China: చైనాను ఛీకొడుతున్న పాకిస్తాన్ ప్రజలు..మిత్రులు శత్రువులుగా మారుతున్నారా ?

అవసరాలు.. వ్యక్తులను గానీ, వ్యవస్థలను గానీ చివరకు దేశాలను గానీ దగ్గర చేస్తాయి. ఒక్కోసారి ఆ అవసరాలే శాశ్వత బంధం ఏర్పడేలా చేస్తాయి. పాకిస్తాన్ చైనా దశాబ్దాలుగా మిత్రదేశాలు. పాక్ అవసరం చైనా కంటే చైనా అవసరమే పాక్‌కు ఎక్కువగా ఉంటుంది. ఆధిపత్యం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే అలవాటు ఉన్న చైనా భారత్‌కు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సహజంగానే పాక్‌కు మిత్రదేశంగా మారిపోయింది. పాక్ ఆర్థిక అవసరాలను తీర్చుతూ..ఆదేశానికి అవసరమైన నిధులను అప్పుల రూపంలో అందిస్తూ చేదోడువాదోడుగా ఉంటూ వస్తోంది. 1962లో భారత్ చైనా యుద్ధం తర్వాత చైనాకు పాక్ మరింత దగ్గరయ్యింది. అప్పటి నుంచి రెండు దేశాలు ఫ్రెండ్లీ నేషన్స్ గానే కొనసాగుతున్నాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ప్రస్తుత పాక్ ప్రజల ఆలోచన మారుపోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2023 | 08:00 PMLast Updated on: Apr 18, 2023 | 8:00 PM

China Enemy To Pakistan

చైనాను పాక్ ప్రజలు నమ్మడం లేదా ?
ఎక్కడో తేడా కొడుతోంది. చైనా చూపించే వల్లమాలిన ప్రేమను పాక్ ప్రజలు నమ్మలేకపోతున్నారు. అంతేకాదు… చైనా పైకి ప్రేమగా నటిస్తూ తమ దేశాన్ని మెల్లగా ఆక్రమించుకునే కుట్రలు కూడా చేస్తుందని పాక్ ప్రజలు అనుమానిస్తున్నారు. కమర్షియల్ ప్రాజెక్టులు, మైనింగ్ ఆపరేషన్లు, పాక్ సంస్థల్లో పెట్టుబడులు ఇలా ఒక్కటేంటి పాకిస్థాన్‌కు ఆర్థికంగా అండగా ఉండే పేరుతో తమపై పెత్తనం చెలాయించే స్థాయికి చైనా చేరుకుందని పాక్ ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం పాక్ వ్యాప్తంగా యాంటీ చైనా సెంటిమెంట్స్ బలపడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ లో వ్యాపారం చేసుకుంటున్న చైనా ప్రజలను పాకిస్థానీయులు అనుమానంతో చూడటం మొదలుపెట్టారు. పాక్ లోని వివిధ రాష్ట్రాల్లో పాక్ ప్రజలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది.

కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు పాక్ వ్యాపారాలపై దాడులు కూడా చేస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలు భద్రత కల్పించే పరిస్థితిలో లేకపోవడంతో బలవంతంగా వ్యాపారాలను పోలీసులు మూయించేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో యూనివర్శిటీ ఆఫ్ కరాచీ సమీపంలో జరిగిన దాడిలో చైనీయులు ప్రాణాలు కోల్పోయారు. 2004 నుంచే పాక్‌లో యాంటీ చైనా సెంటిమెంట్ బలపడుతూ వస్తోంది. అప్పటి నుంచి పాక్ లో ఏదో ఒకచోట చైనా ప్రజలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌లో స్థానికంగా ఉండే తీవ్రవాద సంస్థలు చైనా సంస్థలను టార్గెట్ చేసుకున్నాయి. పాకిస్థాన్‌లో చైనా ప్రాభల్యం పెరిగితే తమ మనుగడకే ముప్పు వస్తుందని.. చివరకు చైనా చెప్పినట్టు పాక్ ప్రభుత్వాలు తలాడించే పరిస్థితులు కూడా తలెత్తుతాయని పాక్ రెబల్ గ్రూప్స్ భావిస్తున్నాయి. Tehreek-e-Taliban Pakistan ,ISIS-Khorasan (IS-K) వంటి సంస్థలు చైనా సంస్థలపై దాడుల్లో ముందుంటున్నాయి.

