China: డ్రాగన్ దూకుడుకు భారత్ బ్రేక్

అరుణాచల్‌ప్రదేశ్ తమదేనంటూ మొండిగా, తొండిగా వాదిస్తున్న చైనా ఇప్పుడు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టేసింది. అయితే మీకంత సీను లేదు అది మాదేనంటున్న భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ రెండు దేశాల మధ్య ఈ వివాదమేంటి.? చైనాకు అరుణాచల్‌ప్రదేశ్‌పై ఎందుకు అంత మోజు.?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2023 | 01:00 PMLast Updated on: Apr 06, 2023 | 1:20 PM

China India War At Arunachalpradesh

అరుణాచల్‌ప్రదేశ్ తమదేనంటూ మొండిగా, తొండిగా వాదిస్తున్న చైనా ఇప్పుడు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టేసింది. అయితే మీకంత సీను లేదు అది మాదేనంటున్న భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ రెండు దేశాల మధ్య ఈ వివాదమేంటి.? చైనాకు అరుణాచల్‌ప్రదేశ్‌పై ఎందుకు అంత మోజు.?

అరుణాచల్‌ప్రదేశ్ (Arunachal Pradesh) భారత్‌లో అంతర్భాగం.. వారంతా భారతీయులు.. కానీ చైనా (China) మాత్రం ఆ ప్రాంతమంతా తమదే అంటోంది. తమ మ్యాపులో కూడా దాన్ని తమ దేశంలో భాగంగా చూపిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో మన ప్రధాని పర్యటిస్తే దానికి కడుపు మండుతుంది. అక్కడ మనం అభివృద్ధి పనులు చేపడితే రగిలిపోతుంది. ఈ వివాదం చాలాకాలంగా ఉన్నా ఈ మధ్య చైనా మరో అడుగు ముందుకేసింది. దక్షిణ టిబెట్‌లో జాంగ్నాన్ ( అరుణాచల్‌కు చైనా పెట్టుకున్న పేరు) భాగమని చాలాకాలంగా వాదిస్తున్న చైనా తాజాగా 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. గతంలో రెండుసార్లు ఇలాంటి పాడు పనులకే దిగింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాజధాని ఈటానగర్‌కు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. అక్షాంశాలు, రేఖాంశాలతో సహా చైనా ఇలా నామకరణం చేసేసింది. చైనా ఇప్పుడు ఎందుకు ఇలా చేసింది అంటే దాని వెనక పెద్ద కారణమే ఉంది.. ఈటానగర్‌వో ఇన్నోవేషన్ టెక్నాలజీపై జీ20 అనుబంధ సదస్సు నిర్వహించడం చైనా కోపానికి కారణం. పేర్లు మార్చడమే కాదు ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేలా చట్ట పరిధిలోకి తీసుకురాబోతోంది.

చైనా తీరును భారత్ ఖండించింది. మీ అనందం కోసం పేర్లు పెట్టుకుంటే మీ ఖర్మ.. అరుణాచల్ ప్రదేశ్ మాత్రం భారత్‌లో అంతర్భాగమే అని తేల్చి చెప్పింది. కొత్తగా పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవాన్ని మార్చలేరని కామెంట్ చేసింది. గతంలో చూస్తూ ఊరుకున్నట్లు ఈసారి జరగదంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా కూడా ఈ విషయంలో భారత్‌కు అండగా నిలిచింది. పదేపదే భారత్‌ను కవ్వించాలని చైనా ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. మెక్‌మోహన్ రేఖే ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖ ( అరుణాచల్‌ప్రదేశ్‌కు మాత్రమే) అన్నదానికే తాము కట్టుబడి ఉంటామని అమెరికా అంటోంది.

ఎంత సరిహద్దు.?
చైనాతో భారత్‌కు 5వేల మైళ్ల మేర సరిహద్దు ఉంది. అరుణాచల్ తమదే అంటోంది డ్రాగన్. సిక్కింపై కన్నేసింది. ఉత్తరాఖండ్‌లో కొంతభాగం తమదేనని తగవులాడుతోంది. లద్దాఖ్‌లో కొంతభాగం తమదేనని వాదిస్తోంది. మొత్తంగా చూస్తుంటే 2వేల మైళ్ల మేర చైనా కయ్యానికి దిగుతోంది. ఆక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించింది.

