Covid: షాకింగ్.. కరోనా పుట్టుక గుట్టు విప్పిన సైంటిస్టులు
కరోనా సంక్షోభం మొదలై మూడేళ్లు గడుస్తున్న.. ప్రపంచాన్ని భయం మాత్రం ఇంకా వీడలేదు. చైనాలాంటి దేశాలు ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. వైరస్ పుట్టుకకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు.
చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారనే ఆరోపణలు ఉన్నాయ్. ఈ విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా.. సైంటిస్టులు ఇప్పుడో కొత్త విషయాన్ని బయటపెట్టారు. వుహాన్‌లోని కుక్కల్లో కరోనా ఆనవాళ్లను గుర్తించింది నిపుణుల బృందం. రకూన్ అనే జాతి కుక్కల్లో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు నిపుణుల బృందం తేల్చింది. వాటి నుంచి ఇతర జంతువులకు, మనుషులకు సోకి ఉండవచ్చుని లేదా.. వేరే జంతువుల నుంచే రకూన్ కుక్కలకు వైరస్ సోకి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అధ్యయనంలోని కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం బయటపెట్టింది. జనవరి 2020లో వుహాన్‌లోని చేపల మార్కెట్ నుంచి సేకరించిన స్వాబ్స్ ఫలితాలను సైంటిస్టులు ఎనలైజ్ చేశారు. రకూన్ కుక్కల నుంచి సేకరించిన జన్యు సమాచారానికి.. వైరస్ మూల కణానికి దగ్గరి పోలికలు ఉన్నాయ్. వుహాన్ మార్కెట్ నుంచి వచ్చిన జన్యు సమాచారంలో వైరస్ ఆనవాళ్లు కచ్చితంగా ఉన్నాయి.
ఐతే వుహాన్ ల్యాబ్, చేపల మార్కెట్ జంతువుల జన్యు సమాచారం ఏ కాలం నాటిది అన్నది తెలియాల్సి ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. రకూన్ కుక్కల నుంచి నేరుగా మనుషులకు సోకిందనటానికి ఆధారాల్లేవని, ఆ కుక్క నుంచి వైరస్ మరో జంతువులోకి ప్రవేశించి, ఆ తర్వాత మనుషులకు ప్రబలి ఉండొచ్చునని అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. కరోనా పీడ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. మనదేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయ్. దీంతో మళ్లీ టెన్షన్ మొదలైన పరిస్థితి.