Dalai-Lama: నా నాలుకను ముద్దాడుతావా.! బాలుడితో పరాచకాలు..ఆపై క్షమాపణలు..దలైలామా ఎందుకలా చేశారు ?
చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. అందులో తప్పేమీ లేదు. కానీ ఆ ముద్దు చేసే విధానం తేడా కొడితే అది కాస్తా వివాదాస్పదమవుతుంది. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుని చివరకు క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న దలైలామా ధర్మశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. M3M అనే రియల్ ఎస్టేట్ కంపెనీ 120 మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో ట్రైనింగ్ ఇచ్చింది. అందులో భాగంగా దలైలామాతో ఆ విద్యార్థులంతా ఇంట్రాక్ట్ అయ్యారు. ఆ సమయంలో ఓ విద్యార్థి దలైలామా దగ్గరకు వచ్చాడు. పెద్దాయనతో ఆప్యాయంగా మాట్లాడాడు. అంత వరకూ బాగానే ఉంది. స్టూడెంట్‌ను దగ్గరకు లాక్కున్న దలైలామా నా నాలుకను ముద్దాడుతావా అంటూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టబోయారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు ఎక్కడంతో నెటిజన్లు దలైలామా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పిల్లలను వేధించడం కిందకే వస్తాయని.. దలైలామా లాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయకుండా ఉండాల్సిందంటూ విమర్శలు గుప్పించారు.
సారీ చెప్పిన దలైలామా
ప్రపంచ వ్యాప్తంగా విమర్శల తీవ్రత పెరగడంతో దలైలామా కార్యాలయం క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. బాలుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని స్నేహితులకు క్షమాపణలు చెప్పింది. అలా ప్రవర్తించడంలో దలైలామాకు ఎలాంటి దురుద్దేశాలు లేవని.. పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా అందరినీ టీజ్ చేస్తూ మాట్లాడటం ఆయన సహజ లక్షణమని తెలిపింది.
ఇంతకీ దలైలామా ఎందుకలా చేశారు ?
దలైలామా ఎందుకలా ప్రవర్తించారో తెలియాలంటే టిబెట్ సంప్రదాయాలను అర్థం చేసుకోవాలి. మనకు ఎదురుపడ్డ వ్యక్తులను పలకరించడానికి ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం ఉంది. భారతీయ సంస్కృతిలో రెండు చేతులు జోడించి నమస్కారం చెబితే.. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ పలకరించుకుంటారు. అయితే వీటన్నింటికంటే భిన్నమైన సంప్రదాయం టిబెట్‌లో ఉంది. నాలుకను బైట పెట్టి ఎదుటి వ్యక్తిని గ్రీట్ చేయడమన్నది టిబెట్‌లో ఓ సంప్రదాయం. వినడానికి విచిత్రంగా ఉన్నా 9వ శతాబ్దం నుంచి అక్కడ ఈ సంప్రదాయం ఉంది. దీని వెనుక ఓ కారణం ఉంది. ఆ కాలంలో టిబెట్‌లో లాంగ్ ధర్మా అని ఓ రాజు ఉండేవాడు. అతని నాలుక చాలా నల్లగా ఉండేదట. పునర్జన్మలను బాగా విశ్వసించే టిబెట్ ప్రజలు ఆ రాజు చనిపోయి మళ్లీ పుట్టాడని నమ్మడం మొదలు పెట్టారు. అయితే అలా రాజుగా పుట్టిన వ్యక్తి తాము కాదు అని నిరూపించుకునేందుకు నాలుకను బయటకు పెట్టి చూపించేవారు. నల్లటి నాలుక లేకపోతే వాళ్లు రాజు కాదని భావించారు. చివరకు ఇది ఓ సంప్రదాయంగా స్థిరపడిపోయి ఇలాగే పలకరించుకునే వరకూ వచ్చింది. దలైలామా suck my tongue అని ఆ బాలుడితో పరాచకమాడటానికి కూడా అదే కారణమని ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన ప్రతినిధులు వాదిస్తున్నారు.