YS JAGAN: ప్రాణం నిలిపేందుకు హెలికాప్టర్‌కు అనుమతిచ్చిన జగన్.. సీఎం మంచి మనసు..
వైఎస్ జగన్ మరోసారి తన తన మంచి మనసును, ఉదారతను చాటుకున్నారు. గుండె తరలింపు కోసం.. ఏకంగా తన అధికారిక హెలికాప్టర్‌ను ఏర్పాటుచేసి మానవత్వం చాటారు. తాను మరణిస్తూ మరో ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడి గుండెను తరలించడానికి.. తాను ఉపయోగించే హెలికాప్టర్ ఏర్పాటు చేశారు.

YS JAGAN: వైఎస్ జగన్.. వైఎస్ తనయుడిగా, సీఎంగా చాలామంది అభిమానిస్తుంటారు. రాజకీయంగా జగన్ మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. నా అనుకునే వాళ్ల కోసం జగన్ ఎంతవరకు అయినా వెళ్తారన్నది చాలామంది అభిప్రాయం. వైఎస్ జగన్ మరోసారి తన తన మంచి మనసును, ఉదారతను చాటుకున్నారు. గుండె తరలింపు కోసం.. ఏకంగా తన అధికారిక హెలికాప్టర్‌ను ఏర్పాటుచేసి మానవత్వం చాటారు. తాను మరణిస్తూ మరో ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడి గుండెను తరలించడానికి.. తాను ఉపయోగించే హెలికాప్టర్ ఏర్పాటు చేశారు.
దీంతో గుంటూరు నుంచి తిరుపతికి సమయానికి గుండె చేరుకుంది. తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స కొనసాగుతోంది. రోడ్డు మార్గం ద్వారా గుండెను తరలిస్తే సమయం వృథా అవుతుందని భావించిన సీఎం.. హెలికాప్టర్ ద్వారా గుండెను తరలించేందుకు ఏర్పాటు చేయడంపై జనాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. ఆయన మానవతా హృదయంతో స్పందించిన తీరుపై చాలామంది ప్రశంసలు గుప్పిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శాంతినగర్‌లో నివాసం ఉండే కట్టా రాజు, మల్లీశ్వరి దంపతుల ముగ్గురు కొడుకులలో పెద్దవాడైన కృష్ణ.. నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు కృష్ణతో పాటు మరికొంతమంది విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కృష్ణ తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతని బ్రెయిన్ డెడ్ అయింది.
నిరుపేద కుటుంబం అయినా సరే.. కృష్ణ చికిత్స కోసం రెండు లక్షలకు పైగా ఖర్చు చేశారు ఆ తల్లిదండ్రులు. కొడుకును బతికించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఐనా సరే ఫలితం లేకుండా పోయింది. పుట్టెడు దుఖంలో మునిగిపోయిన ఆ నిరుపేద కుటుంబం.. బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణ లివర్, రెండు కిడ్నీలు, గుండెను వేరు చేసి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లకు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. రమేష్ హాస్పిటల్ నుంచి అవయవాలను తరలించడం కోసం పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గుండెను తరలించడం కోసం సీఎం హెలికాప్టర్‌ను ఏర్పాటుచేసి.. జగన్ మరోమారు తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు.