Delhi Panipuri: బుల్లెట్టు బండెక్కి అమ్మెత్తపా.. రుచికరమైన పానీపూరీ..!
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ళ కవితకు కాదు ఏది అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగా.. చేతిప్రతిభ, ఆత్మ విశ్వాసం, మనో సంకల్పం ఉండాలే గానీ ఏపనికైనా మనం అర్హులమే అని చెప్పాలి. సరిగ్గా ఇక్కడ ఇదే జరిగింది. ఆమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్. వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు. తనలోని సృజనాత్మకతను తట్టిలేపింది. పదిమందికి ఆదర్శంగా నిలిచింది. ప్రజల అభిరుచిని గుర్తించి తన చేతి పానీపూరీ రుచిని చూపిస్తుంది.
ప్రస్తుత సమాజంలో ఎన్ని చదువులు చదివినా ఏంతకూ అక్కరరాకుంది. పొందిన డిగ్రీలకు, చేసే పనికి ఎక్కడా పొంతనే కుదరడం లేదు. పైగా కళాశాలలో ఎంత పెద్ద విద్యను అభ్యసించినా తిరిగి ఏదో ఒక కోర్సును చేయాల్సిన కొసరు పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక స్థోమత బాగుండే వారైతే చదివించగలరు. ఈ కాలంలో చదువులు అంటే కొనడమే అనేలా మారిపోయింది. సామాన్య నిరుపేద కుటుంబాలు ఈ చదువుకు పెట్టే ఖర్చును ఏదో ఒక వ్యాపారానికి పెడితే కొంతో గొప్పో లాభాన్ని పొందుతూ జీవనాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. చిరువ్యాపారాలన్నీ అలా మొదలు పెట్టినవే. ఇంటి బయట రోట్టెలు చేయడం మొదలు ఉదయాన్నే పాలు అమ్మడం వరకూ అన్నీ చిరువ్యాపారాలే. ఇలా చేసుకుంటూ అంబానీలు అయిన వారూ ఉన్నారు. ఆర్థిక స్థితి తారుమారైన వారూ ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అమ్మాయి పైరెండింటికి భిన్నంగా ఆదర్శంగా మారారు. బీటెక్ అనే ఉన్నత విద్యను చదివింది. ఇప్పటి కాలంలో ఉద్యోగాలు అంటే ఎంత కష్టమో చేసేవాళ్లకు తెలుస్తుంది. చేయాలని ప్రయత్నాలు చేసిన వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమౌతుంది. ఉపాధి అవకాశాలు వెతుక్కోవడం మొదలు రెజ్యూమ్ ప్రిప్రేర్ చేసుకోవడం వరకూ ఆఫీస్ లొకేషన్ కనుక్కోవడం మొదలు ఇంటర్వూ విజయవంతంగా ఫేస్ చేయడం వరకూ అడుగడుగునా అన్నీ అవరోధాలే. ఇంతటి ముళ్ళపోదను దాటుకొని ఏ పదికో పాతికకో పనిచేసి కుటుంబాన్ని నెట్టుకు రావడం అంటే అంత సులువైన పనికాదు. పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇవన్నీ అబ్బాయిలైతే అలవోకగా చేస్తారనే నానుడి ఉండి ఉండవచ్చు కానీ వారికి కూడా అసాధ్యమే. ఇక అమ్మాయిల విషయాని కొస్తే మరీ కష్టం అనే చెప్పాలి. ఇంటి గుమ్మం దాటిన మొదలు ఆఫీసుకు చేరుకునే వరకూ ఎన్ని అవాంతరాలో ఆకతాయి ఇబ్బందులనో ఎదుర్కోవల్సి వస్తుంది. ఇక ఆఫీసులోనైనా హాయిగా ఉండచ్చు అనుకుంటే కొన్ని ఆఫీసుల్లో అమ్మాయిలను వేధించే కీచకులూ ఉంటారు. వీరిని ఎదుర్కోవడం అంటే పెద్ద పరిశ్రమే అవుతుంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే అమ్మాయి అలాంటి పరిస్థితులన్నింటికీ తన తెలివి అనే అలలతో చెరిపేసింది. ఇప్పుడు ఉన్న సమాజా నాడిని పట్టుకొని ఢిల్లీ తిలక్ రోడ్డు మెట్రోస్టేషన్ గేట్ నంబర్ 4 దగ్గర పానీ పూరీ వ్యాపారం చేస్తుంది. పానీపూరీ వ్యాపారం చేయడం ఏమంత వింత అని మీకు సందేహం కలుగవచ్చు. ఆవిధంగా అమ్మేందుకు చేసిన సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసలే అది బులెట్ బండి. దానికి తోకలాగా వెనుక పానీపూరీ ఫ్రేంతో ఏర్పాటు చేసిన సెటప్. బైక్ కు పానీ పూరీ సెటప్ ను అనుసంధానం చేసి ఢిల్లీ పురవీధుల గుండా ఎంచక్కా డుగ్గు.. డుగ్గు అంటూ పానీ పూరీని ఢిల్లీ నగర వాసులకు రుచి చూపించేందుకు సంకల్పించింది. నీవు బీటెక్ చేశావు మంచి ఉద్యోగం తెచ్చుకో.. లేకుంటే ఇక్కడ రోడ్డుపై ఇలాంటి పని కాకుండా ఇంట్లో పని చేసుకో అని చాలా మంది ఆమెకు ఉచిత సలహాలు ఇచ్చారు. అయినప్పటికీ పట్టువిడవని విక్రమార్కునిలా, కత్తి విడువని రుద్రమదేవిలా వ్యాపారం చేస్తుంది.
పానీ పూరీ చాలా రుచికరంగా అద్భుతంగా ఉంటుందని అక్కడ తిన్న వారు చెబుతారు. ఇంత రుచికరంగా ఉండేందుకు అందులో కలిపే పదార్థాలను కూడా చెప్పుకొచ్చింది ఈ అమ్మాయి. ధనియాలు, జిలకర్ర, ఉప్పును చేతితో కావల్సినంత మెత్తగా దంచుతారట. అలాగే అందులో కొత్తిమీర, మిర్చీ వేసి పానీ తయారు చేస్తామని వివరించింది. పూరీ తినేందుకు పర్యావరణానికి హానికలుగని ఆకులతో చేసిన చిన్న దొన్నెలను వినియోగిస్తుంది. అక్కడ వారికి ఇందులో తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం అని తెలిపింది. ఇలా రుచికరంగా రావడానికి చట్నీనే ప్రదాన కారణం. దీనిని చింతపండు, బెల్లంతో తయారు చేస్తారని చెప్పింది. ఇక్కడ పూరీలో రెండురకాలు ఉంటాయట. ఒకటి నూనెతో కాల్చిన పూరీ, మరొకటి మైదా లేకుండా చేసిన పూరీ. ఇక్కడ పానీపూరీ తింటే కడుపు నిండుతుందేమో కానీ మనస్సు నిండదంట. అంటే ఇంకా తినాలి తినాలి అనిపిస్తుందట. ఇది అక్కడ తిన్న వాళ్లు చెప్పిన మాట. మీరుకూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒకసారి టేస్త్ చేయండి. అదే నగరంలో ఉంటే వెళ్ళి తినేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ యుగంలో అన్నీ ఆర్డర్ చేయడం అలవాటు. అలాగే ఇదికూడా ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించద్దు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కష్టం.
View this post on Instagram
T.V.SRIKAR