఉంది. కాలంతో పాటు పరిస్థితులు మారిపోయాయి. పెద్ద రాజ్యానికి కూడా కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పుడు బాగా బతికిన ప్రజలు ఇప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక చాలా మంది దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ రాజు గారిలో మాత్రం చలనం లేదు. రాజుగా ప్రజల కష్టాలను తీర్చకపోగా ప్రజలు కట్టే పన్నులతో విలాసాల్లో మునిగితేలుతున్నారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంటే రాజు గారు మాత్రం తన పట్టాభిషేకం కోసం జనం సొమ్ముతో కులుకుతున్నారు.
ఇదంతా చందమామ కథ కాదు. వర్తమానమే. రవి అస్తమించని సామ్రాజ్యంగా చరిత్ర పదేపదే చెప్పుకున్న ది గ్రేట్ బ్రిటన్ గురించే. ప్రపంచ వ్యాప్తంగా రాజ్యాలు పోయాయి.. రాజులు కూడా పోయారు.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడుస్తున్న కాలంలో ఉన్నాం. కానీ బ్రిటన్‌లో మాత్రం పేరుకు ప్రజాస్వామ్య ప్రభుత్వమే అయినా.. అక్కడ ఉన్నది మాత్రం రాజ్యాంగబద్ధమైన రాజరికం. రాజుగారి సేవలో ఇప్పటికీ బ్రిటన్ తరిస్తూనే ఉంది. సరే ఏదో రాజరిక సంప్రదాయాలను కొనసాగిస్తున్నారులే అనుకుంటే సర్దుకుపోవచ్చు.. కానీ దేశంలో మెజార్టీ ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే.. అవేవి పట్టనట్టు బ్రిటన్ రాజ కుటుంబం ఆర్భాటాలకు పోతూ జనం సొమ్ముతో జల్సాలు చేస్తోంది.
జనం సొమ్ముతో పట్టాభిషేకమా ?
సుధీర్ఘ కాలం పాటు బ్రిటన్ సామ్రాజ్యాన్ని పాలించిన మహారాణి ఎలిజిబెత్ 2 మరణం తర్వాత ఆమె కుమారుడు చార్లస్ రాజుగా ప్రమోట్ అయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లోనే ఆయన రాజకిరీటం ధరించినా.. పట్టాభిషేక కార్యక్రమం మాత్రం ఈ నెల 6న అట్టహాసంగా జరగబోతోంది. భారత్ సహా ప్రపంచ దేశాల అతిథుల సమక్షంలో పట్టాభిషేక కార్యక్రమంలో రాజుగా చార్లెస్ 3, రాణిగా కమెల్లా ఆశీనులు కాబోతున్నారు. రాయల్ కుటుంబ మర్యాదలకు , సంప్రదాయాలకు ఏమాత్రం భంగం కలగకుండా పట్టాభిషేక కార్యక్రమాన్ని నభూతో న భవిష్యతి అన్న స్థాయిలో నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెజార్టీ ప్రపంచ దేశాలకు భిన్నంగా బ్రిటన్‌లో Constitutional monarchy అమలులో ఉండటం వల్ల రాజరిక సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే రాజు గారి పట్టాభిషేకం కోసం బ్రిటన్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న తీరును చూస్తే మాత్రం బ్రిటన్ ప్రజలు కూడా ముక్కుల వేలేసుకునే పరిస్థితి. పట్టాభిషేకం కోసం ఎంత ఖర్చు చేస్తుందన్నది బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా స్థానిక మీడియా అంచనాల ప్రకారం ఖర్చు 125 మిలియన్ డాలర్లకు మించే ఉంటుందట.
