Americans: తెల్లతోలు దురహంకారం.. నరనరాల్లో జాతివివక్షత.. ప్రాణాలు తోడేస్తున్నారు కదరా..!
ఎందుకురా మీకంత కడుపుమంట.. ఎందుకురా ఇతరులంటే మీకంత ద్వేషం.. ఏముందిరా మీ తెల్లతోలులో.. ప్రపంచంలో మేమే తోపులం అని చెప్పుకుంటూ మధ్యయుగం నాటి మనస్థత్వంతో మేమే గొప్ప అంటూ బతుకుతారెందుకురా.. సరే మీరే గొప్ప అనుకుందాం..అంతమాత్రానికి ఇతరుల ప్రాణాలు తీసేస్తారా ? మీ దేశ రాజ్యాంగం ఇతర జాతులకు కల్పించిన బతికే హక్కును కూడా కాలరాస్తావా.? నీ దగ్గర తుపాకీ ఉంది కదా అన్న బలుపుతో శ్వేతజాతి దురహంకారాన్ని ఇంకెంత కాలం ప్రదర్శిస్తావురా ? ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చిన వారిని బానిసలుగా మార్చుకుని వారి చెమట నెత్తురుతో ఆకాశహార్మ్యాలు నిర్మించిన చరిత్ర కదరా మీది. ఏం..మీ దేశంలో ఇతర జాతులకు బతికే హక్కులేదా ? శ్వేతజాతీయుడు కాకపోతే.. తెల్లతోలు లేకపోతే.. వెంటాడి వేటాడి చంపేస్తావా ? అసలు మీదొక జాతే కాదన్న విషయం నీకు తెలుసా ? అమెరికా అంటేనే జాతుల సమూహం అని నీకు ఎవరూ చెప్పలేదా ?
కలల సౌధంలో రక్తపు మరకలు
అమెరికా అంటే ఓ కలల సౌధం.. అమెరికా అంటే స్వేచ్ఛా ప్రపంచం.. అమెరికా అంటే అనేక జాతుల సమూహం.. ఇలా అమెరికా గురించి ఎన్నో విశేషణాలు జోడించి మాట్లాడుకోవచ్చు.. బ్రహ్మ మానస గీతం..మనిషి గీసిన చిత్రం..చేతనాత్మక శిల్పం అంటూ అమెరికాను భావోద్వేగంగా మన వేటూరి మాటలతో వర్ణిస్తే.. తరాలు మారినా.. బానిసత్వ బతుకులు మారినా.. ఇంకా ఎక్కడో అమెరికా ప్రజల్లో జాత్యహంకార మనస్థత్వం మాత్రం అలాగే ఉందనిపిస్తుంది. విద్యా ఉపాధి అవకాశాల కోసం అమెరికాకు వలస వెళ్లిన ఇతర దేశాల ప్రజలను అమెరికా అక్కున చేర్చుకున్నట్టు కనిపిస్తున్నా.. జాత్యంహకారాన్ని ప్రదర్శిస్తున్న ఘటనలు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటన వెనుక తెల్లజాతి దురహంకారం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు వారి గుండెలపై తుపాకీ గుళ్లు
అమెరికాలో కాల్పులు అనగానే తెలుగువాళ్ల గుండెల్లో అలజడి మొదలవుతుంది. అమెరికా నుంచి ఎప్పుడు ఎలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందేమోనన్న భయం.. డాలర్ డ్రీమ్స్‌తో అమెరికాలో అడుగుపెట్టిన లక్షలాది మంది తెలుగు ప్రజల్లోనూ ఒకటే ఆందోళన. ఎప్పుడు ఏ దుండగుడు కాల్పులతో తెగబడతాడో తెలియని పరిస్థితి. తాజాగా టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోతే వారిలో తెలుగు యువతి ఐశ్వర్య కూడా ఉండటం విషాదాన్ని నింపింది.
అమెరికా కేరాఫ్ మాస్ షూటింగ్స్
అమెరికన్లు పక్కలే భార్య లేకపోయినా నిద్రపోతారట.. కానీ పక్కనే గన్‌లేకపోతే వాళ్లకు నిద్రపట్టదట. అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఇలాంటి ఉదాహరణలు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇదేదో మాట వరుసకు చెప్పుకున్నది కాదు. తుపాకులను కలిగి ఉండటాన్ని అమెరికన్లు జన్మహక్కుగా భావిస్తారు. ఆ దేశ సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది. అమెరికా జనాభా దాదాపు 33 కోట్లు ఉంటే.. ప్రజల వద్ద ఉన్న తుపాకుల సంఖ్య మాత్రం 36 కోట్లకు పైనే.. అమెరికాలో ప్రతి 100 మంది దగ్గర 120 తుపాకులు ఉంటాయట. అంటే కొంతమంది దగ్గర ఒకటికి మించి గన్స్ ఉన్నాయి. ఈ స్థాయిలో గన్స్ అమెరికాను ఏలబట్టే.. నిత్యం అమెరికాలో ఏదో మూలన తుపాకులు పేలుతూనే ఉంటాయి.. ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు.
కాల్పులు జరగని రోజంటూ ఉందా ?
