NTR Coin: స్మారక నాణేల ముద్రణకు ఎవరైనా ఆర్డర్ ఇవ్వొచ్చా..? ఎన్టీఆర్ కాయిన్‌కు ఆర్డర్ ఇచ్చిందెవరు..?
ఏదైనా రంగంలో ప్రముఖులు లేదా ఏదైనా సంస్థలు, ఘటనలు, కట్టడాలు, వాటి అర్థ శతాబ్ది, వజ్రోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు.. ఇలాంటి వాటికి గుర్తుగా నాణేలను విడుదల చేసే సంప్రదాయం భారతదేశంలో ఉంది. వీటినే స్మారక నాణేలు (కమెమోరేటివ్ కాయిన్స్) అని పిలుస్తారు.
NTR Coin: మహా నటుడు, మహా నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరిట ఇటీవల 100 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నాణేన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో స్మారక నాణేలను ఎవరైనా అచ్చు వేయించుకోవచ్చా..? దీనికి అనుసరించాల్సిన ప్రొసీడింగ్స్ ఏమిటి..? అందరూ అర్హులేనా..? అనే డౌట్స్ చాలామందికి వస్తున్నాయి. వీటికి నిపుణులు చెప్పిన సమాధానాల ప్రకారం కథనమిది.
తొలి స్మారక నాణెం.. తొలి స్మారక కరెన్సీ నోటు..
ఏదైనా రంగంలో ప్రముఖులు లేదా ఏదైనా సంస్థలు, ఘటనలు, కట్టడాలు, వాటి అర్థ శతాబ్ది, వజ్రోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు.. ఇలాంటి వాటికి గుర్తుగా నాణేలను విడుదల చేసే సంప్రదాయం భారతదేశంలో ఉంది. వీటినే స్మారక నాణేలు (కమెమోరేటివ్ కాయిన్స్) అని పిలుస్తారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు 1964లో తొలిసారిగా స్మారక నాణేన్ని విడుదల చేశారు. 1969లో గాంధీ శత జయంతికి స్మారక కరెన్సీ నోటును విడుదల చేశారు. స్మారక కరెన్సీ నోటును విడుదల చేయడం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా. ఇక అప్పటి నుంచి స్మారక నాణేలు విడుదలయ్యాయే తప్ప.. స్మారక కరెన్సీ నోట్లు విడుదల కాలేదు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ 350కి పైగా స్మారక నాణేలను విడుదల చేసింది. తంజావూరు బృహదీశ్వరాలయానికి వెయ్యేళ్లు నిండినిప్పుడు వెయ్యి రూపాయల నాణెం విడుదల చేశారు.
పురందేశ్వరి డబ్బు కట్టారా..?
మీకు తెలుసా..? ఎన్టీఆర్ స్మారక నాణెంతో పాటు ఈ ఏడాది మరో 11 విభిన్న నాణేలను విడుదల చేశారు. ఎన్టీఆర్ స్మారక నాణెం ప్రింటింగ్ కోసం బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి డబ్బు కట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇది అవాస్తవం. ఎన్టీఆర్ స్మారక నాణేల కోసం ఎవరూ ప్రభుత్వానికి, సెక్యూరిటీ ప్రెస్‌కీ డబ్బు కట్టలేదు. అయితే పురందేశ్వరి తన పలుకుబడిని ఉపయోగించి భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆర్థిక శాఖల నుంచి ఎన్టీఆర్ పేరిట నాణేలు త్వరగా తయారు చేసేలా ప్రయత్నం చేసినట్టు కొందరు అధికారులు ఓ జాతీయ మీడియా సంస్థకు చెప్పారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై భారత ప్రభుత్వం ఆర్థిక శాఖలోని ఎకనామిక్ ఎఫైర్స్ విభాగం 2023 మార్చి 20వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది. ప్రైవేటు వ్యక్తులు ఇలా స్మారక నాణేల కోసం ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు.
స్మారక నాణేలు చెల్లుతాయా..?
మూడు సింహాల గుర్తు ఉన్న స్మారక నాణేలు ముద్రించే హక్కు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు మాత్రమే ఉంటుంది. ఇది కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని సంస్థ. హైదరాబాద్‌లోని సచివాలయం దగ్గర ఉన్న మింట్ కాంపౌండ్‌గా పిలుచుకునే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇలాంటివి కోల్‌కతా, ముంబైలలో కూడా ఉన్నాయి. ‘‘నాణెంపై మూడు సింహాల రాజముద్ర ఉండాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి. అది లేకుండా అయితే, ఎవరు డబ్బు కడితే వారికి నచ్చినట్టుగా నాణెం ముద్రించి ఇస్తాం’’ అని సెక్యూరిటీ ప్రెస్ అధికార వర్గాలు తెలిపాయి. ఆ నాణెంపై పెట్టే డబ్బు విలువ అంటే రూ.75, రూ.100, రూ.125 ఇలాంటి అంకెలతో సంబంధం లేకుండా ఒక్కో నాణెంను దాదాపు రూ.5వేలకు అమ్ముతారు. సాధారణంగా మన దగ్గర ఉండే చిల్లర డబ్బుగా పిలిచే నాణేలు తప్ప.. స్మారక నాణేలు చెల్లుబాటు కావు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చలామణీలో ఉండే సాధారణ నాణేల వెనుక కూడా మూడు సింహాల ముద్రకు బదులు పలు చిహ్నాలు, వ్యక్తుల ఫొటోలు, నినాదాలను అచ్చు వేస్తారు.