రాజు గారు తప్ప దేశం అస్తవ్యస్తం
కరోనా తర్వాత బ్రిటన్ కోలుకున్నట్టు కనిపించినా.. ప్రస్తుతం ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఓ వైపు ద్రవ్యోల్బణం పెరగడం.. మరోవైపు ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో బ్రిటన్ ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహలతో జీవిస్తున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో కొన్ని నెలలుగా అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఉద్యమాలు చేస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, హెల్త్‌కేర్ వర్కర్లు, యూనివర్శిటీ సిబ్బంది, ట్రైన్ డ్రైవర్లు, సివిల్ సర్వెంట్లు ఒక్కరేంటి దాదాపు అన్ని విభాగాల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీతాలకు ద్రవ్యోల్బణానికి మధ్య పొంతన లేకపోవడంతో బ్రిటన్‌లో లక్షలాది మంది నిరుపేదలు కనీసం బ్రెడ్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
రాజు గారి కడుపు నిండితే చాలా ?
తినడానికి తిండిలేని, ఉండటానికి ఇల్లు లేని నిరుపేదల పొట్ట నింపేందుకు చర్చి ఆధ్వర్యంలో నడిచే షెల్టర్స్ ముందు దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా క్యూ కట్టే పరిస్థితి ప్రస్తుతం బ్రిటన్‌లో నెలకొంది. ఒకప్పుడు లగ్జరీగా బతికిన బ్రిటన్ ప్రజలు కూడా ఇప్పుడు రోజులు గడవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆదేశ ఆర్థిక సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గానీ, రాజు గానీ ఏం చేయాలి ? ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పించాలి. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాచరిక వైభవాన్ని అనుభవిస్తున్న రాజు గారు తన ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటో.. ప్రధానమంత్రిని పిలిచి మాట్లాడాలి. పరిస్థితులు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్రభుత్వ విధానాల్లో నేరుగా జోక్యం చేసుకోకపోయినా రాజంటే దేవుడి ప్రతిరూపంగా చూసే దేశ ప్రజలకు నేనున్నా అన్న భరోసా ఇవ్వాలి. కానీ బ్రిటన్ రాజు ఛార్లెస్ మాత్రం ఆ పని చేయడం లేదు. ఎందుకంటే ఆయన బంగారు రథంలో ఎక్కి పట్టాభిషేకానికి వెళ్లే పనిలో బిజీగా ఉన్నారు.
వజ్రవైఢూర్యాలు.. మణిమాణిక్యాలు
రాయల్ ఫ్యామిలీ అంటేనే లైఫ్ స్టైల్ లగ్జరీగా ఉంటుంది. ఇక పట్టాభిషేకం వేళ రాజకుటుంబం ప్రదర్శించే దర్పం అంతా ఇంతా కాదు. పూర్తిగా బంగారుమయమైన గుర్రపు బగ్గీలో చార్లెస్ పట్టాభిషేకం జరిగే వెస్ట్ మినిస్టర్ అబేకు చేరుకుంటారు. దీన్ని డైమండ్ జూబ్లీ స్టేట్ కోచ్‌గా పిలుస్తారు. కింగ్ చార్లెస్‌ను మెప్పించేందుకు బ్రిటన్ ప్రభుత్వం.. రాజ కుటుంబం ఆదేశాలతో వజ్ర వైఢూర్యాలను…మణిమాణిక్యాలను కూడా సిద్ధం చేసింది. 1661లో అప్పటి రాజు సెయింట్ అడ్వర్డ్ ఉపయోగించిన కిరీటానికి మెరుగులు దిద్ది… చార్లెస్ 3ని పట్టాభిషిక్తుడిని చేస్తారు. ఇక బంగారం, వజ్రాలతో రూపొందించిన ఆభరణాలకు కొదవేలేదు. కేవలం రాజు గారి ఆభరణాల కోసమే బ్రిటన్ ప్రభుత్వం 3.5 బిలియన్ పౌండ్లను ఖర్చు చేశారంటే రాజుగారి పట్టాభిషేకం ఎంత ఆర్భాటంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలు నేలమీద..రాజు ఆకాశంలో..
