Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్.. చరిత్ర సృష్టించబోతున్న ఇండియా.. తెలంగాణ స్కూళ్లలో లైవ్..!

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయిగా నిలిచిపోయే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులకు చూపించబోతుంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఈ మేరకు ప్రత్యక్ష ప్రసారం చేయాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 22, 2023 | 07:11 PMLast Updated on: Aug 22, 2023 | 7:11 PM

Chandrayaan 3 Landing On Moon To Go Live In All Educational Institutes In Telangana

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం కీలక ఘట్టానికి ముహూర్తం ఫిక్సైంది. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఇస్రో శాస్త్రవేత్తలు దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాలని యావద్భారత దేశం కోరుకుంటోంది. దీనికోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయిగా నిలిచిపోయే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులకు చూపించబోతుంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఈ మేరకు ప్రత్యక్ష ప్రసారం చేయాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, యువత లైవ్ టెలికాస్ట్ ద్వారా చూడాలని కోరింది. ఈనేపథ్యంలో టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ కీలక ఘట్టాన్ని విద్యార్థులంతా వీక్షించేలా ప్రభుత్వ పాఠశాలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక తెరలు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశంలోని యువత అంతా దీన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించాలని సూచించింది.

ఇలాంటివాటిని చూడటం వల్ల యువతకు స్ఫూర్తిగా ఉంటుందని, ఈ రంగంపై ఆసక్తి ఉంటుందని, భవిష్యత్ ప్రయోగాలకు ఉపయోగపడుతుందని విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే చంద్రుడికి చేరువైన ల్యాండర్.. అక్కడ చంద్రుడి ఫొటోల్ని తీసి, ఇస్రోకు పంపింది. చంద్రుడిని అత్యంత దగ్గరగా తీసిన ఈ ఫొటోల్ని ఇస్రో విడుదల చేసింది. బుధవారం ఈ ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 05:20 గంటలక ప్రారంభమవుతుంది. 06:00 తర్వాత ల్యాండర్ జాబిల్లిని ముద్దాడుతుంది. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ అయితే.. భారత దేశం సరికొత్త చరిత్ర సృష్టించినట్లే.