Coaching Centres : అవి కోచింగ్ సెంటర్లా… సూసైడ్ కేంద్రాలా… కోటాలో ఏం జరుగుతోంది ?

బతికుంటే బలుసాకు తినొచ్చని పెద్దలు చెబుతారు. ఐఐటీలు, ఐఐఎంలు, పెద్ద పెద్ద ప్యాకేజీల భ్రమల్లో బతుకుతూ విలువైన విద్యార్థి జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కంటే.. పిల్లల శక్తిసామర్థ్యాలు ఎందులో ఉన్నాయో తెలుసుకుని ఆ దిశగా వాళ్లను ప్రోత్సహించడం ఉత్తమం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 4, 2023 | 12:13 PMLast Updated on: Aug 04, 2023 | 12:13 PM

Coaching Become Harrsing Places For Students Stress Causing Suicides

ఆ ఊరిలో ఎప్పుడు చూసినా ఏదైనా జాతర జరుగుతుందా అన్నంత కోలాహలం కనిపిస్తుంది. తమ భవిష్యత్తు జీవితాలను వెతుక్కుంటూ వేలాది మంది విద్యార్థులు నిత్యం అక్కడికి వస్తూ ఉంటారు. ఇసుకేస్తే రాలదేమో అన్నంతగా కోచింగ్ సెంటర్లు స్టూడెంట్స్ తో బిజీబిజీగా ఉంటాయి. అక్కడ అడుగుపెట్టే వాళ్లందరిదీ ఒకటే లక్ష్యం… ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రెన్స్ లో ర్యాంక్ కొట్టాలి. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో సీటు సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరిదీ ఇదే కల. కానీ కొంతమంది విద్యార్థులకు ఆ కలే పీడ కలగా మారుతుంది. విద్యాబోధన అందించేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన స్టూడెంట్స్ ను అక్కున చేర్చుకున్న రాజస్థాన్ లోని కోటా నగరం ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది.

ఈ ఏడాది ఇప్పటి వరకు 17 మంది

రాజస్థాన్‌కే కాదు దేశానికే ఎడ్యుకేషనల్ హబ్ గా మారిపోయిన కోటా కోచింగ్ సెంటర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే… తల్లిదండ్రుల గుండెలు పిడుగు పడినట్టే. ఎప్పడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోనని పేరెంట్స్ భయంతో బతకాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఎందుకంటే… కోటాలో కోచింగ్ తీసుకుని భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నో ఆశాలతో కోటా వచ్చిన 17 ఏళ్ల కుర్రాడు హాస్టల్ రూమ్ లో శవమై కనిపించాడు. కోటాలో ఈ మధ్య స్టూడెంట్స్ ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారిపోయాయి. 2023లో ఇప్పటి వరకు 17 మంది స్టూడెంట్స్ ప్రాణాలు తీసుకున్నారంటే కోచింగ్ పేరుతో వాళ్లు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు

ర్యాంకుల వేటలో ప్రాణాలు పోతున్నాయా?

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు కోటా ఎందుకెళ్తున్నారు ? ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం ర్యాంకుల కోసం. ఈ ర్యాంకుల వేటలో విద్యార్థులు పడే మానసిక సంఘర్షణే చివరకు వారి జీవితాలను బలి చేస్తోంది. అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్, బన్సాల్ క్లాసెస్, ఫిజిక్స్ వాలా ఇలా వందలాది కోచింగ్ సెంటర్లు కోటా కేంద్రంగా ర్యాంకులతో గేమ్స్ ఆడుతున్నాయి. మీ అబ్బాయికో అమ్మాయికో ప్రెస్టీజియస్ ఇనిస్టిట్యూట్ లో సీటు రావాలంటే మా దగ్గర కోచింగ్ తీసుకోవడం ఒక్కటే మార్గం అన్న స్థాయిలో ఆయా సంస్థలు చేస్తున్న ప్రచారం చివరకు స్టూడెంట్స్ జీవితాలను సర్వనాశనం చేస్తోంది

కోచింగ్ సెంటర్ అంటేనే ప్రెజర్ కుక్కర్

విద్యార్థుల శక్తిసామర్థ్యాలతో పనిలేదు…వాళ్ల మానసిక స్థితి గురించి పట్టించుకోరు…అప్పటి వరకు వాళ్లు చదువుకున్న తీరు గురించి తెలుసుకోరు… అందరికీ ఒకటే ట్రీట్ మెంట్… మార్కులు..ర్యాంకులు…. ఈ రెండే క్రైటీరియా. ప్రజెర్ కుక్కర్ లో కూర్చోపెట్టి కింద… మంట పెట్టి.. విజిల్ రాకుండా చేస్తే లోపల ఎంత ఒత్తిడి ఉంటుందో… కోచింగ్ సెంటర్లలో అడుగు పెట్టే స్టూడెంట్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోవడం కంటే… ర్యాంకుల సాధించాలన్న తాపత్రయమే ఇక్కడ కనిపిస్తుంది.

పేరెంట్స్ కి బాధ్యత ఉండాలి కదా

కోటాలో విద్యార్థుల మరణాలకు కేవలం కోచింగ్ సెంటర్లను నిందిస్తే ఉపయోగం ఉండదు. అసలు తమ పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వాళ్ల శక్తిసామర్థ్యాలు ఏంటో తెలుసుకోకుండా చదువకంటే ఐఐటీలు, ఐఐఎంలే అన్న భ్రమల్లో బతికేస్తున్న సోకాల్డ్ తల్లిదండ్రుల పాపం కూడా విద్యార్థుల ఆత్మహత్యల వెనుక ఉందనే చెప్పాలి. పేరెంట్స్ అంచనాలకు తగ్గట్టుగా తాము చదవలేకపోతున్నామని చాలా మంది కోటా స్టూడెంట్స్ వాపోతున్నారంటే వాళ్లపై కన్నవాళ్ల ఒత్తిడి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది.

ఆత్మహత్యలు ఇప్పుడేనా గతంలో లేవా

కోటా నగరం కోచింగ్ సెంటర్లకు, ఎడ్యుకేషన్ కు హబ్ గా మారినప్పటి నుంచి అక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే 17 మంది ప్రాణాలు తీసుకుంటే… గతేడాది 16 మంది చనిపోయారు. 2019లో అయితే ఏకంగా 53 మంది తనువుచాలించారు. ఒత్తిడి చదువులకు విద్యార్థులు బలైపోవడాన్ని నియంత్రించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా… కార్పోరేట్ విద్యా సంస్థలు తమకున్న పలుకుబడితో దాన్ని అడ్డుకున్నాయి.

ర్యాంకులు కాదు ప్రాణాలు ముఖ్యం

బతికుంటే బలుసాకు తినొచ్చని పెద్దలు చెబుతారు. ఐఐటీలు, ఐఐఎంలు, పెద్ద పెద్ద ప్యాకేజీల భ్రమల్లో బతుకుతూ విలువైన విద్యార్థి జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కంటే.. పిల్లల శక్తిసామర్థ్యాలు ఎందులో ఉన్నాయో తెలుసుకుని ఆ దిశగా వాళ్లను ప్రోత్సహించడం ఉత్తమం. ఈ విషయంలో తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్లు, ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించకపోతే… కోటా కోచింగ్ సెంటర్లు యువతను హరించివేస్తూనే ఉంటాయి..