బ్రిటన్‌లో సాధారణ ప్రజల జీవితాలు రోజురోజుకు దుర్భరంగా మారుతుంటే.. రాయల్ ఫ్యామిలీ ప్రైవేటు ఆస్తులు మాత్రం ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రిక అంచనా ప్రకారం రాజకుటుంబం ప్రైవేటు ఆస్తి 1.8 బిలియన్ పౌండ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. బ్రిటన్‌ను సుధీర్ఘకాలం పాటు ఏలిన క్వీన్ ఎలిజిబెత్ 2 ఆస్తుల విలువ 500 మిలియన్ డాలర్ల పైనే అని ఫోర్బ్స్ పత్రిక లెక్కకట్టింది.
పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చి మరీ
బ్రిటన్ ప్రజలంతా పన్నులు కడతారు. కానీ రాజకుటుంబం మాత్రం కట్టదు. అందుకంటే అక్కడి రాజ్యాంగం రాయల్ ఫ్యామిలీ పన్నులు కట్టకుండా మినహాయింపు ఇచ్చింది. వారసత్వంగా వచ్చే ఆస్తుల మీద కూడా పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. క్వీన్ ఎలిజిబెత్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో ఒక్క పౌండ్ కూడా బ్రిటన్ ట్రెజరీకి జమ చేయాల్సిన అవసరం రాజు గారికి లేదు. అందుకే రాజకుటుంబం ఆస్తులు ఏటికేడు పెరుగుతూ ఉంటాయి.
పట్టాభిషేకంపై ప్రజల మాటేంటి ?
వాస్తవానికి బ్రిటన్ ప్రజలు రాజకుటుంబాన్ని చాలా గౌరవంగా చూస్తారు. రాణి లేదా రాజు దర్శనం కోసం బకింగ్ హామ్ ప్యాలెస్ ముందు క్యూ కడతారు. ఒక్కసారి వాళ్లు కనిపిస్తే చాలు ఆప్యాయంగా పలకరించేందుకు ఇష్టపడతారు. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా బ్రిటన్ ప్రజల ఆలోచనా ధోరణి కూడా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా రాజు లేదా రాణి పాలనను గతంలో ఆమోదించిన మెజార్టీ ప్రజలు ఇటీవల కాలంలో అసలు రాజరిక వ్యవస్థ అవసరమా అన్న స్థాయికి వచ్చారు. దీనికి బ్రిటన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే కారణం. ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో చిక్కుకోవడం, వరుసగా ప్రధానమంత్రులు మారడం, యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడం ఇలా అనేక సమస్యల మధ్య చిక్కుకున్న ప్రజలకు ఇటీవల ఆర్థిక సంక్షోభం కూడా రాచరిక పాలనపై విరక్తి కలిగేలా చేసింది. రాజకుటుంబానికి పాలనతో నేరుగా సంబంధం లేకపోయినా… ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాయల్ ఫ్యామిలీ కోసం కేటాయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మా పన్నులతో మీరు సుఖపడతారా అన్న భావన ప్రజల్లో పెరిగిపోయింది.
నాట్ మైకింగ్
బ్రిటన్ రాచరికంపై ఆ దేశ ప్రజలు ఎంతగా విసిరి పోయారంటే ఆ వ్యవస్థను రద్దు చేయాలంటూ ఉద్యమాలు మొదలయ్యాయి. రిపబ్లిక్ అనే సంస్థ యూకే వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్నే చేపట్టింది. నాట్ మై కింగ్ పేరుతో ప్రజల్లోకి వెళ్తుంది. రాచరికాన్ని రద్దు చేసి పూర్తి స్థాయిలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఎంతైనా రాజు రాజే
ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా బ్రిటన్ ప్రభుత్వం మాత్రం రాజు గారి ముందు తలవంచుతూనే ఉంది. రాచరికమన్నది రాజ్యాంగంలో భాగం కావడంతో ప్రజా ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. రాయల్ ఫ్యామిలీ వల్ల బ్రిటన్‌కు గానీ ఆ దేశ ప్రజలకు గానీ నయాపైసా ఉపయోగం లేకపోగా ఆర్థికంగా గుదిబండగా మారిపోయింది.