పాక్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు
వివిధ రాష్ట్రాల్లో చైనా ప్రజలు, సంస్థలు టార్గెట్‌గా సాగుతున్న దాడులు పాక్ పాలకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పాక్ గడ్డపై ప్రాణాలు కోల్పోయిన చైనీయులకు, సంస్థలకు పాక్ ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోంది. అసలే అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ప్రభుత్వానికి ఇది మరింత భారంగా మారింది. దాడులు జరగకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అడ్డుకోకపోవడం మొదటి సమస్య అయితే… దాడుల తర్వాత నష్టపరిహారాన్ని భారిగా భరించడం పాక్‌కు సవాల్‌గా మారింది.

చైనాపై పాక్‌ ప్రజల్లో ఎందుకింత వ్యతిరేకత ?
హాంకాంగ్, తైవాన్‌తో బాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వైఖరి చూసిన తర్వాత పాక్ ప్రజలతో పాటు అక్కడి రెబల్ గ్రూప్స్ లో చైనాపై నమ్మకం క్రమంగా తగ్గుతోంది. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పేరుతో పాకిస్థాన్ లో చైనా 3000 కిమీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఎక్కువ భాగం బలోచిస్థాన్ పరిధిలోకి వస్తుంది. పాకిస్థాన్ నుంచి విముక్తి కోరుకంటున్న బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ…చైనాను ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. తమ దేశంలో చైనా చేపట్టే ప్రాజెక్టుల ద్వారా ఆ దేశం పొందే ప్రయోజనాలే ఎక్కువన్నది ప్రజల అనుమానం. పాకిస్థాన్‌కు అప్పుల రూపంలో సాయం చేయడం వెనుక కూడా చైనా తన భవిష్యత్తు అవసరాలను చూసుకుంటోంది పాక్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే క్రమేపీ చైనా అన్నా… చైనా వ్యాపారాలన్నా పాక్ ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. ఓవైపు రెబల్ గ్రూపులు దాడులు చేసి చైనీయులను పొట్టనపెట్టుకుంటే..మరోవైపు పాక్ ప్రజల వైఖరి కూడా రోజురోజుకు ప్రతికూలంగా మారుతోంది. 2013లో పాక్ ప్రజల దృష్టిలో చైనా మోస్ట్ ఫేవరబుల్ కంట్రీగా ఉండేంది. దాదాపు 81శాతం మంది ప్రజలు చైనాకు మద్దతిచ్చేవారు. అయితే సంవత్సరాలు గడిచే సరికి పరిస్థితి తారుమారైపోయింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో యాంటీ చైనా సెంటిమెంట్ బాగా పెరిగిపోయింది

చైనా హెచ్చరికలు పనిచేస్తాయా ?
కొంతకాలంగా తమ దేశీయులపై జరుగుతున్న దాడులను చైనా సీరియస్‌గానే తీసుకుంది. దాడులను అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని పాక్ పాలకులను కూడా హెచ్చరించింది. అయితే చైనాకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవడంలో ఇస్లామాబాద్ పాలకులు విఫలమవుతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య మైత్రికి బీటలు వారే ప్రమాదం కూడా కనిపిస్తోంది.. మొత్తానికి కొన్ని సంవత్సరాలుగా పాక్‌లో బలపడుతున్న యాంటీ చైనా సెంటిమెంట్ చివరకు రెండు దేశాల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.