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇలాంటి రోజు ఒకటి కచ్చితంగా ఉండదు. ఎందుకంటే తుపాకులను జీవితంలో భాగంగా మార్చుకున్న శ్వేతజాతి దురహంకారులు.. నిత్యం గుళ్ల వర్షం కురిపిస్తూనే ఉంటారు. 2023 మొదలైన ఇంకా ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు. 185కి పైగా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో విద్యాసంస్థల్లో జిరిగిన షూటింగ్ ఘటనలు కూడా ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు సామూహిక కాల్పుల్లో 300మంది ప్రాణాలు కోల్పోయారంటే.. అమెరికాలో విద్వేషం స్థాయి ఎక్కడ వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాలో జాత్యహంకారం మితిమీరుతుందా ?
టెక్సాస్‌లో 8మందిని కాల్చి చంపిన దుండగుడి ఫోటో గమనిస్తే.. అతను వేసుకున్న జాకెట్‌పై కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు రాసి ఉంటాయి. RWDS పేరుతో ఒక లేబుల్ కనిపిస్తుంది. ఈ నాలుగు అక్షరాల అర్థం Right Wing Death Squad అని. వీళ్ల లక్ష్యం ఒక్కటే జాత్యహంకారంతో రగిలిపోతూ ఇతర జాతులపై దాడులకు పాల్పడుతూ అవసరమైతే వాళ్ల ప్రాణాలను కూడా హరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఒకరకంగా వీళ్లంతా అతివాద తీవ్రవాద లక్షణాలు కల్గి ఉంటారు. వీళ్లలో వైట్ సూపర్‌మసి, నియో నాజియిజం ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలకు సంబంధించిన డేటాను పరిశీలిస్తే.. కాల్పులకు తెగబడ్డ వ్యక్తుల మోటివ్ ఏంటో అర్థమవుతుంది. తాము మాత్రమే నిజమైన అమెరికన్స్ అని, తమది మాత్రమే ప్రపంచంలో అందరికన్నా గొప్ప జాతి అని భావించే వ్యక్తులు, సమూహాలు ఇప్పుడు అమెరికా సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నారు.
తెల్లదొరల ఆధిపత్యం
ప్రతి వ్యక్తీ మరో వ్యక్తిని డామినేట్ చేయాలనుకుంటాడు. ప్రతి సమూహం మరో సమూహం కంటే తామే గొప్ప అనుకుంటుంది. మీకంటే మేమే ఎక్కువ అన్న భావజాలం ఇప్పటిది కాదు. అమెరికా పునాదుల్లోనే ఇది కనిపిస్తుంది. అమెరికాకు వలస వచ్చిన ఇతర జాతుల ప్రజలపై ఆధిపత్యధోరణితో వ్యవహరించే కొన్ని సమూహాలు అమెరికాకు ముప్పుగా మారాయి. దీన్నే WHITE SUPREMACY అని పిలుచుకుంటున్నారు. ఈ వైట్ సుప్రిమసీ.. రేసిజం కంటే ప్రమాదకరంగా మారింది. ప్రపంచంలో అందరికంటే తామే ఉన్నతమైనవాళ్లమని.. తమ రంగు, రూపురేఖలు అవి తెలియజేస్తున్నాయని నమ్మే వ్యక్తులు.. ఇతర జాతులపై డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్నొక భావజాలంగా, సిద్ధాతంగా మార్చి ఇతర జాతులను అణచివేసేందుకు ఉద్యమస్థాయికి తీసుకెళ్లారు.
ఆధిపత్య ధోరణికి తుపాకీ తోడైతే..
WHITE SUPREMACY అన్నది అమెరికాలో నిన్నా మొన్న పుట్టుకొచ్చిందేమీ కాదు. అమెరికన్ సివిల్ వార్ కంటే ముందే తెల్లదొరల ఆధిపత్యం అప్పటి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేది. సంపన్న అమెరికన్ – యూరోపియన్ కుటుంబాలు నల్లజాతీయులను బానిసలుగా మార్చుకుని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేవి. మానసికంగానూ, శారీరకంగానూ ఇతర జాతుల వ్యక్తులు తెల్లవాళ్లకంటే నీచులు అన్నది వాళ్ల మెదళ్లలో నాటుకు పోయిన క్రూరత్వం. మానవ హక్కుల పోరాటాలు సాగి అమెరికా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాక కూడా.. ఆధిపత్య ధోరణి మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.
21వ శతాబ్దంలోనూ అమెరికాలో శ్వేతజాతీయులు వర్సెస్ ఇతర జాతుల మధ్య ఘర్షణవాతావరణం కొనసాగుతూనే ఉంది. బ్లాక్ లైవ్స్ మేటర్ పేరుతో ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. MAKE AMERICA GREAT AGAIN అన్న నినాసాన్ని అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. శ్వేతజాతీయుల పక్షాన నిలిచినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలను తీసుకొచ్చి అమెరికా అంటే శ్వేతజాతీయులదే అన్న భావన కల్పించారు. WHITE SUPREMACYతో ఊగిపోయే చాలా వర్గాలు అప్పట్లో ఆయనకు మద్దతుగా నిలిచాయి. ఇతర జాతులను శత్రువులుగా చూసే ఇలాంటి వర్గాలకు అమెరికాలో విచ్చలవిడిగా దొరికే తుపాకులు తోడవుతున్నాయి. అమెరికా అనేక జాతుల సమ్మేళనం అన్న విషయాన్ని శ్వేతజాతీయులు గుర్తించకపోతే.. అమెరికాలో పేలుతున్న తుపాకులు.. చిందుతున్న ఇతర జాతుల రక్తం ఆదేశానికి శాపంగా మారతాయి.