Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యేదెప్పుడు..? ఆగష్టు 27కు వాయిదా పడుతుందా..?
ఇప్పటివరకు చంద్రయాన్-3 ప్రయోగం షెడ్యూల్ ప్రకారమే విజయవంతంగా కొనసాగింది. బుధవారం జరగబోయే ల్యాండింగే అత్యంత కీలకమైన దశ. చంద్రయాన్-3ని చంద్రుడిపై దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. బుధవారం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.
Chandrayaan-3: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు సమయం రానేవచ్చింది. అన్నీ కుదిరితే ఆగష్టు 23, బుధవారం ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. దీనికోసం శాస్త్రవేత్తలతోపాటు భారతీయులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు చంద్రయాన్-3 ప్రయోగం షెడ్యూల్ ప్రకారమే విజయవంతంగా కొనసాగింది. బుధవారం జరగబోయే ల్యాండింగే అత్యంత కీలకమైన దశ.
చంద్రయాన్-3ని చంద్రుడిపై దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. బుధవారం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.
ఈ విషయంలో అన్ని అంశాలు అనుకూలంగా ఉండాలని ఇస్రో డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ అంటున్నారు. ల్యాండింగ్ షెడ్యూల్‌కు రెండు గంటల ముందు ల్యాండింగ్ చేయాలా.. వాయిదా వేయాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ల్యాండర్ మాడ్యూల్ సురక్షితంగా ఉండటం, చంద్రుడిపై వాతావరణం అనుకూలంగా ఉండటం.. ఈ రెండు జరిగితేనే బుధవారం ల్యాండర్‌ను దించుతారు. లేదంటే ఈ ప్రక్రియను ఆగష్టు 27 ఆదివారానికి వాయిదా వేస్తారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. ల్యాండింగ్‌ను వాయిదా వేసేందుకు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. ల్యాండింగ్ చేయడం అత్యంత క్లిష్టమైన దశ అని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని వ్యవస్థలు సరిగ్గా పని చేయాల్సి ఉంటుందని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. ఆయన 2008లో చంద్రయాన్-1కు నేతృత్వం వహించారు.
20 నిమిషాలే కీలకం
బుధవారం సాయంత్రం చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమే అసలైన ఘట్టం. ప్రగ్యాన్ రోవర్‌తో కలిసి చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. ఈ ప్రక్రియలో చివరి 20 నిమిషాలే అత్యంత కీలకం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. బెంగళూరు నుంచి పంపే సంకేతాల ఆధారంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నిస్తుంది. 25 కిలోమీటర్ల ఎత్తు నుంచి నెమ్మదిగా చంద్రుడిపైకి దిగుతుంది. సెకండుకు 1.68 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిపైకి వెళ్తుంది. అంటే గంటకు 6048 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇది విమానం వేగం కంటే పది రెట్లు ఎక్కువ. చంద్రుడికి సమీపంలోకి వచ్చేసరికి ఈ వేగం తగ్గుతుంది. దీన్ని రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఇది 11 నిమిషాలు ఉంటుంది.
ఈ సమయంలో ఇది చంద్రుడికి సమాంతరంగా ఉంటుంది. తర్వాత దీన్ని ఫైన్ బ్రేకింగ్ ఫేజ్‌లోకి మారుస్తారు. ఇప్పుడు ఇది చంద్రుడిపైకి వెర్టికల్‌గా వెళ్తుంది. 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత హారిజాంటల్, వర్టికల్ వేగాలు సున్నా స్థాయికి చేరుతాయి. అప్పుడు ఇది చంద్రుడిపై సురక్షితంగా దిగేందుకు అవసరమైన ప్రదేశం కోసం వెతుకుతుంది. మరోసారి 150 మీటర్ల ఎత్తు నుంచి కావాల్సిన ప్రదేశాన్ని ఎంచుకుని ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ పూర్తయ్యాక చంద్రుడిపై ఒక రోజు.. అంటే భూమిపై 14 రోజులు ఇది పని చేస్తుంది.