ఆర్జీకర్ ఆసుపత్రిలో ఎన్నో దారుణాలు.. చీకటి బాగోతాలు తెలిస్తే వణుకే..
కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన.. దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది. ఇంతటి దారుణానికి తెగించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. దేశమంతా ఒక్క గొంతుకై నినదిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ప్రతీది అనుమానంగానే కనిపిస్తోంది. నిందితుడు సంజయ్ నుంచి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ వరకు.. హడావుడిగా కేసు ముగించాలనుకున్న పోలీసుల నుంచి.. అధికారుల తీరు వరకు.. హత్యాచారం వెనక భారీ కుట్ర ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఇక అటు గతంలో ఈ మెడికల్ కాలేజీలో ఎన్నో దారుణాలు జరిగాయ్. వాటన్నింటిని పక్కదారి పట్టించి.. ఎలాంటి కేసు లేకుండా చేశారు. ఇప్పుడు డాక్టర్ హత్యాచార ఘటనలోనూ అదే జరుగుతుందా అనే భయాలు కనిపిస్తున్నాయ్. ట్రైనీ డాక్టర్ హత్య జరిగిన మెడికల్ కాలేజీ ఆసుపత్రికి 138 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా నడస్తుందనే ప్రచారం ఉంది. ఇదంతా ఎలా ఉన్నా.. గతంలో ఈ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరిగిన ఘోరాలు.. మరిన్ని భయాలు సృష్టిస్తున్నాయ్.
ట్రైనీ డాక్టర్ చనిపోయిన ఈ బిల్డింగ్‌లోనే 2020లో ఓ విద్యార్థిని శవం కనిపించింది. అసలు ఏమైందో.. ఎందుకు శవంగా మారిందో ఇప్పటికీ తేలలేదు.. కాదు కాదు తేల్చలేదు. ట్రైనీ డాక్టర్ కేసులో జరిగినట్లే.. సూసైడ్ అని పోలీసులు కేసు క్లోజ్ చేశారు. 2020లో కరోనా ప్రభావంతో ఈ మరణాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ కేసు కాస్త నీరుగారిపోయింది. 2003లో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఒకరు.. మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు నరాల్లోకి డ్రగ్స్ ఎక్కించుకొని మరీ.. ఆ తర్వాత సర్జికల్ బ్లేడ్‌లతో కట్ చేసుకొని బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు. ఈ ఘటనపై విచారణకు కమిటీ వేసినా.. కారణమేమీ తేల్చకుండానే కేసును పక్కదారి పట్టించారు. క్లోజ్ చేసేశారు. అంతకుముందు 2001లో సౌమిత్రా బిశ్వాస్ అనే మరో విద్యార్థి.. ఇదే కాలేజీలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. హాస్టల్ రూమ్‌లో ఉరేసుకొని చనిపోయాడు. దీనికి కారణం ఏంటి అని ఇప్పటికీ తెలియలేదు. కేసును పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఐతే సౌమిత్రా బిశ్వాస్ మరణం వెనక రకరకాల అనుమానాలు వినిపించాయ్. ఆసుపత్రి సిబ్బందితో కలిసి కొందరు విద్యార్థులు.. అడల్ట్ వీడియోలు షూట్ చేసేవారట. అది కనిపెట్టిన సౌమిత్రా.. వారిని ఎదురించాడు. అది జరిగిన కొద్దిరోజుల తర్వాత సౌమిత్రా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం.. ఆ కేసును ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యం పెద్దగా పట్టించుకోకపోవడం.. కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు డాక్టర్ కేసును కూడా.. మొదట్లో హడావుడి చేసి ఆ తర్వాత కూల్ చేస్తారా.. న్యాయం జరుగుతుందా లేదా అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఐతే ఆర్జీకర్ ఆసుపత్రిలో చాలా చీకటిబాగోతాలు ఉన్నాయని.. ఇప్పటికైనా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్న వారు మరికొందరు.