Currency: 2వేల నోటు.. నువ్వెక్కడమ్మా? మన నేతలు దాచిపెట్టేశారా ?
2వేల రూపాయల మీరు చేతులతో తాకి ఎన్ని రోజులు అవుతోంది.. ఆలోచించకండి.. చాలా రోజులు అయ్యే ఉంటుంది. రోజులు కూడా కాదు నెలలు ! ఒక్క మీరే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. 2వేల రూపాయల నోటూ నువ్వెక్కడమ్మా అని అందరూ ఎదురుచూస్తున్న పరిస్థితి. 2016 నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో విడుదలైన రెండు వేల రూపాయల నోట్లు... ఇప్పుడు మార్కెట్‌లో కనిపించడం లేదు. 2016 నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన తర్వాత.. దేశ ఆర్థికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయ్. డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయ్. క్యాష్ వాడకం ఆల్‌టైమ్ హై రికార్డుస్థాయికి చేరింది. ఆరేళ్ల కింద నగదు లావాదేవీల్లో కీలకంగా మారిన పింక్ నోట్ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.
ఏటీఎంలలో ఈ నోట్లు అరుదుగా ఉంటున్నాయ్. గట్టిగా చెప్పాలంటే అసలు దొరకడం లేదు ఎవరికీ ! బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా రెండు వేల రూపాయల నోటుకు కరువు ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ ! ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 2వేల రూపాయల నోటును మన దగ్గర కొందరు బ్యాన్ చేసేశారు. ఎందుకు అంటే దీని వెనక భారీ కారణమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎన్నికల సీజన్. తెలంగాణలో మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా.. ఏపీలో ఎలక్షన్స్‌కు ఏడాది మాత్రమే సమయం ఉంది ! వచ్చే ఎన్నికల కోసం నేతలంతా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయుధాలు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. డబ్బులతో సహా ! ఇదే ఇప్పుడు 2వేల రూపాయల నోటు కనిపించకుండా పోవడానికి కారణంగా కనిపిస్తోంది.
ఓటుకు నోటు అనేది ఎన్నికల్లో కామన్ ! ఓటుకు ఇప్పుడు రేటు పెరిగింది. ఒక్కో ఓటుకు తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ లెక్కన రాష్ట్రం అంతా ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందని లెక్కలేయకండి.. కాసేపు ఊపిరి ఆగేంత ఖర్చు అవుతుంది. అంత డబ్బులను చిల్లర రూపంలో సేవ్ చేయాలంటే సాధ్యం అయ్యే పని కాదు. అందుకే 2వేల రూపాయల రూపంలో దాచిపెట్టారు.. కాదు కాదు బ్లాక్ చేశారు. అందుకే మార్కెట్‌లో పింక్ కలర్ నోటు కనిపించడం లేదు. దీనికితోడు 2019 నుంచి 2వేల రూపాయల నోటు ముద్రణను కూడా ఆర్బీఐ ఆపేసింది. వాళ్లు బ్లాక్ చేయడంతో.. వీళ్లు ప్రింట్ చేయకపోవడంతో.. 2వేల రూపాయల నోటును ఇంటర్నెట్‌లో చూసి సంబరపడాల్సి వస్తుంది జనాలకు !