ADITYA-L1 MISSION: లాగ్రాంజ్ పాయింట్-1లోనే ఎందుకు.. ఆదిత్య మిషన్ పూర్తి వివరాలు..
భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాంగ్రాజ్ పాయింట్ 1 కక్ష్యలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు. 15 వందల కిలోల బరువు ఉండే శాటిలైట్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ57 ద్వారా సూర్యుడి దిశగా ప్రయోగించబోతోంది ఇస్రో.
ADITYA-L1 MISSION: ఇస్రో చేపట్టిన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. శనివారం ఉదయం 11.50కి శ్రీహరి కోట నుంచి ఆదిత్య ఎల్1ను ప్రయోగించబోతున్నారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాంగ్రాజ్ పాయింట్ 1 కక్ష్యలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు. 15 వందల కిలోల బరువు ఉండే శాటిలైట్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ57 ద్వారా సూర్యుడి దిశగా ప్రయోగించబోతోంది ఇస్రో. సౌర కార్యకలాపాలు, అంతరిక్షంలో దాని ప్రభావంపై అధ్యయనం చేయడమే ఈ మిషన్ టార్గెట్.
భూమి నుంచి సూర్యుడి దిశగా, 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతోంది ఇస్రో. ఇదే పాయింట్‌లో శాటిలైట్‌ను ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. సూర్యుడికి దగ్గరలోనే ఉండే లాంగ్రాంజ్ పాయింట్ 1 నుంచి గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని వీక్షించే అవకాశం ఉంటుంది. దీని వల్ల పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలగదు. రాకెట్ లాంచ్ తరువాత శాటిలైట్ కక్ష్యను చేరుకునేందుకు ఆదిత్య ఎల్-1కు నాలుగు నెలల సమయం పడుతుంది. రూ.368 కోట్లతో చేపడుతున్న ఆదిత్య ఎల్1లో మొత్తం ఏడు పేలోడ్‌లను అమర్చారు. ఇందులో మూడు పేలోడ్‌లు శాటిలైట్‌ను, నాలుగు పేలోడ్‌లు సూర్యుడిని అధ్యయనం చేయనున్నాయి.
విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ ఇందులో అత్యంత కీలకం. ఇవి సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, బయటి లేయర్స్, సోలార్ రేణువులు, అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి. మూడు పేలోడ్‌లు మాత్రం కక్ష్యలో శాటిలైట్ ఉన్న ప్రాంతంలో స్థితిగతులపై అధ్యయనం చేస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షరంగంలో ఇండియా మరో ముందడుగు వేసినట్టే.