Dengue virus: దేశానికి డెంగీ దడ! వ్యాక్సిన్ అభివృద్ధి చేయకపోతే పెను ముప్పు తప్పదా?
కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.. పాత వ్యాధులు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి.. ఉనికిలోనే ఉన్న మరికొన్ని రోగాలు రూపాలు మార్చుకొని పెను ముప్పును తీసుకొస్తున్నాయి.. దేశానికి డెంగీ ముప్పు పొంచి ఉందట.. ఇది పరిశోధకుల హెచ్చరిక.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులంట.. వ్యాక్సిన్‌ను అర్జంట్‌గా అభివృద్ధి చేయాల్సిందేనంటా..! దేశంలో డెంగీ వ్యాప్తిపై రిసెర్చ్ చేస్తున్న ఓ పరిశోధనా బృందం చెప్పిన మాటలివి..! గత 50 ఏళ్లలో దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి కేసులు క్రమంగా పెరిగాయయిని లెక్కలు చెబుతున్నాయి.
డెంగీ అంటే?
డెంగీ వైరస్ ఫ్లావివిరిడే కుటుంబానికి చెందినది. నాలుగు సెరోటైప్లను కలిగి ఉన్న ఈ వైరస్ దోమ కాటు ద్వారా మన బాడీలోకి ప్రవేశిస్తుంది. ఈ జ్వరం వచ్చిన వారిలో వైరస్ వారి శరీర రోగ నిరోధక వ్యవస్థపై అటాక్ చేస్తుంది. దీని వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. ప్లేట్‌లెట్ సంఖ్య ఉండాల్సినంత లేకపోతే శరీర రోగ నిరోధక వ్యవస్థకు సరిగ్గా పనిచేయదు.. అప్పుడు ఎలాంటి వైరస్‌పైనైనా పోరాడే శక్తి తగ్గిపోతుంది. క్రమంగా వైరస్ తీవ్రత ఎక్కువై జ్వరం పెరుగుతుంది. ఫీవర్‌తో పాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. జలుబు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, బలహీనత, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలుంటాయి.
రీఇన్‌ఫెక్షన్ ముప్పు!
ఐఐఎస్సీ(IISC) పరిశోధకులు 1956-2018 మధ్య కాలంలో డెంగీ సోకిన 408మంది జన్యు క్రమాలను పరిశీలించారు. 2012 వరకు భారత్‌లో డెంగీ 1,3 సెరోటైప్‌లను ప్రధాన జాతులుగా గుర్తించారు. కానీ ఇటీవలి కాలంలో డెంగీ-2 సెరోటైప్ దేశవ్యాప్తంగా మరింత వ్యాప్తి చెందింది. కరోనా లాగే ఈ వైరల్ ఫీవర్ రాకుండా ఉండేందుకు యాంటీబాడీలు కీలకపాత్ర పోషిస్తాయి.. కరోనా వచ్చిన చాలా నెలల వరకు మళ్లీ రీఇన్‌ఫెక్షన్ ఎలాగైతే రాదో.. డెంగీ కూడా ఒకసారి వస్తే మళ్లీ సోకడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రాధమిక సంక్రమణ తర్వాత మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు సుమారు 2-3 సంవత్సరాల వరకు అన్ని సెరోటైప్ల నుంచి పూర్తి రక్షణను అందిస్తాయి. ఆ తర్వాత యాంటీబాడీ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతాయి.
టీకా లేకపోతే కష్టమేనా?
దేశంలో డెంగీ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉన్నప్పటికీ.. ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. సీరం, పనాసియా బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. ఇది ఎప్పటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.. మరో రెండు నెలల్లో వాన కాలం మొదలువుతుంది.. డెంగీ కేసులు పెరిగే సీజన్ అది.. ఈ లోపు టీకా రావడం సాధ్యంకాదు.. కాబట్టి ప్రజలే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. నిజానికి రెండేళ్ల క్రితమే భారత్‌లో డెంగీ టీకా అందుబాటులోకి వస్తుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. జపాన్‌కు చెందిన ‘తకేడా’ ఫార్మా తాను అభివృద్ధి చేసిన టీకాను మన దేశంలో విడుదల చేయడానికి ప్రయత్నించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో DCGIతో సంప్రదింపులు జరిపింది. అయితే డీసీజిఐ ఇప్పటికి ఇప్పుడు అనుమతిచ్చినా దేశంలో తకేడా కంపెనీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయడానికి టైమ్ పడుతుంది.. అందుకే టీకా వచ్చే వరకైనా మన జాగ్రత్తలో మనముంటే మంచిది..