ఏంటి మెక్‌మోహన్ రేఖ.?
1914లో భారత్, టిబెట్ ప్రభుత్వాల మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. దానిపై నాటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారి మెక్‌మోహన్, టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులు సంతకం చేశారు. దాని ప్రకారం తవాంగ్ సహా ఈశాన్య సరిహద్దు ప్రాంతాలు భారత్‌లో భాగమని అంగీకరించారు. 1938లో బ్రిటీష్ ప్రభుత్వం అధికారికంగా మ్యాప్‌ను ముద్రించింది కూడా. అయితే ఆ తర్వాత టిబెట్ మాటమార్చింది. దానిపై వివాదం నడిచింది కూడా. కానీ బ్రిటీష్ ప్రభుత్వం మాత్రం తవాంగ్ భారత్‌దే అని వాదిస్తూ వచ్చింది. తర్వాత టిబెట్ డ్రాగన్ నీడలోకి వెళ్లిపోయింది. సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతంగా తవాంగ్‌ను చెబుతారు. లాసా తర్వాత అది ప్రాచీన బౌద్ధ ఆశ్రమం ఇక్కడే ఉంది. బుద్ధుడి అవశేషాలు ఇక్కడ ఉన్నట్లు చెబుతారు. తవాంగ్ ఆశ్రమం కోసమే చైనా ఆ ప్రాంతం మొత్తం తమదే అని వాదిస్తూ వస్తోంది. పైగా తవాంగ్ ప్రకృతి అందాలకు పుట్టిల్లు.

టిబెట్ డ్రాగన్‌దేనా..?
టిబెట్‌లో అరుణాచల్ అంతర్భాగం.. టిబెట్ మాది కాబట్టి ఆ ఈశాన్య రాష్ట్రం కూడా మాదే అంటోంది డ్రాగన్. నిజానికి అసలు టిబెటే చైనాది కాదు. 1949కి ముందు 40ఏళ్ల పాటు టిబెట్ స్వతంత్ర రాజ్యంగా ఉంది. 1950 అక్టోబర్‌లో చైనా సైన్యం టిబెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకు పూర్తిగా దాన్ని ఆక్రమించింది. దలైలామాతో బలవంతంగా వివాదాస్పద ఒప్పందంపై సంతకం చేయించింది. ఆ తర్వాత దలైలామా భారత్‌కు పారిపోయి వచ్చారు. దలైలామాకు మనం ఆశ్రయం ఇవ్వడాన్ని చైనా సీరియస్‌గా తీసుకుంది. పైగా మనం టిబెట్‌ను స్వతంత్ర దేశంగానే గుర్తిస్తూ వచ్చాం. అప్పట్నుంచి మనతో చైనాకు దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని వాదిస్తూ వచ్చింది డ్రాగన్. మనం అరుణాచల్‌ప్రదేశ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకించింది. అప్పట్లో మన్మోహన్, ఆ తర్వాత నరేంద్రమోడీలు ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడల్లా నిరసన తెలపడమే కాకుండా ఏదో ఓ ఘర్షణకు దిగేది.

సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించింది. అక్కడే వెంటనే గ్రామాలను నిర్మించేది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలు జరిగేవి. సైన్యం వెనక్కువెళ్లినా ఆ ప్రాంతాల్లో మాత్రం చైనీయులు ఉండిపోయేవారు. ఆ విధంగా చైనా దురాక్రమణను కొనగసాగిస్తూ వచ్చింది. ఏనాటికైనా అరుణాచల్‌ప్రదేశ్‌ను పూర్తిగా ఆక్రమించాలన్నది చైనా ఆలోచన. అందుక తరచు అరుణాచల్‌లో ఏదో ఓ వివాదాన్ని రగిలించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దలైలామా అక్కడ అడుగుపెట్టినా తట్టుకోలేదు.. వేరే దేశానికి చెందిన వారెవరూ అక్కడ పర్యటించడానికి ఒప్పుకోదు.