Mobile Using: పిల్లల మొబైల్ వాడకంపై చైనా పరిమితులు.. ఇండియా ఏం చేస్తోంది..?
తాజా రూల్స్ ప్రకారం.. 16 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లు రోజుకు రెండు గంటలు మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ వాడాలి. 8 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు రోజుకు ఒక గంట, 8 ఏళ్లలోపు పిల్లలు రోజుకు 40 నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్ వాడాలి.
Mobile Using:మొబైల్ వాడకం పిల్లలు, యువత ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. మానసిక, శారీరక జబ్బులకు కారణమవుతోంది. అందుకే ఈ విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు, 18 ఏళ్లలోపు యువత మొబైల్ వాడకంపై పరిమితులు విధించింది.
తాజా రూల్స్ ప్రకారం.. 16 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లు రోజుకు రెండు గంటలు మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ వాడాలి. 8 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు రోజుకు ఒక గంట, 8 ఏళ్లలోపు పిల్లలు రోజుకు 40 నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్ వాడాలి. అలాగే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మొబైల్ వాడకూడదు. పిల్లలు మొబైల్ వాడకం ద్వారా అనేక మానసిక సమస్యల్ని, శారీరక రుగ్మతల్ని ఎదుర్కొంటున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. అందుకే చిన్నారుల ఆరోగ్యాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వారి మొబైల్ వాడకంపై పరిమితులు విధించాలని చైనాకు చెందిన సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సీఏసీ) తాజా ప్రతిపాదనలు రూపొందించింది.
ఇవి త్వరలోనే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. చైనాలో ఇంటర్నెట్ ప్రొవైడర్ల మైనర్ మోడ్ అమలు చేయాలి. అంటే పద్దెనిమిదేళ్లలోపు వాళ్ల ఇంటర్‌నెట్ వాడకంపై కచ్చితంగా పరిమితులు విధించాల్సి ఉంటుంది. అయితే, పిల్లల అభ్యున్నతి, ఆరోగ్యం కోసం ఉపయోగపడే యాప్స్ వినియోగించేందుకు మాత్రం అవకాశం ఉండొచ్చు. అలాగే ఫోన్ కాల్స్ వంటి ఇతర సేవలు మాత్రం రాత్రిపూట అందుబాటులో ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి పదిలోపు మాత్రమే మొబైల్ యాప్స్ వాడొచ్చు. అయితే, ఏ యాప్స్ రాత్రిపూట కూడా వాడొచ్చు.. ఏ యాప్స్‌పై నిషేధం ఉంటుంది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. చైనాలో ఇలాంటి కఠిన ఆంక్షలు విధించడం మామూలే. పిల్లలు మొబైల్ గేమ్స్ వాడకంపై గతంలోనే నిషేధం విధించింది. రోజుకు 90 నిమిషాలు మాత్రమే మొబైల్ యాప్స్ వాడేలా 2019లోనే చట్టం తెచ్చింది. కొన్ని మొబైల్ గేమ్స్‌పై నిషేధం కూడా విధించింది. పిల్లలు, వారి వయసు ఆధారంగా మాత్రమే ఇంటర్నెట్ వినియోగించేలా తాజా రూల్స్ రాబోతున్నాయి.
ఇండియా సంగతేంటి..?
చైనాలో ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనలపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇండియాలో కూడా ఇలాంటి రూల్స్ వస్తే బాగుంటుంది అన్నది చాలా మంది ఆలోచన. చైనాలో రోజుకు 2 గంటల మించి మొబైల్ వాడుతున్న పిల్లలు, యువతలో 61 శాతం మంది మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. చైనా ప్రభుత్వ నిర్ణయంతో వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో కూడా మొబైల్ అధికంగానే వాడుతున్నారు. చైనాలో 18 ఏళ్లలోపు వాళ్లు సగటున 3.08 గంటలు మొబైల్ వినియోగిస్తుంటే.. ఇండియాలో అంతకంటే ఎక్కువగా.. అంటే దాదాపు నాలుగు గంటలుగా ఉంది. ఎక్కువ మొబైల్ వాడుతున్న ప్రతి పదిమందిలో ముగ్గురు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్, ఇతర మానసిక జబ్బులు ఎదుర్కొంటున్నారు. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి. అందుకే మన దేశంలో కూడా పిల్లలు, యువతకు సంబంధించి మొబైల్ వాడకంపై పరిమితులు విధించాలని తల్లిదండ్రులు, మానసిక నిపుణులు కోరుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందేమో చూడాలి.