Chandrayaan-3: చంద్రుడిపై మన మూడు సింహాలు.. ఇదీ ఇండియా పవర్‌ అంటే..

చందమామపై చెరిగిపోని ముద్ర వేసింది చంద్రయాన్‌-3. ప్రగ్యాన్‌ రోవర్‌కు అమర్చిన ఆరు చక్రాల ఇస్రో లోగోతో పాటు భారత జాతీయ చిహ్నమైన మూడు సింహాలను కూడా ముద్రించారు సైంటిస్టులు. రోవర్‌ చంద్రుడిపై దిగగానే ఆ ముద్రలు చంద్రుడిపై పడ్డాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2023 | 03:30 PMLast Updated on: Aug 24, 2023 | 3:30 PM

Chandrayaan 3 Pragyan Rover Takes Walk On Moon As India Celebrates Historic Feat

Chandrayaan-3: అపజయం నుంచి నేర్చుకున్న పాఠం. రూ.615 కోట్ల వ్యయం. అనుక్షణం ఆరాటం. వందల మంది సైటిస్టుల కష్టం. వీటన్నింటి ఫలితమే చంద్రయాన్‌-3. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నా.. అభివృద్ధిలో దూసుకుపోతున్నా.. అంతా అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేసి చూపించింది భారత్‌. ఎవరికీ సాధ్యం కాని చంద్రుడి సౌత్‌ పోల్‌ మీద ల్యాండర్‌ను దింపి ఇండియా దమ్మేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. చీకటి కడుపులను చీల్చుతూ వెళ్లి చందమామపై ఇండియా ముద్ర వేసింది.

దెబ్బ కొడితే అచ్చు పడాల్సిందే కదా. అందుకే చందమామపై చెరిగిపోని ముద్ర వేసింది చంద్రయాన్‌-3. ప్రగ్యాన్‌ రోవర్‌కు అమర్చిన ఆరు చక్రాల ఇస్రో లోగోతో పాటు భారత జాతీయ చిహ్నమైన మూడు సింహాలను కూడా ముద్రించారు సైంటిస్టులు. రోవర్‌ చంద్రుడిపై దిగగానే ఆ ముద్రలు చంద్రుడిపై పడ్డాయి. 14 రోజుల పాటు ప్రగ్యాన్‌ ఏఏ ప్రాంతాల్లో తిరుగుతుందో ఆయా ప్రాంతాల్లో మన నేషనల్‌ ఎంబ్లెమ్‌, ఇస్రో లోగోలు ముద్రించబడతాయి. చండ్రుడిపై గాలి ఉండదు కాబట్టి ఎన్నేళ్లైనా ఆ ముద్రలు అలాగే ఉంటాయి. ప్రగ్యాన్‌ రోవర్‌ ముద్రించింది మామూలు ముద్ర కాదు. తరం మారినా తరిగిపోని ముద్ర. శకం మారినా చెరిగిపోని ముద్ర. దేశం మీసం తిప్పే ఈ ఉద్విగ్నభరిత క్షణం.. ప్రతీ భారతీయుడి జీవితంలో మర్చిపోలేని ఘట్టం.

చంద్రుడిపై మానవ నివాసం మొదలయ్యే వరకూ ఆ గడ్డపై మూడు సింహాల ముద్ర ఉండాల్సిందే. ఆ ముద్రలను ప్రతీ దేశం ఫాలో కావాల్సిందే. మూన్‌ మిషన్‌ చేపట్టే ప్రతీ దేశానికి ఇండియా చూపించిన దారే ఇప్పుడు రహదారి. అవమానాలు, ఆక్రమణలను భరించి ప్రపంచానికి దారి చూపే పెద్దన్నగా అవతరించబోతోంది ఇండియా.