Chandrayaan-3: చంద్రయాన్-3.. ఈ మూడు మాడ్యూల్స్ పని చేస్తే.. సక్సెస్సే..? ఏంటవి..?
చంద్రుడిపైకి దిగిన ల్యాండర్, రోవర్‌లు ఎంతకాలం పనిచేస్తాయన్నది స్పష్టంగా చెప్పడం కష‌్టమే. కారణం.. అక్కడి ప్రతికూల పరిస్థితులు. చంద్రుడిపై వాతావరణం చల్లగా, ప్రతికూలంగా ఉంటుంది. అక్కడ ఒక రోజుకు భూమిపై 28 రోజులు పడుతుంది.
Chandrayaan-3: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం శుక్రవారం మధ్యాహ్నం జరగబోతుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ మూడు దశలు దాటాలి. అవి ప్రోపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్ మాడ్యూల్. వీటి గురించి తెలుసుకుందాం.
ప్రపోల్షన్ మాడ్యూల్
చంద్రయాన్-3ని ముందుకు తీసుకెళ్లే మొదటి కీలక దశ ఇది. చంద్రయాన్-2లాంటిదే చంద్రయాన్-3 ప్రయోగం కూడా. కాకపోతే ఈసారి ఆర్బిటార్ కాంపొనెంట్‌ను ప్రోపల్షన్ మాడ్యూల్‌తో రీప్లేస్ చేశారు. ఇది ఒక బాక్స్‌లాగా ఉంటుంది. దీనికి ఒకవైపు సోలార్ ప్యానెల్ ఉంటుంది. పైభాగంలో సిలిండర్ డిజైన్‌లో ఇంటర్‌మాడ్యూల్ అడాప్టర్ కోన్ ఉంటుది. దీనికి ల్యాండర్ అమరుస్తారు. ఇదే ప్రోపల్షన్ మాడ్యూల్‌లో స్పెక్ట్రోపొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అనే పేలోడ్ ఉంటుంది. ఇది చంద్రుడిపై రిఫ్లెక్ట్ అయ్యే కాంతిని అధ్యయనం చేస్తుంది. స్పెక్ట్రల్, పొలారిమెట్రిక్ కొలతలు సేకరిస్తుంది. దీనివల్ల చంద్రుడిపై మానవ నివాసానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా.. లేదా అనేది తెలుసుకోవచ్చు.
ల్యాండర్ మాడ్యూల్
చంద్రుడిపై ల్యాండ్ అయ్యే పరికరం ఇది. దీనికి నాలుగు కాళ్లు, నాలుగు ల్యాండింగ్ థ్రస్టర్లు ఉంటాయి. ఇది చంద్రుడిమీద సురక్షితంగా దిగడానికి అవసరమైన కెమెరాలు, సెన్సర్లు దీనికి ఉంటాయి. చంద్రుడిపై దిగే క్రమంలో ఎదురయ్యే అవరోధాల్ని తప్పించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. దీనిద్వారా అది ఎక్కడ దిగిందో తెలుసుకోవచ్చు. కమ్యూనికేషన్ కోసం దీనికి ఎక్స్ బ్యాండ్ యాంటెన్నా ఉంటుంది. ల్యాండర్‌లో భారీ సామర్ధ్యం కలిగిన ఇంజిన్లు ఉంటాయి. దీనిలో మొత్తం ఐదు పరికరాలుంటాయి. చంద్రుడి కండక్టివిటీ, ఉష్ణోగ్రతను కొలిచేందుకు చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ అనే పరికరం ఒకటి. చంద్రుడిపై ప్రకంపనలు కొలవడానికి ఉపయోగపడే ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ అనే మరో పరికరం ఉంటుంది. చంద్రుడిపై ప్లాస్మా సాంద్రతను కొలిచేందుకు లాంగ్‌ముయిర్ ప్రోబ్, చంద్రుడిపై రేంజింగ్ అధ్యయనాల కోసం ప్యాసివ్ లేజర్ రెట్రోరిఫ్లక్టర్ అరే అనే పరికరం ఉంటుంది. దీన్ని అమెరికా అభివృద్ధి చేసింది. చంద్రుడిపై ఉండే గ్యాస్, ప్లాస్మా వాతావరణం గురించి కొలిచేందుకు రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్పియర్ అనే మరో పరికరం కూడా పనిచేస్తుంది.
రోవర్
చంద్రుడిపై పరిశోధనలకు అత్యంత కీలకమైంది రోవర్. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ల్యాండర్‌లోని చాంబర్‌లో ఇది ఉంటుంది. ర్యాంప్ ద్వారా ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వస్తుంది. చంద్రుడిపై ఎలాంటి ఆటంకాలు లేకుండా కదలడం కోసం ఆరు చక్రాలు, నావిగేషన్ కెమెరా ఉంటాయి. అక్కడ పరిశోధనల కోసం ఆల్ఫా పార్టికిల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ అనే పరికాలు ఏర్పాటు చేశారు. ఇవి చంద్రుడిపై తిరుగుతూ అక్కడి మూలకాల గురించి పరిశోధనలు సాగిస్తూ, ఆ వివరాలు అందిస్తుంది. యాంటెన్నాల ద్వారా ఇది ల్యాండర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది.
ఎన్ని రోజులు పనిచేస్తాయి..?
చంద్రుడిపైకి దిగిన ల్యాండర్, రోవర్‌లు ఎంతకాలం పనిచేస్తాయన్నది స్పష్టంగా చెప్పడం కష‌్టమే. కారణం.. అక్కడి ప్రతికూల పరిస్థితులు. చంద్రుడిపై వాతావరణం చల్లగా, ప్రతికూలంగా ఉంటుంది. అక్కడ ఒక రోజుకు భూమిపై 28 రోజులు పడుతుంది. ఒక పగలు, ఒక రాత్రి కలిపి ఒక రోజు. ఈ లెక్కన చంద్రుడిపై వరుసగా 14 రోజులు పగలు, 14 రోజులు చీకటి ఉంటుంది. 14 రోజులు రాత్రిపూట అతి చల్లగా ఉండటంతోపాటు, సూర్యకాంతి కూడా అందదు. ఆ సమయంలో ల్యాండర్, రోవర్ పనిచేయడం కష్టమే. అందుకే 14 రోజులు మాత్రమే పనిచేసేలా వాటిని తీర్చిదిద్దారు. అయితే, ఆ తర్వాత కూడా వాతావరణం అనుకూలిస్తే పని చేసే ఛాన్స్ ఉంది.